కాపులపై కన్నేసిన వైసీపీ..! కీలక లీడర్లకు గాలం..!?
ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీలన్నీ వ్యూహప్రతివ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. తాము బలపడేందుకు, ప్రత్యర్థులను బలహీన పరిచేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ అంటేనే కులాల రాజకీయం. ఇక్కడ కులాలే కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే ఆయా కులాల్లో కీలక నేతలను తమవైపు తిప్పుకునేందుకు పార్టీలన్నీ ప్రయత్నిస్తుంటాయి. ఇప్పడు వైసీపీ, టీడీపీ, జనసేన ఈ పనుల్లో బిజీబిజీగా ఉన్నాయి. ముఖ్యంగా కాపు కులాన్ని దగ్గర చేసుకునేందుకు పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
ఏపీలో కాపులు కీలక నిర్ణేతలు. ప్రతి ఎన్నికల్లో కాపులు ఎటువైపు నిలిస్తే ఆ పార్టీ విజయం సాధిస్తూ ఉంటుంది. గత ఎన్నికల్లో కాపులు వైసీపీ వైపు నిలబడ్డారు. అందుకే ఆ పార్టీ ఘనవిజయం సాధించింది. ఈసారి కాపుల్లో చీలిక వచ్చిందనే సమాచారంతో వైసీపీ అప్రమత్తమైంది. వారిని మళ్లీ దగ్గరకు తీసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కాపుల్లో కీలక నేతనైన ముద్రగడ పద్మనాభం, హరిరామజోగయ్య, వంగవీటి రాధా.. తదితరులను తమ పార్టీలోకి లాక్కోవాలని వైసీపీ ట్రై చేస్తోంది.
ముద్రగడ పద్మనాభం వైసీపీ అనుకూలురిగానే ముద్రపడ్డారు. అయితే ఇటీవల సీట్ల విషయంలో వైసీపీకి, ముద్రగడకు మధ్య గ్యాప్ వచ్చింది. అందుకే ఆయన జనసేనలో చేరేందుకు ప్రయత్నించారు. అయితే జనసేన నుంచి సానుకూలత రాకపోవడంతో మళ్లీ ఆయన వైసీపీ వైపు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈనెల 12న ఆయన వైసీపీ కండువా కప్పుకుంటారని సమాచారం. మరోవైపు హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాశ్ ఇప్పటికే జగన్ ను కలిసి పార్టీలో చేరిపోయారు. జోగయ్య మాత్రం ఇప్పటికీ పవన్ కల్యాణ్ కు లేఖలు రాస్తూ తాను శ్రేయోభిలాషినని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.
వంగవీటి రాధాను కూడా వైసీపీలోకి తీసుకొచ్చేందుకు ఆ పార్టీ నేతలు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, పేర్ని నాని తదితరులు వంగవీటి రాధాతో సమావేశమై ఈ మేరకు చర్చలు జరిపారు. ఆయన వస్తే మచిలీపట్నం పార్లమెంటు స్థానం నుంచి బరిలోకి దింపాలనేది వైసీపీ ఆలోచన. అయితే ఆయన ఇప్పటివరకూ సానుకూలంగా స్పందించలేదు. మొత్తానికి ఈ ముగ్గురినీ తమ పార్టీలోకి తెచ్చుకోవడం ద్వారా కాపులను ఆకట్టుకోవాలనే వ్యూహంలో ఉంది వైసీపీ. మరి చూడాలి ఆ పార్టీ స్ట్రాటజీ ఎంతమేర వర్కవుట్ అవుతుందో..!













