తాడేపల్లి ప్యాలెస్ లో బటన్ నొక్కితే సరిపోతుందా.. పీకే సంచలన వ్యాఖ్యలు..
2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సిపి గెలుపు వెనక కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. అయితే ప్రస్తుతం అతను జరగబోయే ఎన్నికల విషయంలో జగన్ పార్టీ ఘోర ఓటమిని చవిచూస్తుంది అంటూ చెప్పిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. హైదరాబాదులో ఓ పత్రిక కాంక్లేవ్ లో ఏపీ రాజకీయాల గురించి స్పందించిన ప్రశాంత్ కిషోర్.. జగన్ ఐదేళ్ల పాలన గురించి వ్యాఖ్యానించారు. ప్రజల సొమ్మును ఖర్చు చేయడం తప్పని.. ప్రజల బాగోగులు చూస్తామని చెప్పి నమ్మించి మోసం చేశారని.. కేవలం జగన్ ఇలా చేయడం వల్లే రాబోయే ఎన్నికల్లో తీవ్ర నష్టాన్ని చవిచూడబోతున్నాడని ప్రశాంత్ కిషోర్ అన్నారు.
దీనికి ఉదాహరణగా రీసెంట్ గా జరిగిన తెలంగాణ ఎన్నికల గురించి ప్రస్తావించారు. కెసిఆర్ కి కూడా తెలంగాణలో ఇదే రకమైన పరిస్థితి ఎదురైందని రేపు జరగబోయే ఎన్నికల్లో జగన్ కూడా ఇలాంటి సిచువేషన్ ఎదుర్కొంటారు అంటూ వ్యాఖ్యానించారు. విద్యా, ఉపాధి, అభివృద్ధి గారు ఎన్నికల విషయంలో ఎంతో కీలకమైన ప్రభావాన్ని చూపిస్తాయని ప్రశాంత్ పేర్కొన్నారు. కేవలం తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని బటన్లు నొక్కడం వల్ల పాలన చేసినట్లు కాదని.. ప్రజల మధ్యలోకి రాకపోవడం జగన్ పాలనలో పెద్ద మచ్చగా మిగిలిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు.
జగన్ గురించి ఒక మాట ఎవరన్నా అంటే అతని మంత్రులు ఊరుకునే పరిస్థితి ఉండదు కదా. పీకే వ్యాఖ్యలపై ఏపీ మంత్రి అమరనాథ్ రెడ్డి.. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీహార్లో సొంతంగా పార్టీ పెట్టి నడపడం చేతకాక చేతులెత్తేసిన ప్రశాంత్ కిషోర్.. ఇప్పుడు ఇలా ఏపీ రాజకీయాల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది అన్నారు. చంద్రబాబుకి ఒక పీకే.. అదేనండి పవన్ కళ్యాణ్ సరిపోవడంలేదని అందుకే మరొక పీకే.. అంటే ప్రశాంత్ కిషోర్ ని పిలిపించుకున్నారని ఎద్దేవా చేశారు. దీనితోపాటుగా వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమని భీమాను కూడా వ్యక్తం చేశారు మన కోడిగుడ్డు మంత్రి.
ఇటు ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు కూడా తీవ్రంగా స్పందించారు. అప్పుడు ఇదే రకంగా జోస్యాలు చెప్పిన లగడపాటి రాజకీయ సన్యాసం తీసుకున్నాడని.. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కూడా అదే బాటలో నడుస్తున్నాడని అతను తన ట్వీట్ ద్వారా పేర్కొన్నారు. కేవలం టిడిపి చేస్తున్న కుట్రలో భాగంగా ఇలా వైసిపి పై నెగిటివ్ ప్రచారం జరుగుతోంది అంటూ అంబటి ఫైర్ అయ్యారు. ఇటీవల ప్రశాంత్ కిషోర్ టిడిపి అధినేత చంద్రబాబును కలవడం జరిగింది. దీంతో ఇప్పుడు పీకే మాట్లాడుతున్న మాటలు ఎన్నికల వ్యూహంగా పరిగణలోకి తీసుకుంటున్నారు వైకాపా మంత్రులు.













