ఏపీలో కొత్త జిల్లాలకు ముహూర్తం ఖరారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల అవతరణకు ముహూర్తం ఖరారైంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కొత్త జిల్లాల అవతరణ, సదుపాయాల కల్పన, భవిష్యత్తులో నిర్మించనున్న పరిపాలనా సముదాయాల నిర్మాణం తదితర అంశాలపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. ఏప్రిల్ 4న ఉదయం 9:05 నుంచి 9:45 మధ్య కొత్త జిల్లాలను ఏర్పాటు చేయనున్నారు. ఏప్రిల్ 6న వాలంటీర్ల సత్కారం, ఏప్రిల్ 8న వసతి దీవెన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ సుస్థిర ఆర్థిక ప్రగతి లక్ష్యాలను కొత్త జిల్లాలతో అనుసంధానం చేయాలని అధికారులకు సూచించారు. పరిపాలనా సముదాయాల నిర్మాణాలకు స్థలం ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. కనీసం 15 ఎకరాల స్థలం ఉండేలా చూసుకోవాలని తెలిపారు. జిల్లా కలెక్టరేట్ సహా అన్ని కార్యాలయాలు ఒకే సముదాయంలో ఉండేలా ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు సూచించారు. భవనాల కోసం మంచి డిజైన్లు ఎంపిక చేసుకోవాలని తెలిపారు. అద్దె భవనాల స్థానంలో కొత్త భవనాల నిర్మాణాలకు ప్రాధానత్య ఇవ్వాలని సీఎం సూచించారు.













