YS Jagan: సరస్వతి పవర్ షేర్ల బదిలీ అక్రమం.. ఎన్‌సిఎల్‌టిలో జగన్‌కు ఊరట..!!

నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్ (NCLT) హైదరాబాద్ బెంచ్, సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో షేర్ల బదిలీకి సంబంధించి కీలక తీర్పు చెప్పింది. ఈ కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan), ఆయన భార్య వైఎస్ భారతి రెడ్డి (YS Bharathi) పేరిట ఉన్న షేర్లను వారి తల్లి వైఎస్ విజయమ్మ (YS Vijayamma) ద్వారా చెల్లెలు వైఎస్ షర్మిల (YS Sharmila) అక్రమంగా బదిలీ చేసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ బదిలీని నిలిపివేస్తూ ఎన్‌సిఎల్‌టి ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జగన్‌కు భారీ ఊరట లభించింది. సిబిఐ, ఈడీ విచారణల నేపథ్యంలో షేర్ల బదిలీ సాధ్యం కాదని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. ఈ తీర్పు వైఎస్ కుటుంబంలోని విభేదాలను మరింత బహిర్గతం చేసింది.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2024 సెప్టెంబర్‌లో ఎన్‌సిఎల్‌టి హైదరాబాద్ బెంచ్‌లో ఓ పిటిషన్ దాఖలు చేశారు. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో (Saraswathi Power and Industries Pvt Ltd) తనకు, భార్య భారతికి చెందిన 12,676,294 ఈక్విటీ షేర్లను తన విజయమ్మ, సోదరి షర్మిల సహా మరికొంతమంది 2024 జూలై 6న అక్రమంగా బదిలీ చేసుకున్నారని ఆయన ఆరోపించారు. కంపెనీ యాక్ట్ 2013లోని సెక్షన్ 59 కింద ఈ పిటిషన్ దాఖలైంది. ఇది సభ్యుల రిజిస్టర్‌ను సవరించడానికి సంబంధించినది. విజయమ్మ, షర్మిల, జనార్థన్ రెడ్డి చాగరి, యశ్వంత్‌రెడ్డి కేతిరెడ్డి, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (తెలంగాణ), రీజినల్ డైరెక్టర్ (సౌత్ ఈస్ట్ రీజియన్) ఇందులో ప్రతివాదులుగా ఉన్నారు.
తన సంతకం లేకుండానే షేర్ల బదిలీ జరిగినట్లు జగన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. 2021లో ఆయన తన తల్లి విజయమ్మకు షేర్లను గిఫ్ట్ డీడ్ ద్వారా బదిలీ చేసేందుకు అంగీకరించినప్పటికీ, అది కోర్టు కేసులు పరిష్కారమయ్యే వరకు అమలులోకి రాకూడదని షరతు విధించారు. అయితే సిబిఐ, ఈడీ కేసులు విచారణలో ఉన్న నేపథ్యంలో, ఈ షరతును ఉల్లంఘించారని, షేర్లు అక్రమంగా బదిలీ అయ్యాయని జగన్ ఆరోపించారు. ఈ బదిలీని రద్దు చేయాలని, షేర్లను తిరిగి తమ పేరిట నమోదు చేయాలని ఆయన ట్రిబ్యూనల్‌ను కోరారు.
అయితే జగన్ ఆరోపణలను తల్లి విజయమ్మ ఖండించారు. షర్మిలకు షేర్లు బదిలీ చేయలేదని, అన్ని షేర్లు తన పేరిటే ఉన్నాయని వాదించారు. జగన్, షర్మిల మధ్య ఆస్తుల విషయంలో విభేదాలు తలెత్తిన నేపథ్యంలో, తనను కేసులో అనవసరంగా ఇరికించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. షర్మిల కూడా తనకు ఈ బదిలీతో సంబంధం లేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ, జగన్ పిటిషన్‌లో షర్మిలను ప్రతివాదిగా చేర్చడం వైఎస్ కుటుంబంలోని విభేదాలను సూచిస్తుంది.
దాదాపు 10 నెలల పాటు అన్ని పక్షాల వాదనలను విన్న ఎన్‌సిఎల్‌టి, 2025 జూలై 15న తీర్పును రిజర్వు చేసింది. చివరకు, షేర్ల బదిలీ అక్రమమని, సిబిఐ, ఈడీ కేసుల విచారణ నేపథ్యంలో బదిలీ సాధ్యం కాదని నిర్ధారిస్తూ, బదిలీ ప్రక్రియను నిలిపివేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పు జగన్‌కు ఊరటనిచ్చింది. అదే సమయంలో విజయమ్మ, షర్మిలకు షాక్ ఇచ్చింది. ఈ షేర్ల వివాదం వైఎస్ కుటుంబంలో విభేదాలను బయటపెట్టింది. జగన్, షర్మిల మధ్య 2019లో ఆస్తుల బదిలీకి సంబంధించి ఒక ఒప్పందం (MoU) కుదిరినప్పటికీ, ఆ తర్వాత వారి సంబంధాలు దెబ్బతిన్నాయి. షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించడం, రాజకీయంగా జగన్‌కు వ్యతిరేకంగా నిలబడటం విభేదాలను మరింత తీవ్రతరం చేశాయి. ఈ కేసు కేవలం ఆర్థిక వివాదం మాత్రమే కాక, కుటుంబ సభ్యుల మధ్య దూరాన్ని తెలియజేస్తోంది.