అవినాశ్‌ను కలవరపెడుతున్న షర్మిల!
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు మరో నాలుగు రోజుల్లో విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరు గెలుస్తారు.. ఎవరు ఓడుతారు.. అనే దానిపై భారీగా బెట్టింగులు నడుస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని కంచుకోటలు ఈసారి బద్దలు కాబోతున్నాయని ఇంటాబయటా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కడప వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. అలాంటి కోటలో కూడా ఈసారి పాగా వేస్తామని కూటమి చెప్తోంది. మరోవైపు ఇంటిపోరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా కలవరపెడుతోంది.
కడప పార్లమెంటు స్థానానికి వైఎస్ అవినాశ్ రెడ్డి మూడోసారి బరిలోకి దిగారు. గత రెండు సార్లు అవినాశ్ కు భారీ మెజారిటీ దక్కింది. ఈసారి కూడా అంతకుమించి మెజార్టీ సాధిస్తామని వైసీపీ నేతలు చెప్తున్నారు. అయితే ఎక్కడో లోపల కాస్త ఆందోళన మాత్రం ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. ఎందుకంటే గతంలో షర్మిల అన్న జగన్ కు అండగా ఉన్నారు. ఇంటి సమస్యలు లేవు. కానీ ఇప్పుడు షర్మిల అన్న జగన్ తో విభేదించి బయటకు వచ్చారు. కాంగ్రెస్ తరపున ఆమె నేరుగా బరిలోకి దిగారు. దీంతో షర్మిల ప్రభావం ఎంతమేర ఉంటుందోననే భయం వైసీపీలో కనిపిస్తోంది.
షర్మిల ఈసారి నేరుగా జగన్ ను, అవినాశ్ ను టార్గెట చేశారు. వివేకా హత్య కేసును ప్రధానాంశంగా చేసుకుని ఓట్లు అభ్యర్థించారు. మరోవైపు తల్లి విజయమ్మ ప్రచారానికి రాకపోయినా సన్నిహితులందరికీ ఫోన్లు చేసి షర్మిలకు, జగన్ కు ఓట్లేయాలని కోరినట్లు సమాచారం. వైఎస్ సొంత బిడ్డ కావడంతో షర్మిలకు ఓటేసేందుకు పలువురు వైఎస్ అభిమానులు, కార్యకర్తలు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగి ఉంటే వైఎస్ అవినాశ్ రెడ్డికి ఈసారి మెజార్టీ భారీగా తగ్గడం ఖాయం.
ఒకవేళ షర్మిలకు 2 లక్షల ఓట్లు వస్తే అవినాశ్ రెడ్డి ఓడిపోతారని అంచనా వేస్తున్నారు. లక్ష ఓట్లు సాధిస్తే అవినాశ్ రెడ్డి 50-60 వేల ఓట్ల మెజారిటీతో బయటపడొచ్చని అనుకుంటున్నారు. 2014 ఎన్నికల్లో లక్ష 90వేలు, 2019 ఎన్నికల్లో 3లక్షల 80వేల ఓట్ల మెజారిటీ సాధించారు అవినాశ్ రెడ్డి. కానీ ఈసారి మాత్రం అలాంటి పరిస్థితి ఉండబోదని చెప్తున్నారు. ఒకవైపు టీడీపీ, మరోవైపు కాంగ్రెస్ ఓట్ల చీలికలో అవినాశ్ రెడ్డి నష్టపోతారని భావిస్తున్నారు. అందుకే అవినాశ్ కు షర్మిల భయం భారీగానే పట్టుకున్నట్టు తెలుస్తోంది.













