Jagan: కుటుంబ కలహాల మధ్య తల్లిని కలిసిన జగన్ ..వైరల్ అవుతున్న వీడియోలు..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress party) అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) , తన తల్లి వైఎస్ విజయమ్మ (YS Vijayamma) మధ్య విభేదాలు గత కొంతకాలంగా కొనసాగుతున్నాయి. ప్రత్యేకంగా సరస్వతి పవర్ కంపెనీ (Saraswathi Power company) షేర్ల వివాదం కారణంగా, ఈ కుటుంబంలో విభజన స్పష్టంగా కనబడింది. ఒకవైపు విజయమ్మ, ఆమె కూతురు వైఎస్ షర్మిల (Y. S. Sharmila) కలిసి ఒక వర్గంగా నిలిచారు, మరోవైపు జగన్ తన భార్య వైఎస్ భారతితో కలిసి మరో వర్గంగా మారిపోయారు. ఈ షేర్ల వివాదం నేరుగా కోర్టు వరకు వెళ్లడం, పరస్పర ఆరోపణలు చేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.
ఈ నేపథ్యంలో చాలా కాలంగా జగన్ తన తల్లిని కలవలేదు. విజయమ్మ కూడా తన కూతురు షర్మిలతో కలిసి హైదరాబాద్లో ఉంటూ, రాజకీయంగా జగన్కు వ్యతిరేకంగా వైఖరిని కొనసాగిస్తున్నారు. గతంలో షర్మిల కుమారుడి వివాహానికి హాజరైనప్పటికీ, జగన్, షర్మిల మధ్య అంతగా మాట్లాడుకోవడం జరగలేదు. వారిద్దరి మధ్య కొనసాగుతున్న రాజకీయ విభేదాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. 2024 ఎన్నికల్లో జగన్ ఓటమికి ఈ కుటుంబ విభేదాలు ప్రధాన కారణం అనడంలో ఎటువంటి డౌట్ లేదు.
అయితే, ఇటీవల జరిగిన ఒక కుటుంబ ఘటన ఈ పరిస్థితిని తాత్కాలికంగా మార్చింది. వైఎస్ జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయం తెలిసిన వెంటనే విజయమ్మ తన కూతురుతో కలిసి హైదరాబాద్ నుండి ప్రకాశం జిల్లాలోని మేదరమెట్లకు వెళ్లారు. మరుసటి రోజు జగన్ కూడా మేదరమెట్లకు చేరుకుని బాబాయి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా జగన్ చాలా రోజుల తర్వాత తన తల్లిని ఎదుర్కొన్నారు. విజయమ్మ కూడా చాలా కాలం తర్వాత తన కుమారుడిని చూడటం వల్ల భావోద్వేగానికి గురయ్యారు. ఆయనతో కొన్ని క్షణాలు మాట్లాడారు. కుమారుడిని చూసిన ఆనందంతో విజయమ్మ ఉప్పొంగిపోయినట్టు కనిపించారు. జగన్ కూడా తన తల్లితో కొద్దిసేపు గడిపి, ఆమె దీవెనలు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి.
జగన్, విజయమ్మ మధ్య ఈ రాజకీయ వర్గాల్లో చర్చ కొత్త షురూ అయింది. కుటుంబ పరంగా తల్లీకొడుకులు కలిసినప్పటికీ, వారి మధ్య ఉన్న బేధాభిప్రాయాలు పూర్తిగా తగ్గాయా లేదా అన్నది ఆసక్తిగా మారింది. ఇది కేవలం ఒక తాత్కాలిక మీటింగ్ గా మాత్రమే మిగిలిపోతుందా, లేక భవిష్యత్తులో కుటుంబ సభ్యుల మధ్య సయోధ్య ఏర్పడుతుందా అన్నది వేచి చూడాలి.













