జగనన్న విద్యాదీవెన ప్రారంభించిన సీఎం
జగనన్న విద్యాదీవెన పథకం మొదటి విడతను ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఆన్లైన్ ద్వారా రూ.671.45 కోట్ల నిధులను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,88,439 మంది విద్యార్థులు ఈ దఫా లబ్ధి పొందనున్నారు. విద్యాదీవెనలో భాగంగా విద్యార్థులకు తొలి త్రైమాసికం బోధనా రుసుముల్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ జగనన్న విద్యాదీవెన గొప్ప కార్యక్రమం. చదువుతోనే జీవితాల రూపు రేఖలు మారతాయి. పేదరికం నుంచి బయపటడతాం. విద్యార్థుల తల్లుల ఖాతాలో రూ.671 కోట్లు జమ చేస్తున్నామని తెలిపారు.
2018-19 సంబంధించి రూ.1880 కోట్లు బకాయిలు చెల్లించాం. 2019-20కి సంబంధించి రూ.4208 కోట్లు గతేడాది చెల్లించాం. పిల్లల చదువుకు ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటుంది. ప్రతి త్రైమాసికం పూర్తికాగానే నిధులు విడుదల చేస్తాం. అర్హత ఉండి ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోతే విద్యార్థులు 1902కు ఫోన్ చేస్తే ప్రభుత్వం వెంటనే స్పందిస్తుంది. కళాశాల యాజామాన్యాలలోనూ జవాబుదారీ పెరగాలి. ప్రీ ప్రైమరీ కేంద్రాలుగా అంగన్వాడీలను అభివృద్ధి చేస్తున్నాం అని జగన్ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా బోధనా రుసుముల్ని కళాశాలల యాజమాన్యాలకు బదులుగా విద్యార్థుల తల్లులు, సంరక్షకుల ఖాతాలో జమచేయనుంది. జగనన్న విద్యాదీవెన ద్వారా ప్రభుత్వం ఏటా నాలుగు విడతల్లో బోధనా రుసుముల్ని విడుదల చేయనుంది. నేడు తొలివిడత, జులైలో రెండు, డిసెంబరులో మూడు, ఫిబ్రవరి 2022లో నాలుగో విడత నిధులు జమచేస్తుందని అన్నారు.













