హీటెక్కిన ఏపీ.. పార్టీల మధ్య మాటల తూటాలు..!
ఆంధ్రప్రదేశ్ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఎన్నికలు సమీపిస్తుండడంతో పార్టీలన్నీ యాక్టివ్ అవుతున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య రోజూ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఆ రెండు పార్టీల మధ్య నిత్య సమరం జరుగుతోంది. ఇప్పుడు ఆ గోదాలోకి బీజేపీ కూడా దూకింది. అధికార పార్టీ టార్గెట్ గా హైకమాండ్ నేరుగా రంగంలోకి దిగి చీల్చి చెండాడుతోంది. ఇక పవన్ కల్యాణ్ కూడా ఎల్లుండి నుంచి రోడ్డెక్కుతున్నారు. దీంతో ఏపీ పాలిటిక్స్ హాట్ హాట్ గా మారబోతున్నాయి.
అసలే ఎండలు మండిపోతున్నాయి. దీనికి తోడు ఇప్పుడు ఏపీ రాజకీయాలు కూడా మంట పుట్టిస్తున్నాయి. అధికారంలో ఉన్న వైసీపీ తాము చేసిన పనిని చెప్పుకునే పనిలో బిజీగా ఉంది. టీడీపీ, జనసేనతో పాటు ఓ వర్గం మీడియా వైసీపీకి నిద్రపట్టనివ్వడం లేదు. వైసీపీ వైఫల్యాలను ఎత్తిచూపడంలో పార్టీలతో పాటు ఓ వర్గం మీడియా కూడా ప్రధాన పాత్ర పోషిస్తోంది. దీంతో వీటికి కౌంటర్స్ ఇచ్చేందుకే వైసీపీ ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోంది. మీడియాలో వచ్చిన కథనాలకు ఫ్యాక్ట్ చెక్ పేరుతో వివరణ ఇచ్చుకునేందుకు తాపత్రయపడుతోంది. అలాగే మీడియా కథనాలను ఆధారంగా చేసుకుని టీడీపీ, జనసేన .. అధికార పార్టీని చీల్చిచెండాడుతున్నాయి. దీంతో ఇన్నాళ్లూ ఎంతో దీమాగా ఉన్న వైసీపీలో ఇప్పుడు కాస్త కలవరపాటు కనిపిస్తోంది.
ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఎన్నికల రేసులో ముందున్నట్టు కనిపిస్తోంది. రాజమండ్రి వేదికగా జరిగిన మహానాడులోనే ఆ పార్టీ పాక్షిక మేనిఫెస్టో ప్రకటించింది. రండి చూసుకుందాం.. అని అధికార పార్టీకి సవాల్ విసిరింది. అధికార పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేశ్ పోటీ పడుతున్నారు. వీళ్లిద్దరూ ఇప్పటికే జనంలో ఉన్నారు. ఇక సోషల్ మీడియా ద్వారా ఏపీ పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రభుత్వం నుంచి నియంత్రణ ఎదురవుతున్నా తగ్గేదే లేదంటూ టీడీపీ శ్రేణులు కదం తొక్కుతున్నాయి.
ఇన్నాళ్లూ అధికారంలో ఉన్న వైసీపీకి బీజేపీ పూర్తి అండదండలు అందిస్తూ వచ్చింది. వైసీపీని పల్లెత్తుమాట అనలేదు. పైగా వైసీపీ అడిగినవన్నీ చేస్తూ వచ్చింది. అయితే ఏమైందో ఏమో ఆ రెండు పార్టీల మధ్య విభేదాలు కనిపిస్తున్నాయి. రెండ్రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో పర్యటించిన బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా.. వైసీపీపై విమర్శల వర్షం కురిపించారు. జగన్ సర్కార్ అవినీతిలో కూరుకుపోయిందిని, ఇక్కడ చట్టం అమలు కావట్లేదని తీవ్రంగా దుయ్యబట్టారు. బీజేపీ అగ్రనేతలే ఈ విమర్శలు చేసేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. రాష్ట్రనేతలు కూడా ఎప్పుడూ వైసీపీపై విమర్శలు చేయడానికి సాహసించలేదు. కానీ జాతీయ నేతలు మాత్రం జగన్ కు షాక్ ఇచ్చారు. ఇప్పుడు బీజేపీకి కౌంటర్ ఇవ్వాలా వద్దే అనే ఆలోచనలో పడిపోయారు వైసీపీ నేతలు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎల్లుండి నుంచి వారాహి యాత్ర ప్రారంభించబోతున్నారు. ఇన్నాళ్లూ సినిమా షూటింగులతో బిజీగా ఉన్న పవన్.. ఇప్పుడు వాటన్నిటినీ ముగించుకుని పూర్తిస్థాయి రాజకీయానికి సిద్ధమయ్యారు. అన్నవరం నుంచి భీమవరం వరకూ 11 నియోజకవర్గాల్లో యాత్రకు రూట్ మ్యాప్ రెడీ చేశారు. వైసీపీని గద్దె దించడమే తన ఏకైక లక్ష్యమని ఇప్పటికే పవన్ కల్యాణ్ ప్రకటించారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎన్నికలకు ఏడాది ముందే పీక్ స్టేజ్ కు వెళ్లాయని చెప్పొచ్చు.













