ఎన్నికల ప్రచార సభలో జననేత భావోద్వేగ ప్రసంగం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే కడప జిల్లాలో 6 నెలల్లో స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసి మూడేళ్లలో పనులు పూర్తి చేస్తామని, ఆ తర్వాత ఎందరికో ఉద్యోగ అవకాశాలు వస్తాయని.. ఇంకా గోదాముల్లో మూలుగుతున్న శనగలు రూ.6500 చొప్పున కొనుగోలు చేస్తామని.. గండికోట ముంపు గ్రామాల రైతులు కోరుతున్నట్లుగా రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని.. మగ్గం ఉన్న ప్రతి ఇంటికీ ఏటా రూ.24 వేల సహాయం చేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ఇంకా అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని, తొలి బడ్జెట్లోనే రూ.1150 కోట్లు కేటాయించి 13 లక్షల మంది బాధితులకు సహాయం చేస్తామని.. కేశవరెడ్డి బాధితులనూ ఆదుకుంటామని ఆయన వెల్లడించారు.
జమ్మలమడుగు నియోజకవర్గంలో అటు టీడీపీలో ఇటు కాంగ్రెస్‌లో ఒకే కుటుంబాలు ఆధిపత్యం చేశాయని, కాగా ఇప్పుడు రాజకీయ స్వార్ధం కోసం ఆ రెండు కుటుంబాలు ఏకమయ్యాయని తెలిపారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నియోజకవర్గంలో పెద్ద నాయకులు ఎవ్వరూ లేరని, ప్రజలే తమకు అండ, దండ అని చెప్పారు. అందుకే వారినే నమ్ముకున్నామని పేర్కొన్నారు.
వైయస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. సభకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి రావడంతో పట్టణం జనసంద్రంగా మారింది.
వివేకానందకు నివాళి
జమ్మలమడుగు నియోజకవర్గంలో తమ చిన్నాన్న వైయస్ వివేకానందరెడ్డి ఇక్కడ ఉండాల్సి ఉందని, కానీ ఆయన దారుణహత్యకు గురయ్యారన్న శ్రీ వైయస్ జగన్, ఆయనకు నివాళులర్పిస్తూ సభ ప్రారంభానికి ముందు ఒక నిమిషం మౌనం పాటించారు.
‘నేను ఉన్నాను’
సుదీర్ఘ 3648 కి.మీ పాదయాత్రలో ప్రతి ఒక్కరి కష్టం దారి పొడవునా చూశానని, అందరి బాధను విన్నానని, సహాయం కోసం ఎదురుచూస్తున్న వారిని కూడా చూశానని, వారి బాధలు విన్నానని, ఆవేదనలూ చూశానని.. అందుకే ప్రతి ఒక్కరికి భరోసా ఇస్తున్నానని.. అదే ‘నేను ఉన్నాను’ అని శ్రీ వైయస్ జగన్ వెల్లడించారు.
ఇవన్నీ చూశాను
గిట్టుబాటు ధర రాక, రుణమాఫీ జరగక అప్పులు పెరిగిన పరిస్థితి, కరువు వచ్చినా సహాయం చేయని ప్రభుత్వాన్ని చూశానని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, పేదల కష్టాలు చూశానని.. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ రాక ఆస్తులు అమ్ముకుంటున్న తల్లిదండ్రులను, ఆ తల్లిదండ్రుల బాధలు చూడలేక ఆత్మహత్య చేసుకున్న పిల్లలను కూడా చూశానని.. 108 సర్వీసు రాక ప్రాణాలు కోల్పోయిన రోగులను చూశానని.. పక్షవాతానికి గురై ప్రభుత్వ సహాయం లేక నానా అగచాట్లు పడుతున్న వారి బాధలు విన్నానని.. మద్యం షాపులు ఎక్కువై, ఆ మద్యం వల్ల కుటుంబాలు చిన్నాభిన్నం కావడంతో పాటు, గ్రామాల్లో బెల్టు షాపుల వల్ల మహిళలకు రక్షణ లేకపోవడాన్ని చూశానని.. పిల్లల చదువుల కోసం కూలీకి పోయిన అక్కా చెల్లెమ్మలనూ చూశానని జననేత చెప్పారు.
ఇంకా నియోజకవర్గంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న పిల్లలను చూశానని.. జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ వస్తుందని, దాని వల్ల ఉద్యోగాలు వస్తాయని ఎదురుచూస్తున్న పిల్లలనూ చూశానని తెలిపారు. ప్రభుత్వంలో ఖాళీలు భర్తీ చేయకపోవడంతో వలస పోతున్న పిల్లలను కూడా చూశానని వివరించారు.
మహానేత వైయస్సార్
ఈ ప్రాంతానికి మేలు కోసం మహానేత వైయస్సార్ దాల్మియా సిమెంట్స్ కంపెనీ తెచ్చారని, అదే విధంగా బ్రహ్మణీ స్టీల్స్ కోసం భూములు కేటాయించి, రూ.1300 కోట్లు పెట్టుబడి కూడా పెట్టారని, కానీ ఆయన మరణం తర్వాత అది మూతబడిందని గుర్తు చేశారు.
6 నెలల్లో పనులు
ఇవాళ అందరికీ ఒక మాట చెబుతున్నానని, రేపు దేవుడి ఆశీర్వాదం, అందరి దీవెనలతో తమ ప్రభుత్వం ఏర్పడితే.. 6 నెలల్లోనే స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసి మూడేళ్లలో దాన్ని పూర్తి చేస్తామని ప్రకటించారు.
శనగ పంట «
ఇదే నియోజకవర్గంలో శనగ పంట ఎక్కువని, అయితే గత మూడేళ్లుగా ఆ పంటకు గిట్టుబాటు ధర లేదని, శనగ కనీస మద్దతు ధర రూ.5200 కాగా, రూ.4 వేలు కూడా రావడం లేదని తెలిపారు. దీంతో మూడు, నాలుగేళ్లుగా సరుకును గోదాముల్లోనే ఉంచేస్తున్నారని, ఫలితంగా అప్పులు పెరిగి, వడ్డీ కట్టలేని పరిస్థితిలో ఉన్న రైతుల బాధలు విన్నానని చెప్పారు.
కాబట్టి తమ ప్రభుత్వం ఏర్పడితే, ఆ గోదాముల్లో ఉన్న మొత్తం శనగ పంటను.. అధికారం చేపట్టిన వెంటనే రూ.6500 చొప్పున కొనుగోలు చేస్తామని వెల్లడించారు.
గండికోట
గండికోట ప్రాజెక్టును నాడు మహానేత వైయస్సార్ కట్టించారని, ఇంకా పోతిరెడ్డిపాడు నుంచి గండికోటకు నీరు తేవాలని తలంచారని, ఆ మేరకు పోతిరెడ్డిపాడు నుంచి 44 వేల క్యూసెక్కుల నీరు తరలించారని చెప్పారు.
ఇంకా మహానేత హయాంలోనే వరద కాలువ పనులు దాదాపు 85 శాతం పూరై్తనా మిగిలిన 15 శాతం పనులు చంద్రబాబు పాలనలో ఇంకా సాగుతున్నాయని గుర్తు చేశారు. ఆ పనులు చేయకపోగా, అంచనాలు 100 శాతం పెంచి, సీఎం రమేష్ కంపెనీకి ఇచ్చారని ఆక్షేపించారు.
భూనిర్వాసితులు–పరిహారం
గండికోట ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితులకు ముష్టి వేసినట్లు రూ.6.5 లక్షల పరిహారం ఇస్తున్నారని, కానీ ఆ రైతులు మాత్రం రూ.10 లక్షలు కావాలని కోరుతున్నారని చెప్పారు. అందుకే తమ ప్రభుత్వం ఏర్పడితే ఆ రైతులకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు.
రాజోలి రిజర్వాయర్
ఈ 5 ఏళ్లుగా మైలవరం రిజర్వాయర్ చివరి ఆయకట్టుకు నీరు రావడం లేదని, మరోవైపు పెన్నా నది గర్భంలో ఇష్టానుసారం ఇసుక తవ్వేస్తున్నారని చెప్పారు.
ఇక 2008లో మహానేత వైయస్సార్ రాజోలి రిజర్వాయర్‌కు శంకుస్థాపన చేయగా, పనులు ఇప్పటికీ పూర్తి కాలేదని చెప్పారు. ఇదే నియోజకరవర్గంలో తమ పార్టీ నుంచి గెల్చిన ఎమ్మెల్యే పార్టీ ఫిరాయించి మంత్రి అయినా, రాజోలి ప్రాజెక్టును పట్టించుకోలేదని గుర్తు చేశారు. కానీ ఎన్నికలు రావడంతో నెల ముందు ఇక్కడికి ఇచ్చిన చంద్రబాబు రాజోలి రిజర్వాయర్ పనులకు ఒక టెంకాయ కొట్టారని ఆక్షేపించారు.
చేనేత రంగం
ఈ 5 ఏళ్ల చంద్రబాబు పాలనతో చేనేత కార్మికులు సంతోషంగా ఉన్నారా? అని ప్రశ్నించిన శ్రీ వైయస్ జగన్, వారికి నూలు సబ్సిడీ రావడం లేదని తెలిపారు. ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చినప్పటికీ, చంద్రబాబు చేనేతకారుల రుణాలు మాఫీ చేయకపోగా, ఇల్లు, షెడ్ కూడా కట్టించి ఇవ్వలేదని గుర్తు చేశారు.
అందుకే రేపు తమ ప్రభుత్వం ఏర్పడితే, నవరత్నాలు ద్వారా చేసే సహాయమే కాకుండా, మగ్గం ఉన్న ప్రతి ఇంటికి ఏడాదికి రూ.24 వేలు ఇస్తామని వెల్లడించారు.
అగ్రిగోల్డ్ బాధితులు
‘ఇక్కడ అగ్రిగోల్డ్ బాధితులు ఎక్కువ. ఈ 5 ఏళ్లలో వారికి చంద్రబాబు ఏ ఒక్క మేలు చేయలేదు. కనీసం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మరోవైపు ఆ సంస్థ ఆస్తులను చంద్రబాబునాయుడు, ఆయన కొడుకు, ఆయన మంత్రులు, బినామీలు గెద్దల్లా కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు’.
‘కాబట్టి రేపు మన ప్రభుత్వం ఏర్పడితే, తొలి బడ్జెట్లోనే రూ.1150 కోట్లు కేటాయించి, 13 లక్షల మంది బాధితులకు న్యాయం చేస్తాము. మిగిలిన వారికి కూడా వీలైనంత తరగా మేలు చేస్తాము’ అని శ్రీ వైయస్ జగన్ వెల్లడించారు.
కేశవరెడ్డి బాధితులు
‘ఇక్కడ కేశవరెడ్డి బాధితులు కూడా ఎక్కువే. ఆయన అడ్డగోలుగా పిల్లల తల్లిదండ్రుల నుంచి లక్షల డిపాజిట్లు సేకరించాడు. కానీ తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడు. అయినా చంద్రబాబు పట్టించుకోలేదు. పైగా కేశవరెడ్డి వియ్యంకుడు ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి ఇచ్చాడు. ఆ విధంగా ఆ బాధితులకు చంద్రబాబు ఏం సంకేతం ఇస్తున్నారు? మీ బాధలు నేను విన్నాను. కష్టం చూశాను. కాబట్టి మేలు చేస్తానని హామీ ఇస్తున్నాను’ అని జననేత తెలిపారు.
మోసం మోసం..
5 ఏళ్ల చంద్రబాబు పాలనలో మనం చూసింది ప్రతి అడుగులో మోసం మాత్రమే అని, ఇంకా మనం చూసినవి మోసాలు, అబద్ధాలు, అధర్మం, అవినీతి అని పేర్కొన్నారు.
కుట్రలు–కుతంత్రాలు
ఇవాళ జరుగుతున్న రాజకీయాలు ఒక్కసారి చూడాలని, అవి ఏ స్థాయిలో దిగజారాయో గమనించాలని కోరారు. «గత 20 రోజులుగా రాజకీయాలు ఎంతగా దిగజారాయో అందరూ చూస్తున్నారని కూడా అని ఆయన పేర్కొన్నారు.
ఇవాళ ధర్మం–అధర్మం మధ్య ఈ యుద్ధం జరుగుతోందని, ఈ యుద్ధం కేవలం చంద్రబాబుతో మాత్రమే కాకుండా, ఆయనకు కొమ్ము కాస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, టీవీ9తో పాటు, ఇంకా ఆయనకు అమ్ముడుపోయిన మొత్తం మీడియాతో యుద్ధం చేస్తున్నామని చెప్పారు.
వీరంతా ఒక్కటై ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చూపుతున్నారని, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు.
దృష్టి మళ్లిస్తున్నారు
‘చంద్రబాబు పాలన మీద చర్చ జరిగితే, ప్రజలు ఆలోచించడం మొదలు పెడితే డిపాజిట్లు కూడా రావని చంద్రబాబునాయుడు గారికి తెలుసు. అందుకే చంద్రబాబునాయుడు గారు, తనకు సంబంధించిన ఎల్లో మీడియా.. ప్రతిరోజూ ఒక కట్టుకథ, పుకారు లేపుతారు. దానిపైనే చర్చ పెడతారు. పూర్తిగా చంద్రబాబు వైఫల్యాలు, ఈ 5 ఏళ్లలో జరిగిన మోసాల నుంచి ప్రజలను మభ్య పెడుతున్నారు. అందుకని ఒక్కసారి ఆలోచించాలని కోరుతున్నాను’ అని శ్రీ వైయస్ జగన్ అన్నారు.
గ్రామాలకు మూటల డబ్బులు
ఎన్నికలు ఇంకా దగ్గరకు వచ్చే సరికి కుట్రలు మరింత తీవ్రమవుతాయని, ఎన్నికలు రావడంతో ప్రతి గ్రామానికి మూటలకొద్దీ డబ్బు పంపిస్తారని, ప్రతి ఒక్కరి చేతిలో రూ.3 వేలు పెడతారని, ఆ విధంగా మళ్లీ మోసం చేసే ప్రయత్నం చేస్తారని ఆరోపించారు.
ఈ కుట్రను జయించాలని, అందుకే ప్రతి ఒక్కరూ తమ తమ గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లాలని, ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి అన్న, ప్రతి అవ్వ, ప్రతి తాత, ప్రతి రైతును కలిసి, చంద్రబాబు చేస్తున్న మోసాలు వివరించాలని కోరారు.
వారికి ఇవన్నీ వివరించండి
‘అక్కా చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దు. వారం రోజులు ఓపిక పట్టి అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. ఆ తరవాత మన పిల్లలను కేవలం బడికి పంపిస్తే చాలు.. అన్న ప్రతి ఏటా రూ.15 వేలు చేతిలో పెడతాడని చెప్పండి. అంతే కాకుండా మన పిల్లలను ఇంజనీర్లు, డాక్టర్లు, కలెక్టర్ వంటి చదువులు చదివించే పరిస్థితి లేదని, పిల్లల చదువు కోసం ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తోందని గుర్తు చేయండి’.
‘అందుకే చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోకుండా, వారం రోజులు ఓపిక పట్టి అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందామని, ఆ తర్వాత మన పిల్లలు ఇంజనీరింగ్, డాక్టర్, కలెక్టర్ వంటి ఏ చదువు చదవాలన్నా అన్న చదివిస్తాడని, ఎన్ని లక్షలు ఖర్చైనా అన్న చదివిస్తాడని ప్రతి అక్కకు చెప్పండి’.
‘పొదుపు సంఘాలలో ఉన్న ప్రతి అక్కను, ప్రతి చెల్లెమ్మను కలవండి. చంద్రబాబు చేసే మోసాలకు బలి కావద్దని చెప్పండి. అక్కా చంద్రబాబుకు 5 ఏళ్ల సమయం ఇచ్చాం. మన రుణాలు మాఫీ చేస్తానన్నాడు. మరి చేశాడా? అని అడగండి. అదే విధంగా సున్నా వడ్డీ రుణాలు కూడా రావడం లేదని గుర్తు చేయండి. ఆ పథకాన్ని రద్దు చేశాడని కూడా చెప్పండి. అందుకే చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు, పసుపు–కుంకుమ పేరుతో చేస్తున్న డ్రామాకు అస్సలు మోసపోవద్దని ప్రతి అక్కకు చెప్పండి’.
‘అక్కా వారం రోజులు ఓపిక పట్టి, అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. ఆ తర్వాత పొదుపు సంఘాల మహిళలకు ఎన్నికల నాటికి ఉన్న మొత్తం రుణాన్ని నేరుగా నాలుగు దఫాల్లో మన చేతుల్లోను పెడతాడని ప్రతి అక్కకు చెప్పండి. అంతే కాకుండా మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని, సున్నా వడ్డీ రుణాలు అందుతాయని, అది ఆయన కొడుకు జగనన్నతోనే సా««ధ్యమని ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి’.
‘పేదరికంలో ఉండి అవస్థలు పడుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు చెప్పండి. 45ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న ఆ ప్రతి అక్కను కలవండి. చెప్పండి.. అక్కా, చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని, వారం రోజులు ఓపిక పట్టక్కా.. అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయ్యాక, వైయస్సార్ చేయూత పథకం ద్వారా నాలుగు దఫాల్లో రూ.75 వేలు నేరుగా ప్రతి అక్క చేతిలో పెడతాడని చెప్పండి. అందుకే చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు మరీ మరీ చెప్పండి’.
‘గ్రామాల్లో ప్రతి రైతన్ననూ కలవండి. చంద్రబాబుకు 5 ఏళ్ల సమయం ఇచ్చాం. కానీ రుణమాఫీ చేయలేదు. రుణ మాఫీ కోసం చంద్రబాబు ఇచ్చిన మొత్తం కనీసం వడ్డీలకు కూడా సరిపోలేదని చెప్పండి. అలాగే సున్నా వడ్డీ రుణాలు కూడా రావడం లేదని, ఆ పథకమే రదై్దందని గుర్తు చేయండి. అలాగే 5 ఏళ్లలో ఏ ఒక్క సంవత్సరమైనా, ఏ ఒక్క పంటకైనా, ఒక్కసారైనా గిట్టుబాటు ధర వచ్చిందా? అని అడగండి’.
‘అందుకే ప్రతి రైతుకు చెప్పండి. అన్నా చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని, వారం రోజులు ఓపిక పడదాం. ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిని చేసుకుంటే, ఆ తర్వాత ప్రతి రైతుకు పెట్టుబడిగా ఏటా మే మాసంలో రూ.12,500 ఇస్తాడని, అలా నాలుగేళ్లలో మొత్తం రూ.50 వేలు మీ చేతిలో పెడతాడని చెప్పండి. అదే విధంగా మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని, సున్నా వడ్డీ రుణాలు వస్తాయని, అది జగనన్నతోనే సాధ్యమని చెప్పండి. ఇంకా ప్రతి పంటకు కచ్చితంగా గిట్టుబాటు ధర ఇవ్వడమే కాదు. గిట్టుబాటు ధరలకు అన్న గ్యారెంటీ కూడా ఇస్తాడని చెప్పండి’.
‘గ్రామంలో ప్రతి అవ్వ, ప్రతి తాతను కలవండి. చంద్రబాబు మోసాలు వివరించండి. అదే విధంగా వారికి వస్తున్న పెన్షన్ గురించి ఆరా తీయండి. ఇవాళ ఎన్నికలు వచ్చాయి. కానీ మీకు రెండు నెలల క్రితం వరకు ఎంత పెన్షన్ వచ్చేదని అడగండి. అప్పుడు ఆ అవ్వ అంటుంది అసలు పెన్షన్ రాలేదని, లేదా వెయ్యి రూపాయలు ఇచ్చేవారని చెబుతుంది. అవ్వ ఆ సమాధానం చెప్పాక ప్రతి అవ్వను అడగండి. అవ్వా ఇప్పుడు ఎన్నికలు రాకపోయి ఉంటే, జగనన్నే రూ.2 వేలు ఇస్తానని చెప్పకపోయి ఉంటే, ఈ చంద్రబాబు రూ.2 వేలు ఇచ్చేవాడా?’ అని అడగండి.
‘అందుకే ప్రతి అవ్వకు చెప్పండి. ప్రతి తాతకు చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని, వారం రోజులు ఓపికపడితే, మీ మనవడు ముఖ్యమంత్రి అవుతాడని చెప్పండి. అలా మీ మనవడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, అవ్వా తాతల పెన్షన్ రూ.3 వేలకు పెంచుకుంటూ పోతాడని చెప్పండి’.
‘గ్రామాలలో ఇంటి కోసం ఎదురు చూస్తున్న ప్రతి నిరుపేదను కలవండి. వారికి చెప్పండి. చంద్రబాబు పరిపాలన చూశాం. ఊరికి కనీసం 10 ఇళ్లు కూడా కట్టలేదని గుర్తు చేయండి. కాబట్టి, ఒక వారం రోజులు ఓపిక పట్టి, అన్నను ముఖ్యమంత్రిని చేసుకుంటే, మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని, అప్పుడు అన్న అందరికీ ఇళ్లు కట్టించి ఇస్తాడని చెప్పండి’ అని శ్రీ వైయస్ జగన్ కోరారు.
నవరత్నాలు
నవరత్నాలు పథకాలు ప్రతి కుటుంబంలో మేలు చేస్తాయని చెప్పాలని, వాటిని ప్రతి ఇంటికి తీసుకుపోవాలని సూచించారు. ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి అన్న, ప్రతి అవ్వ, ప్రతి తాతకు వాటి గురించి వివరించాలని కోరారు.
నవరత్నాలతో ప్రతి నిరుపేద జీవితం బాగుపడుతుందని, ప్రతి రైతు, మహిళ ముఖంలో చిరునవ్వులు చూడవచ్చని నమ్ముతున్నానని, అందుకే ఆ పథకాలను కచ్చితంగా ప్రతి ఇంటికి చేరుస్తామని హామీ ఇచ్చారు.
వ్యవస్థ మారాలి
ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థ మారాలని, ఒక నాయకుడు ఏదైనా చేస్తానని చెప్పి, ఆ అంశాన్ని ప్రణాళికలో పెట్టి, ప్రజలను ఓటడిగి గెల్చిన తర్వాత దాన్ని అమలు చేయకపోతే, ఆ పదవిని వీడి ఇంటికి పోవాలని, అప్పుడే ఈ రాజకీయాలలో విలువలు, విశ్వసనీయత వస్తాయని స్పష్టం చేశారు. అందుకు అందరి సహకారం కావాలని కోరారు.
మీరే నాకు అండ
‘ఈ నియోజకవర్గం గురించి మీఅందరికీ తెలుసు. టీడీపీలో, కాంగ్రెస్‌లో ఒకే కుటుంబాలు ఉండేవి. కానీ ఇవాళ రాజకీయ స్వార్ధం కోసం ఆ రెండు కుటుంబాలూ ఏకమయ్యాయి. నాకు (పార్టీకి) ఇక్కడ పెద్ద నాయకులెవరూ అండగా లేరు. మీరే నాకు అండ’.
‘రాజకీయాలలో ఊసరవెల్లిలు ఉండొద్దు. రాజకీయాలలో విలువలు ఉండాలి. అందుకు మీ అందరి సహకారం కావాలి. మిమ్మల్నే నమ్ముకున్నాను. అందుకే కొత్తవాడైనా యువకుడు, డాక్టర్ సుధీర్‌ను నిలబెట్టారు. ఆశీర్వదించండి’ అని శ్రీ వైయస్ జగన్ విజ్ఞప్తి చేశారు.
పార్టీ అభ్యర్థుల పరిచయం
జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎం.సుధీర్‌రెడ్డితో పాటు, పార్టీ కడప ఎంపీ అభ్యర్థి వైయస్.అవినాష్‌రెడ్డిని సభకు పరిచయం చేసిన శ్రీ వైయస్ జగన్, ఇద్దరినీ మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు.
వైయస్సార్సీపీ గుర్తు ఫ్యాన్‌ను కూడా సభకు చూపిన ఆయన, అందరూ గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.













