YSRCP: ఫీజు పోరు మళ్లీ వాయిదా.. వైసీపీ ఫెయిల్యూర్ ప్లానింగ్..!!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఓటమి తర్వాత జనాల్లో కూడగట్టుకున్న వ్యతిరేకతను తొలగించుకునేందుకు ఆపసోపాలు పడుతోంది. కనీవినీ ఎరుగని పరాజయం కావడంతో దాని నుంచి ఆ పార్టీ బయటపడడం కష్టమే అనుకున్నారు. కానీ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan) త్వరగానే పార్టీలో కదలిక తీసుకురాగలిగారు. ముఖ్యంగా ఐదేళ్లపాటు ప్రజల ముందుకు, మీడియా ముందుకు రాని జగన్.. ఓటమి తర్వాత ఎక్కువసార్లు బయటికొచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రయత్నించారు. అందులో భాగంగా పలు నిరసన కార్యక్రమాలకు కూడా పిలుపునిచ్చారు. అయితే ఫీజు పోరు (Fees Poru) మాత్రం ఇప్పటికీ వాయిదాలు పడుతూనే ఉంది.
కూటమి ప్రభుత్వం (NDA Govt) అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడవక ముందే డిసెంబర్ నెలలో రైతులకోసం రైతు దీక్ష (Rythu Deeksha) చేపట్టింది వైసీపీ (YCP). అనంతరం విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ విద్యుత్ నిరసన దీక్ష (Electricity charges ) చేపట్టింది. అనంతరం జనవరి 3న విద్యార్థుల ఫీజు రీఎంబర్స్ మెంట్ (Fee reimbursement) బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఫీజు పోరు చేపట్టాలని పార్టీ నిర్ణయించింది. అయితే అనుకోని కారణాలతో అది జనవరి 29కి వాయిదా పడింది. అయితే ఆ రోజు కూడా అది చేపట్టలేదు. వెంటవెంటనే ఇలా దీక్షలు చేసుకుంటూ పోవడం కరెక్ట్ కాదని పార్టీ నేతలే అభ్యంతరం చెప్పినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఫిబ్రవరి 5న ఫీజు పోరు చేపట్టాలని నిర్ణయించారు.
అయితే జగన్ లండన్ పర్యటనలో (London Tour) ఉండడం, విద్యార్థులకు పరీక్షలు దగ్గర పడుతుండడంతో ఈ దీక్షను సక్సెస్ చేయడం తమ వల్ల కాదని నేతలు చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. అయితే పార్టీ మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ (MLC Elections Code) అడ్డుగా ఉన్నందున ఫీజు పోరును మార్చి 12కు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే నాలుగు సార్లు వాయిదా పడిన ఫీజు పోరు వచ్చే నెలలో కూడా జరిగేది అనుమానంగానే ఉంది. ఎందుకంటే ఇంటర్మీడియేట్ (Intermediate) సహా పబ్లిక్ పరీక్షలన్నీ (Public Exams) మార్చి నెలలోనే ప్రారంభమవుతున్నాయి. కాబట్టి దీనికి విద్యార్థులు హాజరయ్యే పరిస్థితి ఉండదు. ఇలాంటి సమయంలో విద్యార్థులను భాగస్వామ్యం చేస్తూ దీక్షలు చేపట్టడమనేది తెలివితక్కువ నిర్ణయమని సొంత పార్టీ నేతలో గుసగుసలాడుకుంటున్నారు.
అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విద్యార్థుల బకాయిలు చెల్లించకుండా ఇప్పుడు వాళ్లకు మద్దతుగా ఫీజు పోరు పేరుతో హడావుడి చేసేందుకు ప్రయత్నిస్తోందని కూటమి నేతలు ఎద్దేవా చేస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే జగన్ బకాయి పెట్టిన రూ.800 కోట్లను చెల్లించామని గుర్తు చేస్తున్నారు. రైతు దీక్ష, విద్యుత్ దీక్షల పేరుతో హడావుడి చేసినా ప్రయోజనం లేకుండా పోవడంతో ఇప్పుడు విద్యార్థులను వాడుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని కూటమి నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఆ దీక్ష కూడా సక్సెస్ కాదని.. జగన్ నిజస్వరూపమేంటో విద్యార్థులకు అర్థమైందని చెప్తున్నారు. మొత్తానికి ఫీజు పోరు దీక్ష వైసీపీ ప్లానింగ్ లోపాన్ని తెలియజేస్తోంది.













