జగన్ సర్కారుపై సుప్రీం సంచలన వ్యాఖ్యలు.. సీఎం రాజీనామా చేయాలని వర్ల రామయ్య డిమాండ్
సుప్రీంకోర్టు అన్ని చీవాట్లు పెట్టిన తర్వాత సీఎం జగన్‌కు ఏమాత్రం నైతికత ఉన్నా పదవికి రాజీనామా చేయాలని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. సొంత కక్ష సాధింపు చర్యల్లో తమను భాగస్వాములు చేయొద్దని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు జగన్ ప్రభుత్వానికి చెంపపెట్టు అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడైన వర్ల రామయ్య విమర్శించారు. జగన్ ఈ రాష్ట్రానికి పట్టిన గ్రహణం అని, ప్రజలే దాన్ని వదిలించుకోవాలని సూచించారు. బుధవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘జగన్ ప్రభుత్వం ఎలాంటి సిగ్గు లేనట్లు ప్రవర్తిస్తోందని ఏకంగా సుప్రీంకోర్టు చెప్పకనే చెప్పింది. సొంత పగల కోసం సర్వోన్నత న్యాయస్థానాన్ని వాడుకోవడానికి ప్రయత్నించడం నిజంగా హాస్యాస్పదం. మీకు నిజంగా ఏమాత్రం నైతిక విలువలైనా ఉంటే.. సుప్రీంకోర్టు వేసిన మొట్టికాయలకు సీఎం పదవికి రాజీనామా చేసి వెళ్లిపోవాలి. మీ స్థానంలో ఎన్టీఆర్, చంద్రబాబు, నీలం సంజీవరెడ్డి, బ్రహ్మానందరెడ్డి వంటి వారు ఉండి ఉంటే ఈ అవమానం తట్టుకోలేక రాజీనామా చేసేవారు. అసలు 2012లోనే ఈ సీఎంపై ఉన్న సీబీఐ కేసుల్లో సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వాటితోనే మీరు రాజకీయంగా పతనం అయిపోయారు. ఇప్పుడు రాష్ట్రంలో సీఐడీని మీ వ్యక్తిగత కక్షపూరిత రాజకీయాల కోసమే పెట్టిన సంస్థలా వాడుకుంటున్నారు. మూడున్నరేళ్లలో రాష్ట్రానికి ఏం చెయ్యలేదు. ప్రత్యర్థులను మాత్రం అరెస్టు చేసి కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. ఇంతమందిని అరెస్టు చేస్తున్న సీఐడీ.. ఒక్క కేసులో కూడా చార్జిషీట్ వేయలేదంటేనే ఈ ప్రభుత్వం ఆ సంస్థను ఎలా వాడుకుంటుందో తెలుస్తోంది. మీ దుష్టపాలనలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగబద్ధ పాలన లేవు. ప్రభుత్వంలో పారదర్శకత అనేదే కనుమరుగైంది’’ అని వర్లరామయ్య మండిపడ్డారు.













