విశాఖ ఎమ్మెల్సీ రేసులో బొత్స..!! మరి కూటమి క్యాండిడేట్ ఎవరు?
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవలే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ముగిశాయి. ఎన్డీయే కూటమి ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. అయితే ఇప్పుడు మరో ఎన్నికకు తెరలేవబోతోంది. త్వరలోనే విశాఖపట్నం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతోంది. వైసీపీకి సంపూర్ణ మెజారిటీ ఉన్న ఈ స్థానంలో మాజీ మంత్రి బొత్స సత్యనారయణను బరిలోకి దింపుతున్నారు ఆ పార్టీ అధినేత జగన్. మరి ఎన్డీయే కూటమి తరపున ఎవరు బరిలో ఉంటారు..? కూటమి ఈ స్థానాన్ని కైవసం చేసుకుంటుందా.. లేకుంటే వైసీపీ పట్టు నిలుపుకుంటుందా.. అనే అంశాలు ఆసక్తి కలిగిస్తున్నాయి.
విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక ఈ నెల 30న జరగనుంది. ఇప్పటికే నోటఫికేషన్ విడుదలైన ఈ ఎన్నికకు ఈ నెల 13 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. 16వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. పోలింగ్ 30న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ జరుగుతుంది. సెప్టెంబర్ 3న ఓట్లు లెక్కిస్తారు. సెప్టెంబర్ 6తో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. ఎమ్మెల్సీ పరిధిలో మొత్తం 841 ఓట్లు ఉన్నాయి. ఇందులో వైసీపీకి 615 మంది సభ్యులున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీకి 215 మంది సభ్యుల బలముంది.
ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల పరిధిలో విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలున్నాయి. మున్సిపల్ కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సెలర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఈ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. గతంలో ఇక్కడి నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన వంశీకృష్ణ యాదవ్ తాజా ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవడంతో ఇక్కడ ఖాళీ ఏర్పడింది. ఈ స్థానంలో ఎలాగైనా పట్టు నిలుపుకోవాలనే పట్టుదలతో ఉంది వైసీపీ. అందుకే వ్యూహాత్మకంగా సీనియర్ రాజకీయ నాయకుడు బొత్స సత్యనారాయణను ఇక్కడ బరిలోకి దింపుతోంది.
కూటమి తరపున ఇక్కడ ఎవరు బరిలోకి దిగుతారనేది ఇంకా తెలియట్లేదు. అయితే టీడీపీయే ఈ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నిక కావడంతో దీన్ని కూటమి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. వాస్తవానికి ఇక్కడ కూటమికి మెజారిటీ లేదు. అయితే కొంతమంది వైసీపీ సభ్యులు గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవలే పలువురు కార్పొరేటర్లు, కౌన్సెలర్లు వైసీపీ నుంచి టీడీపీ, జనసేన కండువాలు కప్పుకున్నారు. త్వరలోనే మరికొంతమంది రాబోతున్నట్టు సమాచారం. పోలింగ్ కు ఇంకా సమయం ఉంది కాబట్టి ఈలోపు ఏదైనా జరగొచ్చనే అంచనాలో ఉన్నారు కూటమి నేతలు.













