మోదీతో వైఎస్ జగన్ భేటీ
ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో వైసీపీ శాసనసభాపక్ష నేత జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్న జగన్ నేరుగా లోకకల్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసాని వెళ్లారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన మోదీకి జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రిగా తన ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలని ప్రధానిని జగన్ ఆహ్వానించారు. దాదాపు గంట 20 నిముషాలపాటు జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలోని సమస్యలను జగన్ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. విభజన చట్టంలోని హామీలను సత్వరమే నెరవేర్చాలని కోరారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను వివరించి కేంద్రం సాయం అందించాలని విన్నవించారు. మోదీని కలిసిన బృందంలో లోక్‌సభకు తొలిసారి ఎన్నికైన ఇద్దరు ఎంపీలు ఉన్నారు. రాజమహేంద్రవరం, బాపట్ల ఎంపీలు మార్గాని భరత్, నందిగం సురేష్‌తోపాటు ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి, మిధున్‌రెడ్డి సీఎల్ ఎల్వీ సుబ్రమణ్యం ఉన్నారు.













