ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. మార్చి 1 నుంచి ఇంటింటికీ ఓ డాక్టర్
ఏపీ ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. పూర్తిస్థాయలో ఫ్యామిలీ డాక్టర్ కాన్పెప్ట్‌ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఈ రోజు(శుక్రవారం) వైద్యశాఖకు సంబంధించి సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత శాఖ మంత్రి విడదల రజిని, రాష్ట్ర సీఎస్ జవహార్‌రెడ్డి, ఉన్నతాధికారులతో జగన్ సమావేశమయ్యారు. పలు కీలక విషయాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో మార్చి 1 నుంచి పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ కాన్పెప్ట్ అమలు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.
అంతేకాకుండా ఈ విధానం సక్రమంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలది, ప్రజాప్రతినిథులేనని హెచ్చరించిన జగన్.. ఈ పథకం ప్రారంభమైన రోజు నుంచే సదరు నేతలు ఆసుపత్రులను సందర్శించడం ప్రారంభించాలని సూచించారు. అలాగే గోరుముద్ద పథకం గురించి అధికారులతో చర్చించిన సీఎం.. ఇకపై కచ్చితంగా వారానికి 3సార్లు పిల్లలకు రాగిమాల్ట్ అందించాలని సూచించారు. ఇక చివరిగా ఇప్పటికే ఉన్న, కొత్తగా నిర్మిస్తున్న అన్ని బోధనాసుపత్రుల్లో క్యాన్సర్ నివారణా పరికరాలు, చికిత్సలతోపాటు, కాథ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.













