Jagan: తెనాలిలో జగన్ కు ఘన స్వాగతం పలికిన అభిమానులు.. డైలమాలో కూటమి..
గత ఏడాది జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ (YSR Congress party) పార్టీకి ఎదురైన భారీ పరాజయం తెలిసిందే. 2019 ఎన్నికల్లో 151 సీట్లతో ఘన విజయాన్ని సాధించిన ఈ పార్టీ, 2024 ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. ఈ ఫలితంతో పార్టీకి, జగన్ (Jagan) కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పరాజయం అనంతరం పలువురు కీలక నేతలు వైసీపీని (YCP) వీడి వెళ్లిపోయారు. కొందరు ప్రత్యర్థి పార్టీల్లో చేరి జగన్‌పై విమర్శలు చేశారు. ఇదే సమయంలో జగన్ ఇక తిరిగి నిలదొక్కుకోలేరని, ఆయన రాజకీయ ప్రయాణం సంక్షోభంలో పడిందని చెప్పే వారు కూడా లేకపోలేదు.
అయితే, తాజా పరిణామాలు వైసీపీ అధినేత జగన్‌కు ఇప్పటికీ ప్రజల్లో మంచి ఆదరణ ఉందని చూపిస్తున్నాయి. ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూశాక, కొంతకాలం రాజకీయంగా ఆటుపోట్లు ఎదుర్కొంటున్నట్లు కనిపించిన జగన్, తిరిగి ప్రజల్లోకి వెళ్లడం ప్రారంభించారు. ఆయన ప్రజల మధ్య అడుగుపెడుతూనే అభిమానుల నుంచి విశేష స్పందన వస్తోంది. గుంటూరు జిల్లా తెనాలిలో (Tenali) జరిగిన ఓ వివాహ రిసెప్షన్లో పాల్గొన్న జగన్‌కు అక్కడ ఊహించని స్థాయిలో స్వాగతం లభించింది.
తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ (Anabathuni Shivakumar) కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరైన జగన్‌ను చూసేందుకు వేలాది మంది తరలివచ్చారు. ఆయనకు అద్భుతమైన స్వాగతం పలుకుతూ, “జై జగన్” నినాదాలతో ప్రాంగణం మార్మోగిపోయింది. జగన్ నడుస్తున్న సమయంలో అభిమానులు గులాబీల వర్షం కురిపించి తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్నికల్లో పరాజయం పాలైన ఏడాదికంటే తక్కువ సమయంలోనే జగన్‌ను చూడటానికి ఇంత మంది అభిమానులు రావడం రాజకీయ విశ్లేషకులను ఆకర్షించింది.
తెనాలి నియోజకవర్గం సంప్రదాయంగా తెలుగుదేశం పార్టీ బలమైన కోటగా గుర్తింపు పొందింది. ఇక్కడ ప్రధానంగా టీడీపీ (TDP) మద్దతుదారులే అధికంగా ఉంటారు. ప్రస్తుతం జనసేన ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ఇక్కడ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆలపాటి రాజా వంటి నేతలు టీడీపీ తరఫున బలమైన స్థాయిలో ఉన్నారు. ఇలాంటి ప్రాంతంలో జగన్‌కు అనూహ్యమైన ప్రజాదరణ కనిపించడం విశేషంగా చెప్పుకోవాల్సిన విషయం. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్‌కు ఈ స్థాయిలో స్పందన రావడం రాజకీయంగా ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఎన్నికల సమయంలో జరిగిన ఓటింగ్‌లో వైసీపీకి 40 శాతం ఓట్లు వచ్చాయి. ఈ స్థాయిలో ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ సీట్ల సంఖ్య తక్కువగా రావడం అనేక విశ్లేషణలకు దారితీసింది. కానీ, ఎన్నికల తర్వాత కూడా జగన్‌కు ప్రజల్లో ప్రభావం మిగిలే ఉందని తాజా సంఘటనలు చెబుతున్నాయి. ప్రజలు ఇంకా ఆయనను తిరస్కరించలేదని, ఆయనకు ఇప్పటికీ ఓ నిబద్ధత కలిగిన ఓటు బ్యాంకు ఉందని అనిపిస్తోంది. ఇది ఆయన రాజకీయ భవిష్యత్తుపై కొత్త అంచనాలకు దారి తీస్తోంది.













