చంద్రబాబుని నమ్మడం.. చంద్రముఖిని నిద్ర లేపడం తో సమానం.. వైఎస్ జగన్..
రాబోయే ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పెదకూరపాడు సెంటర్లో జరిగిన బహిరంగ సభలో మరోసారి చంద్రబాబు నాయుడు పై విమర్శలు గుప్పించారు. ఎన్నికలను కురుక్షేత్ర యుద్ధంతో పోల్చడమే కాకుండా ఏకంగా చంద్రబాబును చంద్రముఖితో పోల్చారు. అంతేకాదు ఈ ఎన్నికల్లో ప్రజలకు కేవలం ఎమ్మెల్యేనో, ఎంపీనో ఎన్నుకోవడం కోసం ఓటు వేయడం లేదని.. మీ ఓటు మీ భవిష్యత్తుని.. పథకాల కొనసాగింపుని నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. చంద్రబాబును నమ్ముకుంటే ఒక్క పథకం కూడా ఉండదని.. ఇది తాను చెబుతున్న విషయం కాదు చంద్రబాబు చరిత్ర చెబుతున్న సత్యమని జగన్ అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితి తెలిసి కూడా సాధ్యం కాని రీతిలో ఆయన ఇచ్చిన హామీలే దానికి నిదర్శనం అని విమర్శించారు. చంద్రబాబుని నమ్ముకోవడం చంద్రముఖిని నిద్ర లేపడంతో సమానం అని జగన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నిద్రలేచిన చంద్రముఖి లక లకా అంటూ మీ రక్తం తాగుతుంది.. గుర్తుపెట్టుకోండి అని హెచ్చరించారు. తాను ప్రజల కోసం ఎంతో చేశానని.. అందుకే వాళ్లే తన స్టార్ క్యాంపెనర్లు అని నమ్ముతున్నాను అని చెప్పిన జగన్ ఈసారి కూడా మద్దతి ఇచ్చి భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.













