వైసీపీని ఐప్యాక్ సర్వే గుబులు పుట్టిస్తోందా..?
ఆంధ్రప్రదేశ్ లో మరోసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. తాము ఈ ఐదేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు తమను కచ్చితంగా మరోసారి అధికారపీఠంపై కూర్చోబెడతాయని ఆ పార్టీ నేతలు గట్టి నమ్మకంతో ఉన్నారు. ఓ వైపు పార్టీని, మరోవైపు ప్రభుత్వాన్ని జగన్ బ్యాలెన్స్ చేసుకుంటూ నడిపిస్తున్నారు. వివిధ కార్యక్రమాల ద్వారా నిత్యం ప్రజల్లో ఉండేందుకు ట్రై చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఐప్యాక్ ద్వారా సర్వేలు చేయించుకుంటూ లోపాలను సరిదిద్దుకుంటున్నారు. అయితే తాజాగా ఐప్యాక్ అందించిన సర్వే వైసీపీని టెన్షన్ పెట్టిస్తున్నట్టు సమాచారం.
కొంతకాలం కిందట జాతీయ మీడియా సంస్థ టైమ్స్ నౌ ఓ సర్వే చేసింది. దేశవ్యాప్తంగా చేసిన ఆ సర్వేలో రాష్ట్రాలవారీగా కూడా ఫలితాలను వెల్లడించింది. ఇందులో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ మరోసారి క్లీన్ స్వీప్ చేస్తుందని తెలిపింది. లోక్ సభ ఎన్నికల్లో వైసీపీకి 24 స్థానాల వరకూ వస్తాయని.. ప్రతిపక్షంలో ఉన్న టీడీపీకి ఒక్క సీటు మాత్రమే దక్కుతుందని తెలిపింది. దీంతో వైసీపీ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. తాము ఈసారి 175కు 175 స్థానాలూ గెలవాలని టార్గెట్ గా పెట్టుకున్నాయని.. ఇప్పుడు అది నిజం కాబోతోందని చెప్పుకున్నారు వైసీపీ నేతలు. టైమ్స్ నౌ సర్వే విపక్ష టీడీపీ, జనసేనలకు అస్సలు మింగుడు పడలేదు.
తాజాగా మరో జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే తన మూడ్ ఆఫ్ ది నేషన్ ఫలితాలను వెల్లడించింది. ప్రతి రెండేళ్లకోసారి ఇండియా టుడే ఈ సర్వే నిర్వహిస్తూ ఉంటుంది. ఇవి వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటాయనే పేరుంది. ఇందులో ఏపీలో వైసీపీకి ఓటమి తప్పదని వెల్లడించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ ఒంటరిగానే 15 ఎంపీ స్థానాలు గెలుచుకుంటుందని.. వైసీపీకి 5-6 సీట్లు మాత్రమే దక్కుతాయని తెలిపింది. ఈ ఫలితాలను వైసీపీ అస్సలు అంగీకరించలేదు. టీడీపీ మాత్రం ఈ ఫలితాలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయని తెలిపింది. ఇంకొంచెం కష్టపడితే 20 పార్లమెంటు స్థానాలు గెలుచుకోవచ్చని చంద్రబాబు పార్టీ శ్రేణులకు సూచించారు.
అయితే తాజాగా ఐప్యాక్ టీమ్ జగన్ కు అందించిన సర్వే కూడా ఇండియా టుడే ఫలితాలకు దగ్గరగా ఉన్నట్టు తెలుస్తోంది. టీడీపీ శరవేగంగా పుంజుకుంటోందని.. ఒకవేళ ఆ పార్టీతో జనసేన కలిస్తే వైసీపీ ఓడిపోవడం ఖాయమని సర్వే తేల్చి చెప్పినట్టు సమాచారం. అందుకే ఆ రెండు పార్టీలను కలవకుండా చేయాలని.. అప్పుడే వైసీపీకి కాస్త మెరుగైన ఫలితాలు వస్తాయని సూచించినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే వైసీపీ నేతలు పదేపదే పవన్ కల్యాణ్ ను దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయాలని సవాల్ చేస్తూ రెచ్చగొడుతున్నారు. అయితే వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఈసారి ఎవరితోనైనా కలిసి పని చేసేందుకు తాను సిద్ధమని పవన్ కల్యాణ్ క్లారిటీ ఇవ్వడంతో తమ పప్పులు ఉడకట్లేదని వైసీపీ నేతలు భావిస్తున్నారు.













