ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల సామర్థ్యాన్ని తెలియచేయటమే నా జీవిత లక్ష్యం CM
తీవ్ర ఆర్థిక నేరాల కింద 31 కేసులు ఎదుర్కొంటూ 16 నెలలు జైల్లో ఉండి వచ్చిన అవినీతి పరుడైన వ్యక్తికి, ఈ ఐదేళ్ళ ఆంధ్రప్రదేశ్ అనే బిడ్డను అప్పచెప్పి ఆ పసికందు భవిష్యత్తును చిదిమేద్దామా?
నా ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరికీ హృదయ పూర్వక నమస్కారాలు.
ఐదేళ్ల కిందట అన్యాయంగా జరిగిన విభజన కారణంగా కట్టుబట్టలతో అమరావతి కి వచ్చాము. ఏం చేయాలో ఎవరిని అడగాలో ఏమీ తెలియని స్థితిలో ఉన్న ప్రజలు, నా మీద నమ్మకంతో నిధులు, రాజధాని, వసతులు లేని పసి బిడ్డ లాంటి రాష్ట్రాన్ని నాకు అప్పచెప్పారు. మీ నమ్మకాన్ని నిలబెట్టాలని గత ఐదేళ్లు పగలు రాత్రి కష్టపడ్డాను. విభజన సమస్యలు తీర్చి, ప్రత్యేక హోదా ఇచ్చి, ఆదుకోవాల్సిన కేంద్రం నమ్మక ద్రోహం చేసినా, ఉమ్మడి రాష్ట్ర ఆస్తుల్లో మనకు రావలసిన వాటా తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుండా అడ్డం తిరిగినా, స్వశక్తిని నమ్ముకుని ముందుకు నడిచాను.
సంకల్పం పవిత్రమైనది ఐతే సకల దేవతలు సహకరిస్తారు అని వివేకానందుడు చెప్పిన మాటలు పూర్తిగా విశ్వసించి ముందుకు నడిచాను. పాదయాత్రలో పేదల కష్టాలు చూశాను. ఆపన్నులు అందరికీ సంక్షేమం ఇవ్వాలనుకున్నాను. రోజుకు 18 గంటలు కష్టపడి సంపద సృష్టించాను. రైతులకు లక్షన్నర రూపాయల వరకు రుణమాఫీ, 15 వేల వరకూ పెట్టుబడి సాయం, పేదలకు రెండు వేల రూపాయల పెన్షన్, ఆడపడుచులకు 20 వేల రూపాయల పసుపు కుంకుమ, యువకులకు 2000 రూపాయల నిరుద్యోగ భృతి, పెళ్లీడుకొచ్చిన యువతులకు పెళ్లి కానుక, పేదలందరికీ 5 లక్షల రూపాయల వరకు ఉచిత కార్పొరేట్ వైద్యం, ఇంటిపెద్ద కు ఏమైనా అపాయం వాటిల్లితే చంద్రన్న బీమా కింద పేదలకు ఐదు లక్షల వరకు బీమా, పండుగలకు కానుకలు గ్రామాల్లో పట్టణ సౌకర్యాలు… సిసి రోడ్లు, ఎల్ఈడీ లైట్లు, ఇలా పేదల కష్టాలు తెలిసిన పెద్ద కొడుకుగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనే నా కుటుంబ సభ్యులందరినీ సంతోషంగా జీవింపచేయటానికి, వారి జీవన ప్రమాణాలు పెంచడానికి, నా శాయశక్తులా ఈ ఐదు సంవత్సరాలు కృషి చేశాను.
సంక్షేమంకోసంసంపద సృష్టి అత్యవసరం. అందుకని పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాను.రాష్ట్రానికి నీటి భద్రతను కల్పించేందుకురాష్ట్ర జీవనాడి అయినపోలవరం ప్రాజెక్టు సహామరో 60 నీటిపారుదల ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నాను. భారతదేశంలోని నగరాలు అన్నిటికంటే మేటిగా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు, ఉపాధి కల్పనకు, ఇంజిన్ లాగా ఉండే అమరావతి రాజధానిని నిర్మిస్తున్నాను.
రాష్ట్రంలో అభివృద్ధి అంతా ఒకేచోట కేంద్రీకృతం కాకూడదని ప్రతి జిల్లాలో పరిశ్రమలు,ఉన్నత విద్యాసంస్థలు, మౌలికవసతులుఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాకో ఎయిర్ పోర్టు, రహదారులవిస్తరణ, 24 గంటల విద్యుత్తు, సుపరిపాలన, సురక్షితంగా ఉంచే శాంతిభద్రతలు, వీటిని పెట్టుబడులనుఆకర్షించేందుకు రాజ మార్గాలుగా భావించి అభివృద్ధి చేస్తున్నాం. కియా మోటార్స్, హీరో మోటోకార్ప్, హెచ్.సి.ఎల్ లాంటి పరిశ్రమలు ప్రతి జిల్లాలో వచ్చే విధంగా ఆ జిల్లాలోని మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలను అభివృద్ధి చేయటానికి చేపట్టిన చర్యల వల్ల దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో రాష్ట్రం నిలిచింది. గత ఐదేళ్లలో రాష్ట్రానికి రెండు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈ పెట్టుబడులతో పాటు, ఏడు లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చాయి. రాబోయే అయిదేళ్లలో రాష్ట్రానికి 15 లక్షల ఉద్యోగాల సృష్టి లక్ష్యంగా పని చేస్తున్నాను.
గత ఐదేళ్లలో సంక్షేమం అభివృద్ధి అనే రెండు చక్రాలను సమర్థవంతంగా పరిగెత్తించి కొత్త రాష్ట్ర బంగారు భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకున్నాము. ఇప్పుడు ఆ పునాదిపై ఆంధ్రప్రదేశ్ ను ప్రపంచ అత్యుత్తమ పెట్టుబడుల గమ్యస్థానంగా చేయటానికి భవిష్యత్తు సౌధాలు నిర్మించాల్సిన అవసరం ఉంది. కష్టాల్లో కేంద్రం సహాయం చేయక పోయినా, ఎవరెన్ని కుట్రలు చేసినా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనే ఈ పసిబిడ్డ బాలారిష్టాలు అధిగమించి ఐదు సంవత్సరాల బిడ్డగా ఇప్పుడిప్పుడే ఎదుగుతోంది. ఈ కీలక సమయంలో ఈ బిడ్డను తీవ్ర ఆర్థిక నేరాలు వారికిఅప్పచెప్పగలమా? ఉమ్మడి రాష్ట్రంలో లక్ష కోట్లు దోచుకుని, రాష్ట్రం నుండి పరిశ్రమలు తరలిపోవడానికి, IAS అధికారులు జైలుకు పోవటానికి, కారణం అయి, చివరకు స్వయంగా తీవ్ర ఆర్థిక నేరాల కింద 31 కేసులు ఎదుర్కొంటూ 16 నెలలు జైల్లో ఉండి వచ్చిన అవినీతి పరుడైన వ్యక్తికి, ఈ ఐదేళ్ళ ఆంధ్రప్రదేశ్ అనే బిడ్డను అప్పచెప్పి ఆ పసికందు భవిష్యత్తును చిదిమేద్దామా? ఒక అవకాశం ఇమ్మని అడిగితే మన బిడ్డని నేరస్తులకు అప్ప చెప్తామా?? మన కళ్ళని మన వేళ్ళ తోనే పొడుచుకుంటామా? గడచిన ఐదేళ్ళు ఈ పసిబిడ్డ అభివృద్ధికి, ఎదుగుదలకు, అల్లర్లతో, కోర్టు కేసులతో, తన పేపర్లలో తప్పుడు రాతలతో అడ్డుపడిన ఒక అరాచకవాది, ఒక్క అవకాశం ఇవ్వమని అడిగినంతమాత్రానబిడ్డను అప్పచెప్పగలమా? రైతులకు మహిళలకు పేదలకు సంక్షేమ ఫలాలు అందకుండా చేయాలని, కోర్టులన్నిటిలో పిటిషన్లు వేసి, అడ్డుకోవాలని చూసిన కసాయి మనుషులకు మన ఐదేళ్ల బిడ్డను అప్ప చెబుదామా?
అవినీతి ఆస్తులను కాపాడుకోవటానికి,పొరుగు రాష్ట్రాలకు చెందిన ఆంధ్ర ద్రోహుల తో చేతులు కలిపి మన సాగునీటి ప్రాజెక్టులకి అడ్డుపడి, అన్నపూర్ణ లాంటి రాష్ట్రాన్ని ఎడారిగా మార్చడానికి, సిద్దపడ్డ ఒక అనుభవహీనుడిని నమ్మి, రాష్ట్రాన్ని అప్ప చెబుదామా??
ఒకసారి అడవిలో నాయకత్వానికి ఒక సెలయేరు ఒక గొడ్డలి పోటీ పడ్డాయిట. అందరి సంక్షేమాన్ని చూసే సెలయేరు కావాలా? చెట్లన్నీ అడ్డంగా నరికేసే గొడ్డలి కావాలా !! అని మీమాంస ఏర్పడినప్పుడు కొన్ని చెట్లు గొడ్డలికర్రది మనకులం కదా మన నాయకుడిగా పెట్టుకుంటే తప్పేమిటి అని అనుకున్నాయట… ఆ చెట్ల మాటలను మరో చెట్టు మీద నుంచి ఆసక్తిగా వింటున్న కుందేలు ఇలా అందట“మనమధ్య ఏ భేదం చూపకుండా మనందరి సంక్షేమమే తనకులం అని భావించి మనందరికీ సేవచేసే సెలయేటిని వదిలి, మనందరినీ అడ్డంగా నరికే గొడ్డలి కర్రను మీ కులమని ఓటేస్తే చెట్లన్నిటినీ నరికేసి చివరికి అడవి అంతరించిపోతే మీ భవిష్యత్తు ఏం కాను” అని అందట. అప్పుడు అడవిలో చెట్లన్నిటికీ జ్ఞానోదయమై అడవిలో చెట్లన్నీ పచ్చగా ఉండాలి అంటే సెలయేరు మన నాయకుడిగా ఉండాలి అని సెలయేటిని నాయకుని గా ఎన్నుకున్నాయట. అడవిలో చెట్లన్నిటికీ బాధ్యతను గుర్తు చేసిన ఆ కుందేలు మాటలు మన అందరికీ ఆదర్శం కావాలి.
నా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలే ప్రాణంగా బతికాను. ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర అభివృద్ధికి రాజధాని అభివృద్ధికి అమెరికా సింగపూర్ లాంటి దేశాల్లో వీధుల వెంట చెప్పులు అరిగేలా తిరిగి పెట్టుబడులు తీసుకు వచ్చాను ఆ ఫలాలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అనుభవిస్తోంది. నాకు ఆనందమే. అయితే రాష్ట్రం విడిపోయిన తరువాత అన్నదమ్ములు గా విడిపోయిన తరువాత మనకు రావలసిన వాటా లక్ష కోట్లు మనకు ఇవ్వకుండా మనకు ద్రోహం చేస్తున్న వారిపైనే నా బాధ, ఆక్రోశం. ఆ మోసం చేస్తున్న వారితో చేతులు కలిపి రాష్ట్రం మీదకు, రాష్ట్ర ప్రజల మీదకు రాష్ట్ర ప్రభుత్వం మీదకు దండెత్తి వస్తున్న కోడి కత్తి పార్టీల మీదే నా పోరాటం. రాష్ట్రానికి ద్రోహం చేసిన వారితో కలిసి, రాష్ట్రం మీదకు మళ్ళీద్రోహం చేయటానికి వచ్చేవారికి ఓటేస్తే ,రాష్ట్ర ప్రజలు నష్టపోతారు. నాకు ఓటేస్తే మిమ్మల్ని గెలిపిస్తాను. నా ట్రాక్ రికార్డు మీరు చూశారు. గతంలో ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ను, హైదరాబాదును, ప్రపంచపటం లో ప్రస్ఫుటంగా కనిపించేలా అభివృద్ధి చేశాను.
పార్టీలో ప్రభుత్వంలో అక్కడక్కడా కొన్ని పొరపాట్లు జరిగి, కొందరి వల్ల కొంత మంది కార్యకర్తలు, ప్రజలు ఇబ్బంది పడి ఉండొచ్చు. అందరికీ నా మనవి. అన్నదమ్ముల మధ్య మాటపట్టింపుల కారణంగా, తల్లిలాంటి పార్టీకి, తండ్రిలాంటి నాయకుడికి నష్టం కలగ చేస్తామా?? నన్ను చూసి ఓటెయ్యండి. 175 అసెంబ్లీ స్థానాలలో, 25 పార్లమెంట్ స్థానాలలో, నేనే అభ్యర్థిని. చంద్రబాబునాయుడు అభ్యర్థి గా భావించి ఓటేయండి. మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత నాది. భవిష్యత్తులో కూడా మీకు ఎవరి వల్ల ఎటువంటి అసౌకర్యం కలగకుండానేను పూర్తి బాధ్యత వహిస్తాను. కఠినంగా ఉంటాను.
రాష్ట్రంలో ప్రజలకు సుపరిపాలన అందిస్తూ బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి వివిధ దశల్లో బాల్యంలో యవ్వనంలో, విద్యాభ్యాసంలో, ఉద్యోగాన్వేషణలో, అనారోగ్యంలో, వివాహ సమయంలో ఇలా ప్రతి సందర్భంలోనూ మిమ్మల్ని నీడలా ఉండి కాపాడుకునే, పరిపాలన అందించటానికి నా శాయశక్తులా ప్రయత్నం చేశాను. అయితే అనుభవశూన్యులు, అరాచకవాదులు, అవినీతిపరులు, ఐదేళ్ల పసిబిడ్డలాంటి రాష్ట్రాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అవుతుంది.నేరాలు ఘోరాలు పెరిగిపోతాయి.పోలవరం ఆగిపోతుంది. రాజధాని అమరావతి నుండి తరలి పోతుంది. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు తరలిపోతాయి. భవిష్యత్తులో మరిక పెట్టుబడులు రావు. రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ఎంతో కష్టపడి ఈ ఐదేళ్లలో నిర్మించుకున్నాం, అది మట్టిలో కలిసిపోతుంది. పరిశ్రమలు తరలిపోయి, ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయి.
భగీరథ పాలన పోయి భస్మాసుర పాలన వస్తుంది. పసుపు కుంకుమ ఇచ్చే వారి పాలన పోయి, పసుపుకుంకు మ తుడిచేసే వారి ఆటవిక పాలన వస్తుంది. వీధికో రౌడీ తయారై మనింట్లో మనమే అద్దెకుండే పరిస్థితి ఏర్పడుతుంది. మన బిడ్డల భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించుకోండి.
ఆంధ్రప్రదేశ్ కు అండగా ఉంటానని తిరుపతి వెంకన్న సాక్షిగా చేసిన వాగ్దానాలను మరచి, ఆర్థిక నేరస్తులతో చేతులు కలిపి రాష్ట్రానికి వచ్చి కారుకూతలు కూస్తున్నారు ఢిల్లీ పెద్దమనుషులు. ఆంధ్ర ప్రదేశ్ సంస్కృతిని, ఆంధ్రప్రదేశ్ అమరవీరులను, తెలుగు తల్లిని, ఆంధ్ర వంటలను, అవమానించి ఆస్తులను లాక్కుంటామని బెదిరించి, బ్లాక్మెయిల్ చేయాలని చూసి, అది వీలు కాక ఇప్పుడు నదీ జలాలలో మన వాటా మనం వాడుకోకుండా అడ్డుకుంటూ, కుట్రలతో ఇక్కడ కోడి కత్తి పార్టీ తో ఒక కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించి, రాష్ట్ర హక్కులను కాలరాసి, మన సంపదను, వనరులను దోచుకోవాలనిఅనుకుంటున్నారు ఆంధ్రా ద్రోహులు. వీరిద్దరి తో కలిసి కుట్రలు చేస్తూ అవినీతి అక్రమార్జనల సాయంతో అడ్డదారిలో అధికారంలోకి వద్దామనుకునే ఆషాడభూతికి మీ ఓటుతోనే బుద్ధి చెప్పి తరిమేయండి.
మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉంటా. ఆడపడుచులు అందరికీ పెద్దన్నగా ఉంటా. మీరు ఏ ఆపదలో ఉన్నా అహోరాత్రాలు మీ ఆపద్బంధువు గా ఉంటా. మీ కోసం మీ బిడ్డల భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర సంక్షేమం అభివృద్ధి కొనసాగడం కోసం, 65 సంవత్సరాల ఆంధ్ర ప్రదేశ్ ప్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శాశ్వత రాజధాని కట్టుకోవటం కోసం, పంచ నదుల మహా సంగమం సాకారం చేసి, రాయలసీమతో సహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటినీ సస్యశ్యామలం చేయడానికి మన ప్రభుత్వం మళ్లీ రావాలి. మీ ప్రభుత్వం మళ్లీ రావాలి. ఇది మీ బాధ్యత. క్రిములు రాకుండా ఇంటికి పసుపు పూస్తాం. క్రిమినల్స్ రాకుండా రాష్ట్రానికి పసుపు రాద్దాం. మీరందరూ తెలుగుదేశం పార్టీని ప్రభుత్వాన్ని బలపరిచి,సైకిల్ గుర్తు పై మీరు ఓటు వేయటమే కాకుండా, మీ బంధుమిత్రులందరికీ చెప్పి అందరితో తప్పనిసరిగా ఓటు వేయించి, మన ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలోకి తీసుకు వచ్చే బాధ్యత మీది. ఎన్నికల రోజున ఎండగా ఉందని, క్యూలో ఉండాల్సి వస్తుందని, నిర్లిప్తంగా ఉండరాదని నా మనవి. ఐదేళ్ళ మంచిపాలన కోసం, ఒక గంట సమయం కేటాయించండి. అన్నపూర్ణ అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో సర్వోన్నత స్థానానికి తీసుకెళ్లి ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల సామర్థ్యాన్ని తెలియచేయటమే నా జీవిత లక్ష్యం. అందుకు మీరందరూ సహృదయంతో సంపూర్ణంగా సహకరిస్తారని ఆశిస్తూ…మీ భవిష్యత్తు నా బాధ్యత.
జై హింద్ జై జన్మభూమి జై ఆంధ్ర ప్రదేశ్
మీ
నారా చంద్రబాబునాయుడు













