YS Jagan: జగన్ తెనాలి పర్యటన వెనుక రాజకీయ వ్యూహం..!!

గుంటూరు జిల్లా తెనాలి (Tenali) ఐతానగర్‌లో (Itha Nagar) ఇటీవల పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తిన్న ముగ్గురు యువకుల కుటుంబాలను వైఎస్సార్‌సీపీ (YSRCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan) పరామర్శించడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ యువకులపై రౌడీషీట్‌లు ఉన్నాయని, వారు గంజాయి విక్రయాలు, సామాన్యులపై దాడులు, హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్న నేపథ్యంలో జగన్ పరామర్శ రాజకీయ వర్గాల్లో మిశ్రమ స్పందనలను రేకెత్తించింది. కొందరు దీనిని దళితుల పట్ల సానుభూతిగా చూస్తుండగా, మరికొందరు ఇది వైసీపీ యొక్క రాజకీయ వ్యూహంగా విశ్లేషిస్తున్నారు.
ఓ పోలీసు కానిస్టేబుల్‌తో రాకేష్, జాన్ విక్టర్, కరీముల్లా అనే ముగ్గురు యువకులు గొడవ పడ్డారనే కారణంతో ఏప్రిల్ 24న వాళ్లను పోలీసులు బహిరంగంగా లాఠీలతో కొట్టారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీళ్లు దళిత, మైనార్టీ వర్గాలకు చెందినవారని, వారిపై పోలీసులు అన్యాయంగా చిత్రహింసలు గురిచేశారని జగన్ ఆరోపించారు. మంగళవారం తెనాలికి వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించారు. పోలీసులు కోర్టు తీర్పు ఇవ్వకముందే యువకులను శిక్షించడం, వారి పరువును బహిరంగంగా దెబ్బతీయడం సరికాదని జగన్ అన్నారు. ఈ యువకులు చదువుకున్నవారు, వారిపై ఉన్న కేసులు పెద్దవి కావని ఆయన చెప్పారు.
జగన్ పరామర్శపై తెలుగుదేశం పార్టీ (TDP) తీవ్రంగా స్పందించింది. రౌడీషీటర్లను పరామర్శించడం ద్వారా జగన్ సమాజంలో అశాంతిని రెచ్చగొట్టాలని చూస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. నేరస్తులకు మద్దతివ్వడం ద్వారా జగన్ పార్టీ శ్రేణులకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించారు. మరోవైపు.. తెనాలిలో జగన్ కాన్వాయ్‌ను దళిత, ప్రజా సంఘాలు, ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు అడ్డుకుని నిరసనలు చేపట్టారు. వైసీపీ హయాంలో హత్యకు గురైన నూతక్కి కిరణ్ కుటుంబాన్ని జగన్ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. ఇప్పుడు రౌడీషీటర్లకు మద్దతివ్వడం దారుణం అని నినాదాలు చేశారు.
అయితే రౌడీషీటర్ల కుటుంబాలను జగన్ పరామర్శించడం వెనుక రాజకీయ వ్యూహం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ యువకులు దళిత, మైనార్టీ వర్గాలకు చెందినవారు. వాళ్లను పోలీసులు బహిరంగంగా శిక్షించారని జగన్ అన్నారు. తద్వారా దళితుల మద్దతును బలోపేతం చేసుకోవాలని చూస్తున్నారని వారి అభిప్రాయం. వైసీపీకి దళితులు తొలి నుంచి పటిష్టమైన ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఈ సంఘటనను దళితులపై అణచివేతగా చిత్రీకరించి, కులం కార్డును వాడటం ద్వారా జగన్ తన ఓటు బ్యాంకును మరింత పటిష్టం చేసుకోవాలనుకున్నారని కొందరు విశ్లేషిస్తున్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు జగన్ తమ వెంట నిలుస్తాడని దళితులు నమ్ముతారు. ఇది వారిలో ఉత్సాహాన్ని రెట్టింపు చేసి, పార్టీ కోసం అంకితభావంతో పనిచేసేలా చేస్తుంది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత, వైసీపీ తమ ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి, ముఖ్యంగా దళిత, మైనార్టీ వర్గాల మద్దతును బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది.
జగన్ తెనాలి పర్యటన ఒక వైపు దళితుల (Dalith) పట్ల సానుభూతిగా కనిపిస్తున్నప్పటికీ, మరోవైపు రాజకీయ లబ్ధి కోసం కుల కార్డును ఉపయోగించే ప్రయత్నంగా విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ చర్య వైసీపీ శ్రేణులను ఉత్తేజపరిచి, దళిత ఓటు బ్యాంకును బలోపేతం చేయవచ్చు, కానీ అదే సమయంలో సమాజంలో అశాంతిని రెచ్చగొట్టే ప్రమాదం కూడా ఉందని విమర్శకులు హెచ్చరిస్తున్నారు.