Singanamala: సింగనమల వైసీపీలో సిగపట్లు…!?

అనంతపురం జిల్లాలోని సింగనమల నియోజకవర్గం (Singanamala Assembly) వైసీపీలో (YCP) అంతర్గత విభేదాలు రాజకీయ చర్చకు దారితీస్తున్నాయి. ఆరు నెలల క్రితం కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరిన మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌కు (Sailajanath) నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడంతో పార్టీలో కొత్త సమస్య తలెత్తింది. ఈ నేపథ్యంలో, నిన్న బుక్కరాయసముద్రంలో వైసీపీ నియోజకవర్గ కార్యాలయం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy), ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో పాటు జిల్లా ముఖ్య నేతలు హాజరయ్యారు. అయితే, గత ఎన్నికల వరకు నియోజకవర్గంలో క్రియాశీలకంగా వ్యవహరించిన మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి (Jonnalagadda Padmavathi) , ఆమె భర్త సాంబశివారెడ్డి (Sambasiva Reddy), మాజీ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు ఈ కార్యక్రమానికి గైర్హాజరు కావడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
2014లో కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరిన జొన్నలగడ్డ పద్మావతి, నియోజకవర్గ సమన్వయకర్తగా కీలక పాత్ర పోషించారు. ఆమె భర్త సాంబశివారెడ్డి, పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీలో కొనసాగుతూ, ప్రభుత్వ విద్యాశాఖ మాజీ సలహాదారుగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆయన పార్టీ ఎన్నారై వింగ్ అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే, గత ఎన్నికల్లో పద్మావతికి టికెట్ నిరాకరించి ఎం. వీరాంజనేయులుకు అవకాశం ఇవ్వడం వివాదాస్పదమైంది. వీరాంజనేయులు టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణిపై 10 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ నేపథ్యంలో, పార్టీ అధిష్టానం శైలజానాథ్‌ను నియోజకవర్గ బాధ్యుడిగా నియమించడం జొన్నలగడ్డ దంపతులను అసంతృప్తికి గురిచేసింది.
శైలజానాథ్ ఆరు నెలల క్రితం వైసీపీలో చేరినప్పటి నుంచి నియోజకవర్గంలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. పార్టీ సమన్వయకర్త బాధ్యతలను పార్టీ హైకమాండ్ ఆయనకు కట్టబెట్టింది. ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల సమయం ఉన్నప్పటికీ, ఆయన హడావుడిగా కార్యక్రమాలు చేపడుతున్నారు. మిగిలిన జిల్లాల్లో కనీసం వైసీపీ నేతలు బయటకు రావడానికి కూడా భయపుడుతున్నారు. అలాంటిది శైలజానాథ్ మాత్రం ఏకంగా పార్టీ కార్యాలయాన్నే ప్రారంభించారు. దీంతో వైసీపీ హైకమాండ్ ఆయనకు అత్యంత ప్రయారిటీ ఇస్తోంది. అయితే, దీన్ని సాంబశివారెడ్డి దంపతులు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న సాంబశివారెడ్డి, తమకు రాజకీయ ప్రాధాన్యత తగ్గిపోతుందనే భావనతో కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
సింగనమలలో శైలజానాథ్ హడావుడిని పార్టీలో ముందు నుంచి ఉన్న స్థానిక నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. జొన్నలగడ్డ దంపతులు, వీరాంజనేయులు కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరు కాకపోవడం, వారి అసంతృప్తిని స్పష్టం చేస్తోంది. సజ్జల రామకృష్ణారెడ్డి, మిథున్ రెడ్డి లాంటి కీలక నేతలు వచ్చినా కూడా జొన్నలగడ్డ దంపతులు, వీరాంజనేయులు పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవానికి రాకపోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వాళ్లు పార్టీలో ఉంటారా ఉండరా అనే దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ అంతర్గత కలహాలు పార్టీపై ప్రభావం చూపే అవకాశం ఉంది. పార్టీ అధిష్టానం ఈ సిగపట్లను ఎలా సమన్వయం చేస్తుంది, జొన్నలగడ్డ దంపతులు భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.