వైసీపీ నేతల మౌనం వెనుక కారణం అదే..వర్ల రామయ్య
ఆంధ్రాలో ఎన్నికలకు ముందు ప్రచారంలోనే కాక సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉన్న వైసీపీ నేతలు ఆ తరువాత చాలా సైలెంట్ అయిపోయారు. ఈ విషయాన్ని హైలెట్ చేస్తూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఈరోజు మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ శ్రేణులలో ఓటమి భయం ఏర్పడడం వల్లే మౌనంగా ఉన్నారు అని ఎద్దేవా చేశారు. అంతేకాదు ఎన్నికల అనంతరం అమెరికాకు వెళ్ళిన తమ అధినేత రాష్ట్రానికి తిరిగి వస్తాడని.. మరి లండన్ వెళ్లిన జగన్ తిరిగి వస్తారో ..రారో .. తెలియాల్సి ఉందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
మా నాయకుడు రిటర్న్ టికెట్ గురించి నాకు తెలుసు.. మరి మీ నాయకుడు ఎప్పుడు వస్తున్నాడు.. రిటర్న్ టికెట్ కు సంబంధించిన వివరాలు మీకు తెలుసా? అని వైసీపీ నేతలకు సవాల్ విసిరుతున్నాడు. పోలింగ్ ముగిసిన రోజు నుంచే వైసీపీ నేతలలో ఎక్కడలేని నిరాశ, నిస్పృహలు పెరిగిపోయాయని.. అందుకే ఎక్కడి వారు అక్కడ సైలెంట్ గా ఉన్నారని వ్యాఖ్యానించారు.
ఇక వెబ్ కాస్టింగ్ విషయం గురించి మాట్లాడుతూ.. సజ్జల రామకృష్ణారెడ్డి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని.. ఏమీ తెలియకపోయినా అన్ని తెలిసిన మేధావిలా మాట్లాడడం అతనికే చెల్లుతుందని సెటైర్లు వేశారు. వెబ్ కాస్టింగ్ అనేది జిల్లాలోని కలెక్టర్లు, నియోజకవర్గానికి సంబంధించిన ఆర్వోలు పర్యవేక్షిస్తుంటారు. ఎన్నికల సంఘం ఆధీనంలో ఉన్న వెబ్ కాస్టింగ్ కు చంద్రబాబుకు ఏమిటి సంబంధం అని మండిపడ్డారు. పోలింగ్ తీరు అర్థం అయిన తర్వాత సగం మంది వైసీపీ నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని అన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొన్నిచోట్ల కౌంటింగ్ కి కూడా వైసీపీ ఏజెంట్లుగా ఉండడానికి ఎవరూ రావడం లేదని.. అన్ని రోజులు ఒకలాగా ఉండవని.. ప్రజలు తిరగబడితే పరిస్థితి ఎలా ఉంటుందో జూన్ 4న తెలుస్తుంది అని రామయ్య అన్నారు.













