Avinash Reddy: బీజేపిలోకి అవినాష్ రెడ్డి..? ఆ కేసు భయమేనా..?
అప్పట్లో మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో.. కడప ఎంపీ అవినాష్ రెడ్డి టార్గెట్ గా తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చాయి. చివరకు వైయస్ (YS Family) కుటుంబంలోని ఒక వర్గం కూడా ఆయనను తీవ్రస్థాయిలో విమర్శించింది. ముఖ్యంగా వైఎస్ షర్మిల (YS Sharmila) అలాగే వైఎస్ సునీత రెడ్డి… అవినాష్ రెడ్డిని ఎక్కువగా టార్గెట్ చేశారు. ఇక ఈ కేసును సిబిఐ అధికారులు విచారించడంతో.. అవినాష్ రెడ్డి ఇబ్బందిపడ్డారు. ఒకానొక సమయంలో ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉందని అందరు భావించారు.
కానీ అనూహ్యంగా ఆరోజు సిబిఐ అధికారులు వెనక్కు తిరిగారు. ఇక ఇప్పుడు అవినాష్ రెడ్డి కచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కనబడుతున్నాయి. ఇటీవల వైసిపికి అలాగే రాజకీయాలకు గుడ్ బై చెప్పిన మాజీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి.. ఢిల్లీలో లాబీయింగ్ చేసే పరిస్థితి కనపడలేదు. వ్యక్తిగత విషయాలతో విజయసాయిరెడ్డి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఈ సమయంలో అవినాష్ రెడ్డిని కాపాడాలి అంటే ఆయన కచ్చితంగా బిజెపిలోకి వెళ్లాల్సిందే అనే అభిప్రాయం కుటుంబ సభ్యుల నుంచి వ్యక్తం అవుతున్నట్టు తెలుస్తోంది.
వైఎస్ జగన్ కూడా ఆయనను బిజెపిలోకి పంపించేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అవినాష్ రెడ్డి బిజెపిలోకి వెళితే ఢిల్లీలో తనకు ఎంతో కొంత బలం ఉంటుందని జగన్ భావిస్తున్నట్లుగా సమాచారం. అలాగే అవినాష్ రెడ్డికి కూడా రక్షణ ఉంటుందని జగన్ భావిస్తున్నట్లుగా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. గతంలో వైఎస్ కుటుంబంలో ఓ సమావేశంలో జగన్.. వివేకానంద రెడ్డి కేసు విషయంలో అవినాష్ రెడ్డికి.. ఇబ్బంది ఏమీ లేదని కేసు పెడితే బిజెపిలో జాయిన్ అవుతాడని వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు చివరకు అదే నిజమయ్యే సంకేతాలు కనపడుతున్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అయితే ఆయన చేరికను రాష్ట్ర బిజెపి ఎంతవరకు అంగీకరిస్తుంది.. అలాగే టిడిపి నేతలు ఎంతవరకు అంగీకరిస్తారనేది చెప్పలేని పరిస్థితి.













