పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్నాం…వై.ఎస్. జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని, వాతావరణానికి, ప్రజలకు హానికరమైన వ్యర్థాల తొలగింపులో అత్యుత్తమ విధానాలు పాటించాలని చెప్పారు. ఇందుకు కొత్తగా వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) కార్యక్రమాలపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో గ్రేడ్ 2, గ్రేడ్ 3 నగర పంచాయతీలకు క్లాప్ కింద నిర్దేశించిన వాహనాలన్నింటినీ ఆయా ఊళ్లకు త్వరగా చేరవేయాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్లు (ఎస్‌డబ్ల్యూపీసీ), అర్బన్‌లో 72 చోట్ల ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజిమెంట్ (ఐఎస్‌డబ్ల్యూఎం) ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని, జూన్ 2022 నాటికి ఈ మొత్తం ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు వివరించారు.













