YCP: శ్రీకాకుళంలో వైసీపీకి షాక్ ఖాయమా..? రాజకీయ సన్యాసానికి ఇద్దరు నేతలు సిద్ధం..!?
ఏ రాజకీయ పార్టీకి అయినా కాలమంతా ఒకేలా ఉండదు. ఆటుపోట్లు ఎదురవుతుంటాయి. గెలిచినప్పుడు అందరూ అక్కున చేర్చుకుంటారు. ఓడితే గుమ్మం దాటేందుకు కూడా సాహసించరు. ఇప్పుడు వైసీపీ (YSRCP) పరిస్థితి ఇలాగే ఉంది. అధికారంలో ఉన్నప్పుడు అన్నీ తామై వ్యవహరించిన నేతలు కూడా ఇప్పుడు పార్టీ మొహం చూసేందుకు సిద్ధంగా కనిపించట్లేదు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో (Srikakulam District) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) పరిస్థితి దయనీయంగా మారింది. ఇద్దరు కీలక నేతలు వైసీపీకి (YCP) వీడడంతో పాటు పూర్తిగా రాజకీయాలకే గుడ్ బై చెప్పాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాకు చెందిన తమ్మినేని సీతారాంకు (Tammineni Sitaram) అసెంబ్లీ స్పీకర్ (Assembly Speaker) పదవి కట్టబెట్టారు జగన్. ఆ ఐదేళ్లూ ఆయన స్పీకర్ ననే విషయం మర్చిపోయి విపక్షాలపై విమర్శలు చేసిన సందర్భాలున్నాయి. గతంలో టీడీపీలో (TDP) సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం ఉంది. చంద్రబాబు కేబినెట్లో కూడా మంత్రిగా పనిచేశారు. అయినా అలాంటి కృతజ్ఞత ఏదీ చూపకుండా పూర్తిగా జగన్ (YS Jagan) భజనలో మునిగిపోయారు. అయితే ఇప్పుడు పార్టీ ఓడిపోయింది. సీతారాం కూడా దారుణంగా ఓడిపోయారు. పక్కచూపులు చూస్తున్నారు కానీ ఏ పార్టీ కూడా ఈయన్ను చేర్చుకునేందుకు సిద్ధంగా లేదు.
ఇక మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు (Dharmana Prasada Rao) పరిస్థితి కూడా దయనీయంగా మారింది. వైసీపీలో ఎమ్మెల్యేగా, ఆ తర్వాత మంత్రిగా ఆయన పనిచేశారు. అయితే ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పైగా ఏదైనా అధికార కూటమిలో చేరేందుకు అవకాశం వస్తే జంప్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఈయన్ను చేర్చుకునేందు ఏ పార్టీ కూడా సుముఖంగా లేదు. ఇలాంటి గోడమీద పిల్లులను నమ్మలేమనేది కూటమి పార్టీల ఆలోచన. దీంతో ధర్మానకు దిక్కుతోచట్లేదు.
శ్రీకాకుళం పార్లమెంటు ఇన్ చార్జ్ గా ధర్మాన ప్రసాదరావును నియమించేందుకు జగన్ సిద్ధమయ్యారు. అయితే దాన్ని చేపట్టేందుకు ధర్మాన అంగీకరించలేదు. దీంతో తమ్మినేని సీతారాంకు శ్రీకాకుళం పార్లమెంటు బాధ్యతలు అప్పగించారు జగన్. అయితే ఈయన కూడా కామ్ గా ఉంటున్నారు. విజయసాయి రెడ్డి (Vijaya Sai Reddy) స్థానంలో కొత్తగా ఇన్ ఛార్జ్ బాధ్యతలు చేపట్టిన కురసాల కన్నబాబు (Kurasala Kannababu) ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. పార్టీ సమావేశం పెట్టారు. అయితే ఈ ఇద్దరు నేతలు ఆ సమావేశానికి డుమ్మా కొట్టారు. దీంతో వీళ్ల సేవలు ఇక పార్టీకి లేనట్టే అని జిల్లాలో కేడర్ చెప్పుకుంటోంది. ఏదైనా అవకాశం వస్తే ఇతర పార్టీల్లో చేరడం, లేకుంటే రాజకీయాలకే దూరమవడం ఖాయమని భావిస్తోంది.













