పవన్ ట్రాప్ లో వైసీపీ…
జనసేనాని పవన్ కల్యాణ్ స్ట్రాటజీలు రోజురోజుకూ పదును తేరుతున్నాయి. వారాహి-1 యాత్రలో వైసీపీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు వైసీపీ మూలాలను గురిపెట్టారు. ఎన్నికల్లో ఏఅంశాలను ఆయుధాలుగా ప్రయోగించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందో.. వాటిని దెబ్బతీసేందుకు పద్ధతిగా ముందుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఓవైపు వైసీపీ ఎమ్మెల్యేల అవినీతిని ప్రధానాస్త్రంగా సంధిస్తూనే.. వారి ముఖ్య ఆయుధం వాలంటీర్లను పవన్ టార్గెట్ చేశారు. అంతేకాదు మహిళల మానవ అక్రమరవాణకు బాధ్యులంటూ కీలక ప్రకటన చేశారు.
దీంతో చాలా చోట్ల వాలంటీర్లు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. నెలకు 5 వేల రూపాయల అత్తెసరు గౌరవ వేతనం.. ఆందోళనలకు రాకుంటే అది కూడా పోతుందన్న భయం, వైసీపీ నేతలు, అధికారుల హెచ్చరికలు వెరసి.. పవన్ వ్యాఖ్యలపై వాలంటీర్లు విరుచుకుపడ్డారు. పవన్ కు ఏం తెలుసు, వాలంటీర్ల వ్యవస్థ గురించి అంటూ ప్రస్తావించారు. అయితే పవన్ వీటిని పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. తాను అందరి గురించి అనలేదంటూనే.. తన దృష్టికి వచ్చిన కొన్నింటిని ప్రస్తావించానని తేల్చి చెప్పారు. అంతే కాదు.. తనపై ఎన్ని కేసులు పెట్టినా, పట్టించుకోనని , ఇలాంటి వాటికి బెదిరేది లేదంటూ పరోక్షంగా వైసీపీకి వార్నింగ్ ఇచ్చినట్లు కనిపిస్తోంది.
అంతేకాదు… కేంద్ర నిఘా వర్గం ఇచ్చిన స్పష్టమైన సమాచారంతో, రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ కొందరు వలంటీర్లు చేస్తున్న ఘాతుకాన్ని తెలియజేయాలనే చెప్పానన్నారు. ప్రజలను నియంత్రించేందుకు, బెదిరించేందుకే వలంటీర్ వ్యవస్థను జగన్ డిజైన్ చేసి వదిలాడని.. అందుకే అన్ని పార్టీల నాయకులు ఈ వలంటీర్లపై, వాళ్లు సేకరిస్తోన్న వివరాలపై ఒక కన్నేసి ఉంచాలని పిలుపిచ్చారు. ‘నా పార్టీ మహిళనో, మాజీ సీఎం చంద్రబాబు సతీమణినో తిడితే ఆ ఒక్కరే కాదు.. అందరూ స్పందించాలి. అప్పుడే ఆ తప్పు జగన్కు తెలుస్తుంది. మహిళల పట్ల ఎలా ప్రవర్తించాలో, దేశ సంస్కృతి అంటే ఏమిటో ఎన్నికలకు ముందే జగన్ కు నేర్పిస్తానన్నారు పవన్ కల్యాణ్
రాష్ట్రంలోని ఐదులక్షలమంది వాలంటీర్లు తన సైన్యం అని జగన్ అంటున్నారని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. ఈ వలంటీర్ వ్యవస్థను ఒక పోలీసు, రాజకీయ, అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థగా తయారుచేసి మరీ ప్రజలపైకి వదిలారని ఆరోపించారు.. ఒకపుడు హిట్లర్ ఇలాగే ఒక ఎస్ఏఎస్ వ్యవస్థను తయారుచేసి వదిలాడు. పరిస్థితిని ఇలాగే వదిలేస్తే వలంటీర్ వ్యవస్థ కూడా ఎస్ఏఎస్ కంటే ప్రమాదకరంగా వెళ్లిపోతుంది జాగ్రత్తంటూ ప్రజలను హెచ్చరించారు. నేరుగా పవన్ వాలంటీర్లను టార్గెట్ చేయడం ద్వారా.. వాలంటీర్ల వ్యవస్థపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తించడంలో సఫలమైనట్లు కనిపిస్తోంది. ఇది సహజంగానే వైసీపీకి ఆందోళన కలిగిస్తోందని చెప్పొచ్చు.













