YS Jagan: లిక్కర్ స్కాంలో జగన్ పేరు..!? ఈడీ, సీబీఐ విచారణకు రంగం సిద్ధం..?
ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కాం వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. గత వైఎస్సార్సీపీ (YSRCP) ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ కుంభకోణం గురించి తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ (TDP) నేత, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు (Lavu Sri Krishnadevaryalu) లోక్సభలో ప్రస్తావించడంతో ఈ విషయం జాతీయ స్థాయిలో సంచలనంగా మారింది. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) జోక్యం చేసుకునే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో (Home Minister Amith Shah) లావు శ్రీకృష్ణ దేవరాయలు చర్చలు జరిపినట్లు సమాచారం. ఒకవేళ ఈ దర్యాప్తు కేంద్ర సంస్థల పరిధిలోకి వెళితే, ఈ కేసు రాష్ట్ర రాజకీయాలను మరింత కుదిపేసే అవకాశం ఉంది.
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan) పాలనలో భారీ అవినీతి జరిగిందని లోక్ సభలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆరోపించారు. ఈ కుంభకోణంలో సుమారు రూ.4వేల కోట్లు దేశ సరిహద్దులు దాటి విదేశాలకు తరలివెళ్లిందని ఆయన పేర్కొన్నారు. ఈ అంశాలను కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. అనంతరం అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడును కలిసి, ఢిల్లీలో జరిగిన పరిణామాలను వివరించారు. ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలు జోక్యం చేసుకోవాలని టీడీపీ నేతలు కోరుతున్నట్టు సమాచారం.
జగన్ సన్నిహితుడు, APBCL కార్పొరేషన్ ఎండీగా ఉన్న వాసుదేవరెడ్డి (Vasudeva Reddy) ఇచ్చిన వాంగ్మూలం ఇప్పుడు దర్యాప్తుకు ఆధారంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. వాసుదేవరెడ్డి ఇచ్చిన సమాచారం ఆధారంగా జగన్ చుట్టూ ఉచ్చు బిగుస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ కేసు కేంద్ర సంస్థల పరిధిలోకి వెళితే, జగన్తో పాటు వైఎస్సార్సీపీలోని పలువురు కీలక నేతలు కూడా ఇరుక్కునే పరిస్థితి ఏర్పడవచ్చు. ఎంపీ మిథున్ రెడ్డి (Mithun Reddy) ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారం రాష్ట్రంలో అధికార టీడీపీ-బీజేపీ-జనసేన కూటమికి రాజకీయంగా లబ్ధి చేకూర్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వం లిక్కర్ పాలసీని మార్చడం, నకిలీ మద్యం విక్రయాలు, అక్రమ లావాదేవీల ద్వారా భారీ మొత్తంలో నిధులు సమీకరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నిధులు విదేశీ బ్యాంకు ఖాతాలకు తరలించబడ్డాయని, దీనికి ఆధారాలు ఉన్నాయని టీడీపీ (TDP) నేతలు పేర్కొంటున్నారు. ఒకవేళ ఈడీ (ED), సీబీఐ (CBI) ఈ కేసులో దర్యాప్తు ప్రారంభిస్తే, ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులకు దారితీసే అవకాశం ఉంది. జగన్ పై ఇప్పటికే ఈడీ, సీబీఐ కేసులున్నాయి. పదకొండేళ్లుగా వీటిపై విచారణ కొనసాగుతోంది. ఇప్పుడు లిక్కర్ స్కాంలో కూడా జగన్ పేరు బలంగా వినిపిస్తంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవడంతో ఉచ్చు బిగుసుకోవడం ఖాయమని భావిస్తున్నారు. అదే జరిగితే వైఎస్సార్సీపీకి రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది.













