YCP: త్వరలో వైసీపీకి మరో భారీ షాక్..!!?
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా కూడా శాసన మండలిలో (Legislative Council) మాత్రం వైసీపీ (YSRCP) ఇప్పటికే పట్టు నిలుపుకుంటోంది. అందుకే అసెంబ్లీకి హాజరు కాకుండా మండలికి మాత్రం వైసీపీ (YCP) హాజరువుతోంది. అక్కడ కూటమి ప్రభుత్వాన్ని (NDA Govt) ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తోంది. అధికార పక్షానికి కౌంటర్స్ ఇస్తూ సత్తా చాటుతోంది. అయితే మండలిలో కూడా తన పట్టు కోల్పోయేకాలం వైసీపీకి ఎంతో దూరంలో లేదని తెలుస్తోంది. వచ్చే నెలలోపు వైసీపీ ఆధిపత్యానికి గండికొట్టి ఛైర్మన్ ను గద్దె దించేందుకు కూటమి తెరవెనుక గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్టు సమాచారం. అదే జరిగితే శాసన మండలిలో కూడా వైసీపీ ఒంటరి కావడం ఖాయం.
శాసన మండలిలో మొత్తం 58 స్థానాలున్నాయి. ఇందులో వైసీపీకి 35 మంది సభ్యులున్నారు. టీడీపీకి (TDP) 10, జనసేనకు (Janasena) 2, బీజేపీకి (BJP) 1 సీటు ఉన్నాయి. కూటమికి మొత్తంగా 13 సీట్లున్నాయి. ఇక స్వతంత్రులు ఐదుగురున్నారు. ఐదు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అయితే వీటిని ఇంకా మండలి ఛైర్మన్ మోషేన్ రాజు (Moshen Raju) ఆమోదించాల్సి ఉంది. వీటిని ఆమోదించకుండా ఛైర్మన్ తన దగ్గరే పెట్టుకున్నారు. మండలిని వీలైనంత త్వరగా చేజిక్కించుకోవాలని టీడీపీ (TDP) ప్రయత్నిస్తోంది. కానీ మండలి ఛైర్మన్ వ్యూహంతో టీడీపీ ప్లాన్స్ బెడిసి కొడుతున్నాయి.
అందుకే టీడీపీ మరో పెద్ద స్కెచ్ వేసింది. ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసిన ఐదుగురు కూటమిలో చేరడం ఖాయం. కూటమిలో చేరేందుకే వాళ్లంతా రాజీనామా చేశారనేది అందరికీ తెలిసిన విషయమే. వీళ్లతో పాటు మరో ఎనిమిది మందిని వైసీపీ నుంచి లాగేసేందుకు కూటమి సిద్ధమైనట్టు సమాచారం. వైసీపీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్సీలు కూడా ఇందుకు సుముఖత వ్యక్తం చేశారని టాక్. మర్రి రాజశేఖర్ (Marri Rajasekhar) రాజీనామాతో వీళ్లంతా కూడా రాజీనామా చేసే బయటకు వచ్చేందుకు సిద్ధమయ్యారని.. ఈ నెలాఖరు లోపే వీళ్లంతా మూకుమ్మడిగా జగన్ (YS Jagan)కు షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం.
రాజీనామా చేయకపోయినా వైసీపీ ఎమ్మెల్సీ, డిప్యూటీ ఛైర్ పర్సన్ జకియా ఖనమ్ ఇప్పటికే టీడీపీకి అనుకూలంగా ఉంటున్నారు. ఇలాంటి వాళ్లు మరో ఏడుగురు ఉన్నారని సమాచారం. ఒకవేళ వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామాలను మండలి ఛైర్మన్ మోషేన్ రాజు ఆమోదించకపోతే వైసీపీకి చెందిన మరో 8 మందితో రాజీనామాలు చేయించాలనే ఆలోచనలో కూటమి ఉన్నట్టు సమాచారం. అప్పటికీ వాటిని ఆమోదించకపోతే మోషేన్ రాజుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి గద్దె దించాలనే యోచిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి వచ్చే నెలలో మండలి కూటమివశం కావడం ఖాయంగా కనిపిస్తోంది.













