మార్పులు, చేర్పులు వైసీపీని గట్టెక్కిస్తాయా…?
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అందరి చూపూ అధికార పార్టీ వైసీపీ పైనే ఉంది. గత ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో అధికారాన్ని కైవసం చేసుకుంది ఆ పార్టీ. ఇప్పుడు అంతకు మించి 175 సీట్లలోనూ గెలవాలని టార్గెట్ గా పెట్టుకున్నారు ఆ పార్టీ అధినేత జగన్. ఇందుకోసం ఆయన తనదైన శైలిలో వ్యూహాలు రచిస్తున్నారు. ముఖ్యంగా సిట్టింగుల్లో పలువురికి మొండి చేయి చూపారు. మరికొందరికి స్థాన చలనం కల్పిస్తున్నారు. ఇలా చేయడం వల్ల పార్టీకి మేలు జరుగుతుందా.. కీడు జరుగుతుందా అనే ప్రశ్నలు ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నాయి.
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఇక 30 ఏళ్లు తమదే అధికారమని.. టీడీపీ తట్టాబుట్టా సర్దుకోవాల్సిందేనని ఆ పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. జగన్ కు ఇక తిరుగుండదని.. ఆంధ్రప్రదేశ్ లో రాజన్న రాజ్యం తీసుకొస్తారని హామీ ఇచ్చారు. సంక్షేమంపై ఎక్కువ ఫోకస్ పెట్టిన జగన్.. ఏపీలోని 90 శాతం కుటుంబాలకు ఏదో ఒక రూపంలో లబ్ది చేకూర్చేందుకు వివిధ పథకాలు అమలు చేస్తున్నారు. ఇవే తమను కచ్చితంగా గట్టెక్కిస్తాయని వైసీపీ నేతలు గట్టిగా నమ్ముతున్నారు. అయితే రాష్ట్రంలో అభివృద్ధి లేదని.. ఇది రాష్ట్ర భవిష్యత్తుకు ఏమాత్రం మంచిది కాదనేది మరికొందరి వాదన.
ఈ విషయాలను పక్కన పెడితే ఇప్పుడు మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇందుకోసం అభ్యర్థులను ఖరారు చేసే పనిలో బిజీగా ఉన్నారు వైసీపీ అధినేత జగన్. గతంలో సిట్టింగులందరికీ సీట్లు ఖాయమని.. ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేసుకోవాలని చెప్పారు. దీంతో గడప గడపా తిరిగారు ప్రజాప్రతినిధులు. అయితే తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత జగన్ అప్రమత్తమయ్యారు. సిట్టింగులందరికీ సీట్లు ఇస్తే బీఆర్ఎస్ లాగా బోల్తా పడే అవకాశం ఉందని గ్రహించారు. ఇదే సమయంలో ఐప్యాక్ సర్వే కూడా ప్రతికూల ఫలితాలనే ఇవ్వడంతో జగన్ ఇక ఏమాత్రం తాత్సారం చేయకూడదనుకున్నారు.
అందుకే కష్టమైనా నష్టమైనా తాను అనుకున్నది చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు జగన్. ఇప్పటి వరకూ దాదాపు 60కి పైగా స్థానాల్లో అభ్యర్థులను మార్చారు. వీళ్లలో దాదాపు 30 సిట్టింగులకు సీట్లు నిరాకరించారు. దీంతో ఇలాంటి వాళ్లంతా అసంతృప్తితో రగిలిపోతున్నారు. మరికొంతమంది ఇప్పటికే పార్టీలు మారిపోయారు. లావు శ్రీకృష్ణదేవరాయలు, బాలశౌరి, సంజీవ్ కుమార్, ఆళ్ల రామకృష్ణారెడ్డి, కాపు రామచంద్రా రెడ్డి, వంశీకృష్ణ యాదవ్, కొలుసు పార్థసారథి లాంటి నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. త్వరలోనే మరికొంతమంది పార్టీ వీడతారని సమాచారం. మొత్తానికి సిట్టింగులకు సీట్లు నిరాకరించడం, మరికొందరికి స్థానచలనం కల్పించడంతో పార్టీలో గందరగోళం నెలకొంది. ఇప్పటికే అక్కడ సీటుపై ఆశలు పెట్టుకున్నవాళ్లు కొత్త వాళ్లకు సహకరించేందుకు సిద్ధంగా లేరు. దీంతో ఈ అసంతృప్తులు పార్టీని ఎక్కడ కొంప ముంచుతాయోననే భయం వైసీపీ నేతలకు పట్టుకుంది.













