టీటీడీపై జీఎస్టీ.. కేంద్రంపై రాష్ట్రం పోరుబాట!
హిందూ ధర్మ పరిరక్షణ, ఆలయాల అభివృద్ధి బీజేపీ నినాదాలు. దేశంలో ఆలయాలకు సంబంధించి ఏం జరిగినా బీజేపీ ముందుంటుంది. వాటి కోసం పోరాడుతుంటుంది. అయితే రాష్ట్రాల పరిధిలోని ఆలయాల అభివృద్ధికి బీజేపీ సహకరించట్లేదనే వాదన ఉంది. ఆలయాల పరిరక్షణ, అభివృద్ధిపై నిత్యం మాట్లాడే బీజేపీ.. రాష్ట్రాల విషయంలో న్యాయం చేయట్లేదంతూ పలు రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా ఇదే అంశంపై కేంద్రంతో పోరాడుతోంది. ఏకంగా చట్టసభల్లోనే నిలదీస్తోంది. ఇందుకు టీటీడీ ఓ ఆయుధంగా మారింది.
ప్రపంచంలోనే అత్యంత ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల. నిత్యం వేలాది మంది భక్తులు తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకుంటూ ఉంటారు. తిరుమలలో ఒక రోజైనా బస చేస్తే తమ కోరిక నెరవేరుతుందని భావిస్తుంటారు. భక్తుల సౌకర్యార్తం టీటీడీ కాటేజీలు నిర్మించింది. వాటిలో భక్తులు బస చేస్తుంటారు. అయితే జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఈ గదులపైన కూడా జీఎస్టీ విధిస్తున్నారు. ఏటా సుమారు 120 కోట్ల రూపాయల జీఎస్టీ చెల్లిస్తోంది టీటీడీ. ఇదంతా భక్తుల నుంచి వసూలు చేస్తున్నదే. భక్తులు గదులు తీసుకున్నప్పుడు వాటిపై విధిస్తున్నదే.
టీటీడీ ధార్మిక సంస్థ. ఆలయాల అభివృద్ధి, భక్తుల సౌకర్యాలకోసం పని చేస్తూ ఉంటుంది. అలాంటి టీటీడీ పైన కూడా జీఎస్టీ విధించడాన్ని అధికార వైసీపీ తప్పుబడుతోంది. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇదే అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తారు. హిందుత్వకు తామే ప్రతినిధులం అని చెప్పుకునే బీజేపీ ప్రభుత్వం.. దేవాలయాలపై పన్నులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. టీటీడీ గదులపైన కూడా కేంద్రం జీఎస్టీ విధిస్తోందని చెప్పారు. టీటీడీ వాణిజ్య సంస్థ కాదని.. అక్కడ లాభార్జనకోసం కార్యక్రమాలు చేయట్లేదని స్పష్టం చేశారు. దేవుడి సేవకు వస్తున్న భక్తులపై పన్నులు మోపడం సరికాదన్నారు. జీఎస్టీకి ముందు టీటీడీపై పన్నుల భారం ఉండేది కాదని.. ఇప్పటికైనా కేంద్రం కళ్లు తెరిచి జీఎస్టీని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
అయితే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విజ్ఞప్తిని కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదు. ఆర్థిక బిల్లుపై చర్చ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్టీపై క్లారిటీ ఇచ్చారు. టీటీడీకి జీఎస్టీని ఉపసంహరించుకునే ఆలోచన తమకు లేదని స్పష్టం చేశారు. టీటీడీపైన మాత్రమే కాకుండా.. అన్ని ఆలయాలపైనా జీఎస్టీ అమలవుతోందని తేల్చిచెప్పారు. అలాంటప్పుడు టీటీడీకి మాత్రం ఉపసంహరించుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. అయితే ఆలయాలపై జీఎస్టీని వసూలు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భక్తులపై నేరుగా ప్రభావం చూపిస్తున్న ఇలాంటి అంశాలపై కేంద్రం సానుకూల వైఖరి అవలంబిస్తే బాగుంటుందనే సూచనలు వస్తున్నాయి.













