విశ్వాసంపై వైసీపీ.. పథకాలపై టీడీపీ..! మేనిఫెస్టోల్లో ఎవరిది పైచేయి..?
ఎన్నికలు వచ్చిన ప్రతిసారి పార్టీలు మేనిఫెస్టోలను విడుదల చేయడం ఆనవాయితీ. తమకు అధికారం కట్టబెడితే తాము ఏం చేస్తామనేది మేనిఫెస్టోల్లో చెప్తారు. వాటిలో ఏది జనాలను ఆకట్టుకుంటే వాళ్లకు పట్టంకడుతుంటారు. అందుకే తమ మేనిఫెస్టోలో ఆకర్షణీయ పథకాలు ఉండేలా పార్టీలు జాగ్రత్త పడుతుంటాయి. ఇప్పుడు కూడా పార్టీలు ప్రజాకర్షక పథకాలకు పెద్దపీట వేస్తూ మేనిఫెస్టోలను విడుదల చేశాయి. అయితే పథకాల విషయంలో కూటమి కంటే వైసీపీ బాగా వెనుకబడిందనే టాక్ సర్వత్రా వినిపిస్తోంది.
వైసీపీ ఇప్పటికే ఐదేళ్లుగా అధికారంలో ఉంది. మరో ఐదేళ్లపాటు అధికారం ఇవ్వాలని ఆ పార్టీ అధినేత జగన్ కోరుతున్నారు. 2019లో నవరత్నాలు పేరిట మేనిఫెస్టో విడుదల చేశారు జగన్. ఆ మేనిఫెస్టోలో 99శాతానికి పైగా హామీలను అమలు చేసినట్లు చెప్తున్నారు. మద్యనిషేధం, సీపీఎస్ రద్దు, ప్రత్యేక హోదా, జాబ్ క్యాలెండర్ లాంటి వాటిని అమలు చేయలేకపోయామని వివరించారు. ఈసారి కూడా ఆ నవరత్నాలకు కొనసాగింపుగానే మేనిఫెస్టో విడుదల చేశారు. కొత్త పథకాల జోలికి పోలేదు. పెన్షన్ లాంటివాటిని కూడా పెద్దగా పెంచబోవట్లేదని తేల్చేశారు. అయితే అమలు చేయని పథకాలు ప్రకటించడం కంటే చెప్పినవి కచ్చితంగా చేస్తే చాలని జగన్ చెప్తున్నారు. జనాలను మభ్యపెట్టే పథకాలు తాను చేయనని.. చేసేదే చెప్తానని వెల్లడించారు. గతంలో తమ విశ్వసనీయతను నమ్మి పట్టం కట్టారని.. ఈసారి కూడా అదే రిపీట్ అవుతుందని జగన్ చెప్తున్నారు.
అయితే టీడీపీ, జనసేన మేనిఫెస్టో మాత్రం పూర్తి ప్రజాకర్షకంగా కనిపిస్తోంది. సూపర్ సిక్స్ పేరుతో ఎంతోకాలంగా టీడీపీ ప్రచారం చేస్తోంది. పింఛన్ల పెంపు, మహిళలకు ఉచిత బస్సు రవాణా, నిరుద్యోగ భృతి, 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, జాబ్ క్యాలెండర్.. లాంటి అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచారు. జనసేన షణ్ముఖవ్యూహం మేరకు వివిధ చేతివృత్తుల వారికి భారీగా తాయిలాలు ప్రకటించారు. కూటమి ఈసారి తమ మేనిఫెస్టోను కాపీ కొట్టిందని వైసీపీ ఆరోపిస్తోంది. అయితే కూటమి మాత్రం వైసీపీ ఆరోపణలను తిప్పికొడుతోంది. అప్పులు తెచ్చి నేరుగా అకౌంట్లలో డబ్బులిచ్చామని చెప్పుకుంటోందని.. తాము అలా కాకుండా సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్తోంది.
ఇప్పుడు జనం ఎవరి మేనిఫెస్టోలను నమ్ముతున్నారనే చర్చ ఏపీలో జోరుగా సాగుతోంది. వైసీపీ కొన్ని ప్రజాకర్షక పథకాలు ప్రకటించి ఉంటే బాగుండేదనే టాక్ వినిపిస్తోంది. కూటమి హామీలిచ్చినా అమలు చేయదని వైసీపీ ఆరోపిస్తోంది. అయితే ఈసారి కూటమి అధికారంలోకి వస్తే పథకాలను అమలు చేసి తీర్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాము మేనిఫెస్టోను 99శాతం అమలు చేసినట్లు వైసీపీ చెప్తోంది.. టీడీపీ అలా చేయగలదా అని ప్రశ్నిస్తోంది. టీడీపీ విశ్వసనీయతను వైసీపీ ప్రశ్నిస్తోంది. దీంతో టీడీపీకి మేనిఫెస్టోను అమలు చేయక తప్పని పరిస్థితి. కాబట్టి ఈసారి కూటమి వస్తే పథకాలు అమలు చేసే అవకాశమే ఎక్కువగా ఉందనే చర్చ నడుస్తోంది. వైసీపీ నేతలు కూడా మేనిఫెస్టోపై పెదవి విరుస్తున్నారు. ఒకవేళ పథకాలకు ఆకర్షితులైతే కూటమికే ఈసారి జనం పట్టకట్టడం ఖాయమని చర్చ జరుగుతోంది. విశ్వసనీయత కంటే తమకు ఎంత లబ్ది కలుగుతోందనే దానిపైనే జనం ఎక్కువగా ఆలోచిస్తారని.. ఆ విషయంలో కూటమి మార్కులు కొట్టేసిందని చెప్పుకుంటున్నారు. మరి చూడాలి ఎవరి మేనిఫెస్టో మెప్పిస్తుందో..!













