ఎంపీ రఘురామ విషయంలో రంగంలోకి వైసీపీ… లోక్‌సభ స్పీకర్ ను కలిసిన వైసీపీ ఎంపీ

రోజూ జగన్ సర్కార్‌పై విమర్శలకు దిగే నరసాపురం ఎంపీ రఘురామ రాజు విషయంలో చర్యలు తీసుకునేందుకు వైసీపీ రంగంలోకి దిగింది. ఇన్ని రోజుల పాటు వేచిచూసే ధోరణిని అవలంబించిన వైసీపీ తాజాగా కఠిన నిర్ణయాల వైపు అడుగులు వేసింది. ఎంపీ రఘురామ రాజుపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు వైసీపీ ఫిర్యాదు చేసింది. ఆయనపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎంపీ భరత్ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. వైసీపీ టిక్కెట్ నుంచి నర్సాపురం ఎంపీగా ఎన్నికై, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, అందుకే ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలని ఎంపీ భరత్ కోరారు. రఘురామ కృష్ణరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ చేసిన వ్యాఖ్యలపై తగిన ఆధారాలను తాము గతంలోనే స్పీకర్‌కు అందించామని, అనేక సార్లు అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి కూడా చేశామని తెలిపారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అతిక్రమించిన రఘురామ కృష్ణరాజును వెంటనే అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎంపీ భరత్ స్పీకర్ ఓంబిర్లాను కోరారు.