అదానీకి కట్టబెట్టిన ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలి : రామకృష్ణ
ఆంధ్రప్రదేశ్‌లో అదానీ కంపెనీలకు కట్టబెట్టిన ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామృకష్ణ డిమాండ్ చేశారు. దేశమంతా హిండెన్‌బర్గ్ నివేదికపై చర్చ జరుగుతుంటే, అదానీ కంపెనీలతో లాలూచీ పడి హడావుడిగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశమై వందలాది ఎకరాలు ఆ సంస్థకు కట్టబెట్టడం దారుణమన్నారు. దీని వెనుకనున్న మతలబేంటో సీఎం జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ప్రధాని నరేంద్ర మోదీని ప్రసన్నం చేసుకోవడానికి సీఎం జగన్ రాష్ట్రంలోని ఆస్తులన్నింటినీ అదానీ కంపెనీలకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. విశాఖ స్టీల్ ఫ్లాంట్‌ను కూడా అదానీకి అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోందన్నారు. దశాబ్దాలుగా రాష్ట్రంలో ఉన్న డెయిరీలను కాదని గుజరాత్‌కు చెందిన అమూల్ డెయిరీని ప్రోత్సహించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. గుజరాత్ పెట్టుబడిదారులకు, అదానీతో సీఎం జగన్‌కు ఉన్న లింక్ ఏమిటో సమగ్రంగా చర్చ జరగాలన్నారు.













