YS Jagan : అయిననూ అసెంబ్లీకి పోయి రావలె..!!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లోనే చంద్రబాబు ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను కూడా ప్రవేశ పెట్టింది. దాదాపు 11 రోజులపాటు ఈ అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. అయితే ఈ సమావేశాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. తమకు 11 సీట్లే వచ్చినందున ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని.. ఆ హోదా లేకుండా అసెంబ్లీకి వెళ్తే తమకు మాట్లాడేందుకు తగిన సమయం ఇవ్వరనేది ఆ పార్టీ నేత జగన్ చెప్తున్న మాట. అయితే అసెంబ్లీకి వెళ్లకూడదన్న జగన్ నిర్ణయంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు అసెంబ్లీ చక్కటి వేదిక. అసెంబ్లీలో అధ్యక్షా అని పిలిచేందుకు ఎంతోమంది నేతలు కలలు కంటుంటారు. ఒక్కసారైనా అలాంటి అవకాశం వస్తే బాగుంటుందనుకుంటారు. అలాంటిది అవకాశం వచ్చినా అసెంబ్లీకి వెళ్లకుండా ఇంటికి పరిమితం కావడం పలాయనవాదమే. అసెంబ్లీకి పంపించింది నియోజకవర్గ ప్రజలు. అసెంబ్లీకి వెళ్లకుండా ఇంట్లో కూర్చోవడం అంటే అది తమ నియోజకవర్గ ప్రజలను అవమానించడమే. చంద్రబాబు పైన కోపంతో అసెంబ్లీకి వెళ్లకపోవడం వల్ల నష్టం ఆయనకు కాదు. కచ్చితంగా తమను నమ్మి ఓటేసిన ప్రజలకే.
అసెంబ్లీలో మైక్ ఇవ్వరని జగన్ బాధపడుతున్నారు. మరి జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్పీకర్ అధికారికంగా గుర్తించిన చంద్రబాబుకు మైక్ ఎంత సేపు ఇచ్చారు..? ఆయనకు మీరు ఏమాత్రం గౌరవం ఇచ్చారు..? చంద్రబాబు లేవగానే ఆనయపై మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు విరుచుకు పడేవారు. చివరకు ఆయన భార్యను అవమానించారు. అందుకే ఆయన ఇది గౌరవ సభ కాదు.. కౌరవ సభ అని మళ్లీ ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని శపథం చేసి బయటకు వచ్చేశారు. అప్పుడు ఆయనకు, ప్రతిపక్షానికి తగిన గౌరవం ఇచ్చి ఉంటే ఈరోజు జగన్ కు ఇలా మైక్ కోసం ఆవేదన చెందాల్సిన అవసరం ఉండేది కాదేమో.
అయినా అసెంబ్లీకి వెళ్లడం రాజకీయ పార్టీలు, నేతల బాధ్యత. గతంలో తాను వ్యవహరించినట్లే.. ఇప్పటి అధికార పక్షం కూడా తన పట్ల అలాగే వ్యవహరిస్తుందని జగన్ కు తెలుసు. అంటే మైక్ ఇవ్వరని.. మైక్ ఇచ్చినా కట్ చేస్తారని తెలిసిన విషయమే. అయినా అసెంబ్లీలో అడుగు పెట్టి నిమిషమో.. అర నిమిషమో సమయం దొరికినా దాన్ని సద్వినియోగం చేసుకోవడం జగన్ బాధ్యత. ఒకవేళ మైక్ ఇచ్చి కట్ చేస్తే జగన్ పట్ల సానుభూతి కలుగుతుంది. అదే కదా చంద్రబాబు విషయంలో జరిగింది. ఇంత చిన్న లాజిక్ ను జగన్ ఎలా మిస్ అయ్యారో అర్థం కావట్లేదు. సభలో ఒక్కరున్నా ఒంటరి పోరాటం చేయాలి. అప్పుడే తన సత్తా ఏంటో జనానికి తెలుస్తుంది. అంతేకానీ.. ఇలా అలిగి పలాయనవాదం అవలంబిస్తే అది రాజకీయ నేతల లక్షణం అనిపించుకోదు. ఈ విషయంలో జగన్ పునరాలోచిస్తే మంచిది.













