Perni Nani: బియ్యం అక్రమ కేసులో ఒంటరైన నాని.. పట్టించుకోని వైసీపీ..
మచిలీపట్నంలో బియ్యం అక్రమ తరలింపు కేసు (Ration Rice case) నేపథ్యంలో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani ) తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు పార్టీ కోసం గట్టిగా గళం వినిపించిన నానికి ఇప్పుడు అదే పార్టీ నుంచి తగిన మద్దతు లభించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా, బియ్యం కేసు వ్యవహారం పేర్ని నానిపై భారీ ప్రభావాన్ని చూపింది.
పేర్ని భార్య పేరిట ఉన్న గిడ్డంగిలో 7,556 బియ్యం బస్తాలు మాయం కావడం, దానిపై రూ.1.70 కోట్ల జరిమానా చెల్లించడంతో నేరం అంగీకరించినట్లుగా ప్రజల్లో భావన ఏర్పడింది. దీంతో ఆయనకు పార్టీ నేతల నుంచి మద్దతు నిలువలేదు. ఒకవైపు నిందితుడిగా కేసులో చేర్చిన ప్రభుత్వం మరొకవైపు ఆయన తప్పుచేసినట్లు ప్రజల్లోకి సంకేతాలు పంపింది. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయ ప్రత్యర్థి మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మలచుకోవడంలో సక్సెస్ అయినట్లు కనిపిస్తోంది.
అధికారంలో ఉండగా తన దూకుడుతో పేరు తెచ్చుకున్న పేర్ని, ఇలాంటి పరిస్థితిని ఊహించలేకపోయారు. బియ్యం కేసు వెలుగు చూడటానికి ముందు, డిప్యూటీ సీఎం పవన్ పర్యటనపై విమర్శలు చేసిన ఆయన, ఈ వ్యవహారం బయటపడిన తర్వాత షాక్కు గురయ్యారు. ఈ ఘటనతో పాటు మైనింగ్, పోర్టు భూముల ఆక్రమణ ఆరోపణలు పేర్ని నానిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో, పార్టీ నుంచి తనకు ఎలాంటి మద్దతు లభించకపోవడం వల్లే మీడియా ద్వారా ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకోవాలని ఆయన ప్రయత్నించాల్సి వచ్చింది. తన భార్యను జైలుకు పంపించవద్దని చంద్రబాబును బహిరంగంగా వేడుకోవాల్సి రావడం, ఆయన వ్యక్తిగతంగా ఎంత ఒత్తిడిలో ఉన్నారో తెలియజేస్తుంది. తాను రాజకీయంగా ఒంటరిగా మారిపోయాననే భావన ఆయనలో బలపడినట్లు కనిపిస్తోంది.
పేర్ని నాని పరిస్థితి ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పలు ప్రశ్నలు రేకెత్తిస్తోంది. ఒకప్పుడు వైసీపీ కోసం నిరంతరం పోరాడిన నేతకు ఇప్పుడు పార్టీ ఎందుకు అండగా నిలవలేకపోయింది? నేరారోపణలు నిజమో కాదో కోర్టు తేల్చుతుంది, కానీ పార్టీ నేతల మౌనం, ముఖ్యమంత్రి వైఖరి ఈ పరిణామాలకు ప్రధాన కారణాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ప్రస్తుతం కొన్ని వర్గాలలో వైసీపీ వైఖరిపై కాస్త నిరసన కనిపిస్తోంది.













