కమలం వర్సెస్ ఫ్యాన్..
నిన్నటివరకూ పరస్పరం గౌరవం ఇచ్చిపుచ్చుకున్న వైసీపీ, బీజేపీలు ఒక్కసారిగా బద్దశత్రువుల్లా మారాయి. ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆపార్టీల మధ్య మాటలతూటాలు పేలుతున్నాయి. మరీముఖ్యంగా ఏపీలో 5 లక్షల కోట్ల అవినీతి జరిగిందంటూ కేంద్రహోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై ఫ్యాన్ పార్టీ మండిపడుతోంది. జగన్ మినహా మిగిలిన వైసీపీ నేతలందరూ.. అమిత్ షా వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. కోట్లు అంటే ఉలెన్ కోట్లని అమిత్ షా అనుకుంటున్నారా అని మంత్రి బొత్స బహిరంగంగానే విమర్శించారు..
అమిత్ షాకు, బీజేపీకి ఏపీపై అంత ప్రేమే ఉంటే.. విభజన సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తూతూ మంత్రంగా 50 కోట్లు విడుదల చేసి, ఏదో రాష్ట్రానికి చేసేసినట్లు బిల్డప్ ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీకి ప్రత్యేకహోదా కావాలని కలిసినప్పుడల్లా అడిగినా ఎందుకు పట్టించుకోలేదో చెప్పాలని నిలదీస్తున్నారు. గుజరాత్ కు తప్ప మిగిలిన రాష్ట్రాలకు ఒరగబెట్టేందేటని చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎలాగూ బీజేపీ తమతో కలిసిరాదని జగన్ క్లారిటీ ఇచ్చినప్పటి నుంచి, వైసీపీ నేతలు జోరు పెంచారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్రహోంమంత్రి అమిత్ షాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఏపీలో ఉనికే లేని బీజేపీ ఉంటే ఎంత, పోతే ఎంత అన్నట్లుగా మాట్లాడుతున్నారు. బీజేపీ, టీడీపీ పొత్తుకుదిరినా.. జోగిజోగి రాసుకున్నట్లుంటుంది తప్పా, ఒరిగేదేమీ ఉండదంటున్నారు. తాము చేపట్టిన సంక్షేమపథకాలే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు.. తాము అవినీతి వైసీపీ సర్కార్ విధానాలను ఎప్పుడూ సమర్థించలేదని ఏపీ బీజేపీనేతలు చెబుతున్నారు. ఎక్కడ అవినీతి జరిగినా, వెంటనే తాము స్పందించేవాళ్లమంటున్నారు. అంతే కాదు.. అమిత్ షాకు ఏం తెలుసంటూ మంత్రులు మాట్లాడడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతీ విషయాన్ని తాము హైకమాండ్ కు పూసగుచ్చినట్లు వివరిస్తున్నామని.. వాటి ఆధారంగానే తమ అగ్రనేత మాట్లాడారని సమర్థించుకుంటున్నారు. ఫ్యాన్ పార్టీ అవినీతికి కేరాఫ్ అడ్రస్ అంటూ గట్టిగానే బదులిస్తున్నారు.













