కలెక్టర్లు, అధికారులతో సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్
గులాబ్ తుపాను, అనంతర పరిస్థితులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తుపాను ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. తుపాను అనంతర పరిస్థితులను సీఎస్ ఆదిత్య నాథ్ దాస్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వివరించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ వర్షం తగ్గుముఖం పట్టగానే యుద్ద ప్రాతిపదికన విద్యుత్‌ను పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి అరగంటకూ విద్యుత్, పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం తెచ్చుకోవాలని సూచించారు. ఈ మేరకు వెంటనే చర్యలు తీసుకుని, విద్యుత్‌ను పునరుద్ధరించాలని ఆదేశించారు.
మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున వెంటనే ఇవ్వాలని ఆదేశించారు. బాధిత ప్రాంతాల్లో మానవతా దృక్పథంతో ఉదారంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. బాధితులకు సహాయం చేయడంలో వెనకడుగు వేయొద్దని అన్నారు. సహాయ శిబిరాల్లో అందించే ఆహారం నాణ్యంగా ఉండాలని, మంచి వైద్యం, రక్షిత తాగునీరు అందించాలన్నారు. అవసరమైన అన్నిచోట్లా సహాయక శిబిరాలను తెరవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.













