మంత్రుల బస్సు యాత్ర.. మహానాడుకు పోటీ కాదు
మంత్రుల బస్సు యాత్ర మహానాడుకు పోటీ కాదని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. మంత్రులు చేపట్టిన బస్సు యాత్ర కృష్ణా జిల్లా గన్నవరం చేరుకుంది. ఈ నేపథ్యంతో పేర్నినాని మీడియాతో మాట్లాడుతూ మహానాడు నిర్వహించే అర్హత టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబానికి లేదని అన్నారు. షెడ్యూల్ ప్రకారం 2024లోనే వైసీపీ ఎన్నికలు వెళ్తుందని స్పష్టం చేశారు. సీఎం జగన్ ఎన్నికల ముందు చేపట్టిన పాదయాత్రకు ప్రజలు ఎలా వచ్చేవారో బస్సు యాత్ర సందర్భంగా అలాగే వస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో సామాజిక న్యాయం మాటల్లోనే ఉండేదని, చేతల్లో కనబడేది కాదని పేర్కొన్నారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే సామాజిక న్యాయం కార్యరూపం దాల్చిందన్నారు. గడిచిన ఎన్నికల్లో 50 శాతం ఓట్లతో జగన్ గెలిచారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు 60 శాతానికి పైగా ఓట్లు వచ్చాయని తెలిపారు. మిగతా 40 మంది వ్యతిరేకించారని, అలాంటి వాళ్ల ఇంటికి వెళ్లినప్పుడు అర్హత లేకపోయినా ఫలానా పథకం రాలేదని ప్రశ్నిస్తున్నారు. అలా ప్రశ్నించినంత మాత్రాన అది వ్యతిరేకత కాదన్నారు. ఆర్థిక స్థితిగతుల వల్ల ఉద్యోగులు అడిగినంత పీఆర్సీని ఇవ్వలేకపోయినట్లు తెలిపారు. ఆశించిన మేర ఇవ్వలేకపోతున్నట్లు జగన్ నిజాయతీగా చెప్పారని తెలిపారు.













