మైదుకూరు బహిరంగ సభలో వైయస్ జగన్ ప్రసంగం
మైదుకూరులో సీసీ రహదారులు, బాత్రూమ్లు కట్టకుండానే బిల్లులు తీసుకుంటున్నారని, వాటిపై విజిలెన్సు విచారణనూ అడ్డుకుంటున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఈ నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జ్ మంత్రి యనమల వియ్యంకుడు అని, ఆయనకు పోలవరం ప్రాజెక్టు వద్ద సబ్ కాంట్రాక్ట్ కింద నామినేషన్ పద్ధతిలో పనులు అప్పగిస్తున్నారని వెల్లడించారు. సుదీర్ఘ పాదయాత్రలో మైదుకూరుతో సహా, అన్ని ప్రాంతాల ప్రజల కష్టాలు చూశానని, అందుకు అందరికీ భరోసా ఇస్తున్నానని.. అదే ‘నేను ఉన్నాను’ అని జననేత ప్రకటించారు.
వైయస్సార్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. మండే ఎండను సైతం లెక్క చేయకుండా సభకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి రావడంతో పట్టణం జనసంద్రంగా మారింది.
నేను ఉన్నాను
తన సుదీర్ఘ పాదయాత్ర మైదుకూరు నుంచి కూడా సాగిందని, అందరి దీవెనల వల్లనే అది సా«ధ్యమైందని, ఆ యాత్రలో ప్రతి ఒక్కరి కష్టం విన్నానని, వారి బాధలు చూశానని, ప్రతి అడుగులో ప్రతి కుటుంబం ఏం కోరుకుంటుందో కూడా చూశానని, ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తూ, అది అందక ఎండమావి అయి కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి చెబుతున్నానని.. అదే ‘నేను ఉన్నాను’ అని శ్రీ వైయస్ జగన్ వెల్లడించారు.
ఇవన్నీ చూశాను
గిట్టుబాటు ధర రాక, రుణమాఫీ కాక, కరువొచ్చినా ఏ మాత్రం పట్టించుకోక జరిగిన రైతుల ఆత్మహత్యలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీల బాధలు, ఫీజు రీయింబర్స్మెంట్ రాక చదువులు మధ్యలోనే ఆపుతున్న విద్యార్థుల బాధలు, ఆ తల్లిదండ్రుల ఇబ్బందులు, విద్యార్థుల ఆత్మహత్యలు.. 108 సర్వీసు సకాలంలో రాక ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యుల మాటలు విన్నానని, అందరి కష్టాలు చూశానని తెలిపారు.
ఇంకా మద్యం షాపులు ఎక్కువైపోయి, మద్యానికి బానిసలైన వారి సమస్యలు, యథేచ్ఛగా ఏర్పాటైన బెల్టుషాపులు, వాటితో మహిళలకు కొరవడిన రక్షణ, అక్కా చెల్లెమ్మల ఆవేదన విన్నానని, పిల్లల చదువు కోసం కూలీకి పోతున్న వారి బాధలు చూశానని చెప్పారు.
స్థానిక సమస్యలు
ఇదే నియోజకవర్గంలో బ్రహ్మంసాగర్ ప్రాజెక్టులో 17 టీఎంసీల నీరు నిల్వ చేసి తెలుగు గంగ ఆయకట్టుకు నీరందించాల్సి ఉందని, కాగా, నాడు మహానేత వైయస్సార్ హయాంలో మాత్రమే అక్కడ 14 టీఎంసీల నీరుండగా, ఇప్పుడు ఏనాడూ 3 టీఎంసీల నీరు కూడా లేదని చెప్పారు.
వెలుగోడు కాలువ మొదటి 18 కి.మీ బాగా దెబ్బతిందని, దాన్ని బాగు చేయాలని, లైనింగ్ చేయాలని «ఎమ్మెల్యే ధర్నా చేసినా పట్టించుకోలేదని ఆక్షేపించారు.
కరువు ప్రాంతానికి మేలు చేయడం కోసం కుందూ నదిపై రాజోలు రిజర్వాయర్‌కు 2008లోనే మహానేత భూమి పూజ చేసినా, అది ఇప్పటికీ పూర్తి కాలేదని చెప్పారు.
గిట్టుబాటు ధరలు లేవు
‘పసుపు క్వింటాలు ధర ఆనాడు రూ.16 వేలు ఉండగా, ఇప్పుడు రూ.5 వేలు కూడా రావడం లేదని, మిర్చికి కనీసం రూ.10 వేలు రావాలి కానీ ఇప్పుడు రూ.6 వేలు కూడా దక్కడం లేదని, అత్యంత నాణ్యమైన కేపీ ఉల్లి రైతులకు కంట నీరు పెట్టిస్తోందని, క్వింటాలు ఉల్లికి కనీసం రూ.1000 కూడా రావడం లేదని జననేత ఆవేదన చెందారు. కానీ అదే ఉల్లిని చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ మార్కెట్లో కిలో రూ.23కి అమ్ముతున్నారని రైతులు చెబుతున్నారని అన్నారు.
దళారులను కట్టడి చేయాల్సిన ముఖ్యమంత్రి వారికి నాయకుడిగా మారి రైతులకు అన్యాయం చేస్తున్నాడని గుర్తు చేశారు.
మైదుకూరులో అవినీతి
మైదుకూరు మున్సిపాలిటీలో సీసీ రోడ్లు, బాత్రూమ్లు కట్టకుండానే బిల్లులు తీసుకుంటున్నారని, వాటిపై విజిలెన్స్ విచారణను కూడా అడ్డుకుంటున్నారని జననేత తెలిపారు. మైదుకూరు నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జ్ మంత్రి యనమల వియ్యంకుడు అని, ఆయనకు పోలవరం ప్రాజెక్టు వద్ద నామినేషన్ పద్ధతిలో సబ్ కాంట్రాక్టులు అప్పగిస్తున్నారని వెల్లడించారు.
చెరుకు–రైతులు
చెల్లూరు దగ్గరున్న కడప సహకార చక్కెర ఫ్యాక్టరీని తెరిపించకపోవడంతో 150 కి.మీ దూరంలో ఉన్న నెల్లూరు జిల్లా పొదలకూరు వెళ్లి రైతులు చెరుకు అమ్మాల్సి వస్తోందని, అందుకు రవాణాకు టన్నుకు రూ.1200 ఖర్చవుతుందని రైతులు చెబుతున్నారని చెప్పారు.
నిరుద్యోగులు
స్టీల్ ఫ్యాక్టరీ వల్ల 10 వేల ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు ఆశగా ఎదురు చూశారని, దీంతో పాటు హోదా వల్ల మరిన్ని ఉద్యోగ అవకాశాలు వస్తాయని చూసిన పిల్లలకు నిరాశే ఎదురైందని అన్నారు. రాష్ట్ర విభజన నాటికి ఉన్న 1.42 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తారని భావించిన నిరుద్యోగులు, పరీక్షల కోసం కోచింగ్ తీసుకుంటూ వేలకు వేలు ఖర్చు చేస్తున్నారని చెప్పారు. అయితే ఉద్యోగాలు భర్తీ చేయకపోగా, ఆ తర్వాత రిటైర్మెంట్లతో ఖాళీల సంఖ్య 2.30 లక్షలకు చేరినా భర్తీ మాత్రం లేదని, అందుకే అందరికీ చెబుతున్నానని.. అదే ‘నేను ఉన్నాను’ అని శ్రీ వైయస్ జగన్ భరోసా ఇచ్చారు.
కుట్రలు–మోసాలు
మరో 14 రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయని, కాబట్టి చంద్రబాబు చేయని మోసం, చెప్పని అబద్ధం, చేయని కుట్ర, డ్రామా, చూపని సినిమా ఉండదని అన్నారు. ధర్మం–అధర్మం మధ్య ఈ యుద్ధం జరుగుతోందని అన్నారు.
ఇవాళ మన యుద్ధం కేవలం చంద్రబాబుతో మాత్రమే కాదని.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5తో పాటు, ఆయనకు అమ్ముడుపోయిన మీడియాతో యుద్ధం చేస్తున్నామని చెప్పారు.
ఇక ఎన్నికలు మరింత దగ్గరకు వచ్చే సరికి కుట్రలు ఇంకా పెరుగుతున్నాయని, ఉన్నది లేనట్లు. లేనిది ఉన్నట్లు చూపుతారని, గ్రామాలకు మూటల మూటల డబ్బు పంపిస్తారని, ప్రతి ఒక్కరికి రూ.3 వేలు ఇస్తారని ఆరోపించారు.
వారికి ఇవన్నీ వివరించండి
కాబట్టి అందరూ గ్రామాలకు వెళ్లాలని, ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి అవ్వ, తాత, ప్రతి రైతును వాస్తవాలు వివరించాలని కోరారు.
‘అక్కా, చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దు. 20 రోజులు ఓపిక పట్టండి. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. ఆ తర్వాత మన పిల్లలను బడికి పంపిస్తే చాలు, ప్రతి ఏటా మన చేతిలో అన్న రూ.15 వేలు పెడతాడని చెప్పండి. అలాగే మన పిల్లలు ఇంజనీరింగ్, డాక్టర్, కలెక్టర్ వంటి ఏ పెద్ద చదువులు చదివినా అన్న ఉన్నాడు. ఎన్ని లక్షలైనా చదివిస్తాడని చెప్పండి’.
‘పొదుపు సంఘాల ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. అక్కా చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని, పసుపు–కుంకుమకు అస్సలు మోసపోవద్దని, చంద్రబాబును నమ్మితే రుణమాఫీ చేయలేదని, సున్నా వడ్డీ రుణాలు ఎగ్గొట్టాడని చెప్పండి. కాబట్టి చంద్రబాబును నమ్మకుండా 20 రోజులు ఓపిక పట్టి అన్నను ముఖ్యమంత్రిని చేసుకుంటే, ఎన్నికల నాటికి పొదుపు సంఘాల మహిళలకు ఉన్న రుణం మొత్తాన్ని నేరుగా వారి చేతుల్లో నాలుగు దఫాల్లో పెడతాడని చెప్పండి. ఇంకా సున్నా వడ్డీ రుణాలు కూడా వస్తాయని చెప్పండి’.
‘పేదరికంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళల్లో 45 నుంచి 60 ఏళ్ల లోపుండే ప్రతి అక్కకు చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని, 20 రోజులు ఆగి అన్నను ముఖ్యమంత్రిని చేసుకుంటే, వైయస్సార్ చేయూత కింద నాలుగు దఫాల్లో రూ.75 వేలు ఇస్తాడని చెప్పండి’.
‘ప్రతి రైతన్నకు చెప్పండి. చంద్రబాబును నమ్మితే రుణమాఫీ జరగలేదని, సున్నా వడ్డీ రుణాలు ఎగ్గొట్టాడని చెప్పండి. అందుకే చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని, 20 రోజులు ఆగి అన్నను ముఖ్యమంత్రిని చేసుకుంటే, ఏటా మే మాసంలో పెట్టుబడి కింద ప్రతి రైతు కుటుంబానికి రూ.12,500 ఇస్తాడని చెప్పండి. ఇంకా సున్నా వడ్డీ రుణాలు కూడా మంజూరవుతాయని చెప్పండి’.
‘ప్రతి అవ్వ, తాత దగ్గరకు వెళ్లండి. వారికి వస్తున్న పింఛన్ గురించి అడగండి. అవ్వ సమాధానం చెప్పిన తర్వాత అడగండి.. అవ్వా ఇప్పుడు ఎన్నికలు రాకపోయి ఉంటే, జగనన్న రూ.2 వేలు ఇస్తాడని చెప్పకపోయి ఉంటే, ఈ చంద్రబాబు ఇప్పుడు రూ.2 వేలు ఇచ్చేవాడా? అని అడగండి. అందుకే చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని చెప్పండి. 20 రోజులు ఓపిక పట్టి అన్నను ముఖ్యమంత్రిని చేసుకుంటే, మీ మనవడు ముఖ్యమంత్రి అవుతాడు. ఆ తర్వాత మీ పెన్షన్ పెంచుకుంటూ పోయి రూ.3 వేలు ఇస్తాడని చెప్పండి’.
‘ప్రతి నిరుపేదకు ఇల్లు కట్టించి ఇస్తాడని ప్రతి అన్నకు చెప్పండి. చంద్రబాబు ఈ 5 ఏళ్లలో ఒక్కో ఊరికి కనీసం 10 ఇళ్లు కూడా కట్టించి ఇవ్వలేదని గుర్తు చేయండి. నాడు మహానేత వైయస్సార్ మాత్రమే పేదలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చాడని, ఇప్పుడు మళ్లీ జగనన్న ఆ పని చేస్తాడని చెప్పండి’ అని శ్రీ వైయస్ జగన్ వివరించారు.
అదే విధంగా నవరత్నాలు పథకాల గురించి, వాటి వల్ల జరిగే మంచి గురించి ప్రతి ఇంట్లో, ప్రతి ఒక్కరికి వివరించాలని కోరారు.
వ్యవస్థ మారాలి
ఈ వ్యవస్థ మారాలని, మాట నిలబెట్టుకోని నాయకుడు ఇంటికి పోవాలని, అప్పుడే ఈ వ్యవస్థ బాగు పడుతుందని.. అందుకు ఇక్కడి నుంచే నాంది పలకాలని ఆకాంక్షించారు.
డీఎల్..
చివర్లో.. సీనియర్ నేత డీఎల్ రవీంద్రారెడ్డి గురించి మాట్లాడిన శ్రీ వైయస్ జగన్.. ‘రాజకీయాల్లో లేకపోతే ఆయనను నేను అంకుల్ అని పిలవాలి. కానీ రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి, అన్నా అంటున్నాను. ఆ అన్నకు తోడుగా ఎప్పుడూ సంపూర్ణంగా ఉంటాను’ అని ప్రకటించారు. ఆ తర్వాత స్వయంగా కండువా కప్పిన జననేత, డీఎల్‌ను పార్టీలోకి ఆహ్వానించారు.
పార్టీ అభ్యర్థుల పరిచయం
మైదుకూరు నియోజకవర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎస్.రఘురామిరెడ్డితో పాటు, పార్టీ కడప ఎంపీ అభ్యర్థి వైయస్.అవినాష్‌రెడ్డిని సభకు పరిచయం చేసిన శ్రీ వైయస్ జగన్, ఇద్దరినీ మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు. వైయస్సార్సీపీ గుర్తు ఫ్యాన్‌ను కూడా సభకు చూపిన ఆయన, గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.













