జగన్ కొత్త క్యాబినెట్ రెడీ అయిందా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటికే తన మంత్రివర్గ ఏర్పాటుపై కసరత్తును పూర్తి చేశారన్నట్లుగా వార్తలు వెలువడుతున్నాయి. తన మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలన్నదానిపై ఇప్పటికే ఆయన సన్నిహితులతో సమాలోచనలు కూడా చేశారు. అన్ని ప్రాంతాలు..సామాజిక సమీకరణాలను పరిగణలోని తీసుకొని మంత్రివర్గానికి జగన్ తుది రూపు ఇస్తున్నారు. ఎన్నికల వేళ..అభ్యర్దుల ఎంపికలో ఎంత పక్కాగా సమీకరణాల వారీగా ఖరారు చేసారో అదే ఫార్ములాను ఇప్పుడు అనుసరిస్తున్నారు. అయితే ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువగా ఉండటంతో పోటీ సైతం ఎక్కువగానే ఉంది. దీంతో..సీనియర్ల..జూనియర్ల సమతూకంతో కేబినెట్ ఖరారు చేస్తున్నారు.
సామాజిక వర్గాల వారీగా చూసుకుంటే మొత్తం 25 మందితో ఏర్పాటు చేసే ఈ కేబినెట్లో రెడ్డి సామాజిక వర్గానికి ఏడు స్థానాలు, బీసీ వర్గాలకు ఆరు స్థానాలు, కమ్మ వర్గానికి రెండు బెర్తులు, ఎస్సీ మాల- 1, ఎస్సీ-మాదిగ-1, ఎస్టీ-1, క్షత్రియ-ముస్లిం మైనార్టీ-బ్రాహ్మణ- వైశ్య వర్గాలకు ఒక్కో స్థానం చొప్పున బెర్తులు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. కాపు వర్గానికి రెండు సీట్లు ఇస్తారని చెబుతున్నారు. ఉత్తరాంధ్ర నుండి మాజీ ఎంపి..ప్రస్తుత భీమలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస రావు, కాకినాడ రూరల్ నుండి గెలిచిన కురసాల కన్నబాబు లేదా దాడిశెట్టి రాజాల్లో ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది.













