విదేశాలకు తరలి వెళ్తున్న వైసీపీ ముఖ్య నేతలు.. కారణం అదేనా?
2024 ఎన్నికల్లో ఘోర ఓటమిపాలైన తర్వాత వైసీపీ నేతలలో కాస్త జోరు తగ్గింది. ప్రతిపక్షంపై సెటైర్లు కురిపిస్తూ గతంలో వరుస వీడియోలు పెట్టే ఎందరో వైసీపీ లీడర్లు సడన్ గా సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు ఇది చాలదన్నట్టు ఈ పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలు విదేశాలకు వెళ్లేందుకు తమకు అనుమతి మంజూరు చేయాల్సిందిగా సీబీఐ కోర్టును ఆశ్రయించారు. మామూలుగా విదేశాలకు వెళ్లడానికి వీసా ఉంటే సరిపోతుంది.. సీబీఐ కోర్టు అనుమతి అక్కర్లేదు.. కానీ ఈ ఇద్దరిపై కేసులు నమోదైన నేపథ్యంలో దేశం దాటాలంటే అనుమతి కావాలి కదా. ఇంతకీ ఆ ఇద్దరు కీలక నేతలు ఎవరో తెలుసా.. ఒకరు వైసీపీ అధినేత జగన్ కాగా మరొకరు వైసీపీ పార్టీ లో కీలకమైన విజయ్ సాయి రెడ్డి. ఒకరు యూకే కి వెళ్లడానికి అనుమతి కోరితే మరొకరు యూరప్ కి వెళ్లడానికి పర్మిషన్ అడుగుతున్నారు.
యూకే లో చదువుకుంటున్న తన కుమార్తెను కలవడానికి వీలుగా సెప్టెంబర్ మొదటి వారంలో యూకే కి వెళ్లడానికి జగన్ అనుమతి కోరుతూ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను పరిశీలించిన సీబీఐ కోర్టు ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టి. రఘురాం, ఈ విషయంలో సీబీఐ వివరణ కోరింది.ఇక అక్రమాస్తుల కేసులో ఏ2గా ఉన్న విజయసాయిరెడ్డి యూరప్ కు వెళ్లడానికి ఏకంగా వచ్చే ఆరు నెలలలో 60 రోజుల టూర్ కోసం అనుమతి కోరుతూ సీబీఐ కోర్టును ఆశ్రయించారు.
ఈ విషయంలో విజయ్ సాయి రెడ్డి న్యాయవాది గతంలో కూడా అనుమతి ఇచ్చారు అన్న విషయాన్ని గుర్తు చేశారు. కానీ సీబీఐ తరపు న్యాయవాది మాత్రం ఇలా అనుమతులు ఇస్తూ పోతే విచారణలో జాప్యం జరుగుతుంది అంటూ తన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే కేసు విచారణ నత్తనడక నడుస్తోందని.. ఇటువంటి సమయంలో అనుమతి ఇవ్వవద్దని కోర్టును ఆయన కోరారు. దీనికి సంబంధించిన విచారణ ఈనెల 30 కి వాయిదా వేశారు. అధికార పార్టీని ప్రశ్నిస్తూ జగన్ తన గొంతును వినిపిస్తాడు అని ఆశిస్తున్న వైసీపీ నేతలకు ఇలా జగన్ సడన్ విదేశీ ప్రయాణం కాస్త నిరాశనే కలిగిస్తోంది.













