ఏపీలో జగనన్న విద్యా కానుక ప్రారంభం
రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో కరోనా ఆంక్షలు పాటిస్తున్నామని ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం పోతవరంలో మొదటి విడత నాడు నేడుతో ఆధునికీకరణ సంతరించుకున్న పాఠశాలలను విద్యార్థులకు అంకితమిచ్చారు. అనంతరం జగనన్న విద్యాకానుక కిట్లను విద్యార్థులకు పంపిణీ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాతూ రాష్ట్రంలో పాజిటివ్ రేటు 10 శాతం కంటే తక్కువ ఉన్న చోట బడులు తెరిచామని అన్నారు. పేద విద్యార్థుల జీవితాల్లో మార్పులు రావాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. తరగతి గదిలో 20 మంది కంటే ఎక్కువ ఉంచొద్దన్నారు. ఎక్కువ మంది విద్యార్థులుంటే రోజు విడిచి రోజు తరగతులు నిర్వహిస్తామని తెలిపారు.
విద్యాకానుక కింద రెండు భాషల్లో పాఠ్యపుస్తకాలు బ్యాగు అందిస్తున్నామని ప్రతి విద్యార్థికీ నోట్ బుక్స్, వర్క్ బుక్స్ డిక్షనరీ, 3 జతల దుస్తులు, బూట్లు, బెల్టు, సాక్సులు ఇస్తున్నట్లు తెలిపారు. విద్యానానుక కిట్ల నాణ్యతలో ఎక్కడా రాజీ పడలేదన్నారు. ఈ పథకం కింద ఈ ఏడాది రూ.1.380 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. దీంతో 42 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతోందన్నారు. ఐసీఎంఆర్, డబ్ల్యూహెచ్ కూడా స్కూళ్లు తెరవాలని సూచించారని తెలిపారు.













