YCP Leaders: తమ్మినేని, ధర్మాన పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారా..!!?
ఓటమి నుంచి కోలుకోకముందే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి (YSRCP) ఆటుపోట్లు ఎదురవుతున్నాయి. పలువురు నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఇంకొందరు పదవులను కూడా వదులుకుని వెళ్లిపోయారు. రాష్ట్రంలో పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు చేజారిపోతున్నాయి. త్వరలో మండలిలో కూడా ఆధిపత్యానికి గండి పడుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇలా నలువైపుల నుంచి ఆ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇప్పడు మరికొందరు నేతలు కూడా వైసీపీని వీడేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. అందులో ముఖ్యంగా పలువురు ఉత్తరాంధ్ర నేతలు (Uttarandhra) ఉన్నారని తెలుస్తోంది.
వైసీపీలో సీనియర్ నేతలుగా ఉన్న శ్రీకాకుళం జిల్లాకు (Srikakulam District) చెందిన తమ్మినేని సీతారాం (Tammineni Sitaram), ధర్మాన ప్రసాదరావు (Dharmana Prasada Rao) ఆ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. వైసీపీ ఓడిపోయిన తర్వాత వీళ్లిద్దరూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తమ్మినేని సీతారాంను శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ బాధ్యునిగా బాధ్యతలు అప్పగించారు జగన్ (YS Jagan). అయినా ఆయన ఎక్కడా కనిపించట్లేదు. ఉత్తరాంధ్ర సమన్వయకర్త కురసాల కన్నబాబు పెట్టిన సమావేశాలకు కూడా తమ్మినేని సీతారాం హాజరు కాలేదు. దీంతో ఆయన ఇక రాకపోవచ్చని అందరూ అనుకుంటున్నారు.
మరోవైపు ధర్మాన ప్రసాదరావు పరిస్థితి కూడా ఇంతే. ఈయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్ (Dharmana Krishna Das) పార్టీలో యాక్టివ్ గానే ఉన్నారు. కానీ ప్రసాదరావు మాత్రం పార్టీ తీరుపై అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. పార్టీ కార్యక్రమాల్లో ఈయన అస్సలు పాల్గొనట్లేదు. ఇన్నాళ్లూ దూరంగా ఉన్న ఆయన ఇటీవల జగన్ జిల్లాలో పాలవలసకు వచ్చినప్పుడు ఆయన్ను వెళ్లి కలిసినట్లు సమాచారం. ఈ సందర్భంగా ధర్మానకు జగన్ దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. అయితే జగన్ మాటలు విని ధర్మాన యాక్టివ్ అవుతారా.. లేదా అనే దానిపై క్లారిటీ లేదు.
అయితే ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు బీజేపీతో (BJP) టచ్ లోకి వెళ్లినట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. అటు బీజేపీ కూడా వీళ్లను చేర్చుకునేందుకు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఉత్తరాంధ్రపై బీజేపీ ఇప్పటికే ఫోకస్ పెట్టింది. విశాఖ డెయిరీ ఛైర్మన్ అడారి ఆనంద్ ను చేర్చుకుంది. ఇప్పుడు వీళ్లద్దరితో కూడా పురంధేశ్వరి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. వీళ్ల చేరిక వెనుక విజయసాయి రెడ్డి హస్తం ఉందని టాక్ నడుస్తోంది. అది నిజమైతే త్వరలోనే వీళ్లిద్దరూ కమలం కండువా కప్పుకోవడం ఖాయం. ఒకవేళ వీళ్లిద్దరూ బీజేపీలో చేరితే వైసీపీ ఇద్దరు సీనియర్ నేతలను కోల్పోవాల్సి ఉంటుంది. ఇన్నాళ్లూ జిల్లాలో పెద్ద దిక్కుగా ఉన్న నేతల స్థానంలో వైసీపీ ఎవరిని తెరపైకి తెస్తుందో వేచి చూడాలి.













