లాక్డౌన్ పరిస్థితులు రాకుండా చూడండి : సీఎం జగన్
ఏపీలో లాక్డౌన్ అన్న విషయం కుదిరేది కాదని సీఎం జగన్ తేల్చి చెప్పారు. రాష్ట్రంలో మళ్లీ లాక్డౌన్ పరిస్థితులు వస్తే ఆర్థిక వ్యవస్థ సర్వ భ్రష్టం చెంది, దెబ్బతింటుందని అధికారులతో సీఎం వ్యాఖ్యానించారు. మొదటిసారి లాక్డౌన్ వల్లే రాష్ట్రానికి 21 వేల కోట్ల భారీ నష్టం వాటిల్లందని అన్నారు. లాక్డౌన్ లాంటి పరిస్థితుల్లోకి రాష్ట్రం వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను కోరారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. వ్యాక్సిన్ల కొరత ఏమాత్రం రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కోవిడ్ పేరుతో దోపిడీ జరగడానికి వీల్లేదని, ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే చికిత్స జరగాలని సీఎం స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అధిక ఫీజుల విషయంలో ఫిర్యాదులు వస్తే మాత్రం వెంటనే స్పందించి, చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మాస్క్ ధరించని వారి విషయంలో చాలా కఠినంగా ఉండాలని, కరోనా వచ్చిన వారు 104 కి ఫోన్ చేస్తే బెడ్ సమకూర్చాలని సూచించారు. కోవిడ్ కేర్ సెంటర్ల ద్వారా గతంలో ఏ విధమైన సేవలు అందిచామో, ఇప్పుడూ అదే విధంగా పనిచేయాలన్నారు. కోవిడ్ కిట్లను అందుబాటులో ఉంచుకోవాలని, పేషంట్లకు ఉచితంగా సేవలు అందించాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు 4 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రోజుకు 2 లక్షల మందికి టీకాలు అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు.













