వైఎస్ షర్మిల వెళ్లాకే సీఎం జగన్మోహన్ రెడ్డి రాక !
వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైఎస్ఆర్ తెలంగాణ అధ్యక్షురాలు షర్మిల ఈ నెల 8న వేర్వేరు సమయాల్లో నివాళులర్పించనున్నారు. ఈ మేరకు ఇద్దరి పర్యటన వివరాలు వెలువడ్డాయి. షర్మిల శుక్రవారం రాత్రి (7వ తేదీన) ఇడుపులపాయ ఎస్టేట్‌కు చేరుకుని బస చేయనున్నారు. మరుసటి రోజు ఉదయం తల్లి విజయమ్మతో కలిసి నివాళులర్పించి తిరుగు ప్రయాణం కానున్నారు. జగన్ 8న మధ్యాహ్నం 1.55 గంటలకు ఇడుపులపాయకు చేరుకుని నివాళులర్పిస్తారు. ఏటా అన్నాచెల్లెళ్లు కలిసి కార్యక్రమంలో పాల్గొంటుండగా ఈ సారి మాత్రం వేర్వేరు సమయాల్లో హాజరవుతున్నారు. వైఎస్ఆర్ సమాధి వద్ద ప్రార్థనల్లో పాల్గొన్న అనంతరం షర్మిల తన రాజకీయ భవిష్యత్తుపై ప్రకటన చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని విలీనం చేయనున్నారనే ప్రచారం కొంత కాలంగా నడుస్తోంది. ఈ ప్రచారానికి షర్మిల ఆ రోజున తెరదించే అవకాశాలున్నాయి.













