వచ్చే రెండు నెలలు అప్రమత్తంగా ఉండాలి : వైఎస్ జగన్
45 ఏళ్లకు పైబడ్డవారు, గర్భవతుల తర్వాత టీచర్లకు వ్యాక్సినేషన్లో అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కోవిడ్ నియంత్రణ, వైద్య రంగంలో నాడు-నేడుపై సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఆగస్టు 16వ తేదీన పాఠశాలలు పున ప్రారంభానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో వీలైనంత తర్వగా టీచర్లకు వ్యాక్సినేషన్ పక్రియ పూర్తి చేయాలని తెలిపారు. కోవిడ్ ప్రోటోకాల్స్‌ను తప్పనిసరిగా పాటించేలా చూడాలని స్పష్టం చేశారు. ఎక్కడా కూడా పెద్ద ఎత్తున జనం గుమిగూడకుండా చూడాలని సూచించారు.
పెళ్లిళ్ల సీజన్లో పెద్ద ఎత్తున ప్రజలు ఒక చోటకు వచ్చే అవకాశాలున్నాయి. శుభకార్యాల్లో వీలైనంత తక్కువ మంది ఉండేలా చూడాలి. పెళ్లిల్లో 150 మంది మాత్రమే ఉండాలి. కోవిడ్ నివారణ చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి అని అధికారులను ఆదేశించారు. వ్యాక్సినేషన్ పక్రియ జోరుగా సాగేంతవరకూ జాగ్రత్తలు తప్పనిసరని స్పష్టం చేశారు. రెండు నెలలపాటు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆర్టీపీసీఆర్ టెస్టులు మాత్రమే చేయాలని, ఆ పరీక్షల్లో కచ్చితమైన నిర్ధారణలు వస్తాయని గుర్తు చేశారు. ఇంటింటీ సర్వే కొనసాగాలని, లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు చేయాలన్నారు. 104 నంబర్ యంత్రాంగం సమర్థంగా సేవలందించేలా నిరంతరం పర్యవేక్షణ, సమీక్ష చేయాలని సూచించారు.













