Vijay Sai Reddy: విజయ్ సాయి రెడ్డి ప్లేసులో పేర్ని నాని.. వైసీపీ సూపర్ స్కెచ్..
వైఎస్ జగన్ (Jagan) 2024 ఓటమి తర్వాత పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుకుంటూ, భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఇటీవల విజయవాడ నగర కార్పోరేటర్లతో (Vijayawada corporate) సమావేశమైన ఆయన, ఎన్ని కూటములు వచ్చినా ప్రజల మద్దతు తమకే ఉందని ధీమా వ్యక్తం చేశారు. 2019లో 151 స్థానాలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ, 2024 ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకు పరిమితమై ప్రతిపక్ష హోదా సైతం దక్కించుకోలేకపోయింది. అయితే 40 శాతం ఓటింగ్ తమకు వచ్చినందున ప్రజల్లో ఇంకా బలమైన మద్దతు ఉందని జగన్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో వైసీపీ ఉత్తరాంధ్రలో ప్రక్షాళన ప్రక్రియ ప్రారంభించింది. ఇప్పటికే వివిధ జిల్లాల్లో ఇన్‌ఛార్జిలను నియమించగా, రీజనల్ కో-ఆర్డినేటర్ల నియామకంపైనా దృష్టి పెట్టింది. గతంలో ఈ బాధ్యతలను ఎంపీ విజయసాయి రెడ్డి (Vijay Sai Reddy) చేపట్టారు. కానీ ఇటీవల ఆయన వైసీపీకి (YCP) రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించారు. దీంతో ఈ స్థానాన్ని ఎవరికి అప్పగించాలనే అంశంపై పార్టీలో చర్చ నడుస్తోంది.
ఈ క్రమంలో మాజీ మంత్రి, మచిలీపట్నం నేత పేర్ని నానీ (Perni Nani) పేరు ప్రస్తావనకు వచ్చింది. గతంలో ఫైర్ బ్రాండ్ లీడర్‌గా పేరుగాంచిన ఆయన, ఇటీవల పార్టీ ఓటమి తర్వాత సైలెంట్ అయ్యారు. అంతేకాదు, రేషన్ రైస్ స్కామ్‌లో ఆయనపై కేసులు నమోదుకావడంతో సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే వైసీపీ నేతలు ఆయనను మళ్లీ లైన్లోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన పేర్ని నానీని రీజనల్ కో-ఆర్డినేటర్‌గా చేస్తే, ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతం అవుతుందని భావిస్తున్నారు. విజయసాయి రెడ్డి స్థానాన్ని భర్తీ చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో, స్థానికంగా ప్రభావం చూపగల నాయకుడిని ఎంపిక చేయాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. దీనికి బొత్స సత్యనారాయణ కూడా అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది.
2016 నుంచి 2022 వరకు విజయసాయి రెడ్డి ఈ బాధ్యతలు చేపట్టగా, 2024లో వైవీ సుబ్బారెడ్డికి అవకాశం ఇచ్చారు. అయితే మరోసారి విజయసాయిరెడ్డికే అప్పగించగా, ఆయన పదవి నుంచి వైదొలిగారు. ఈసారి అదే పదవిని వేరే సామాజిక వర్గానికి కాకుండా, స్థానికంగా ఉన్న వ్యక్తికి అప్పగించాలనే ఉద్దేశంతో పేర్ని నానీ ఎంపికపై చర్చ నడుస్తోంది. ఈ నెల 12న వైసీపీ ఉత్తరాంధ్ర నేతలతో ముఖ్య సమావేశం నిర్వహించనుంది. అందులోనే పేర్ని నానీ నియామకంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరి ఈ ప్రచారంలో ఎంత వరకు నిజముందో వేచి చూడాలి.













