Alla Nani: గుట్టుచప్పుడు కాకుండా టీడీపీలో చేరిన ఆళ్ల నాని..! ఏలూరులో చల్లారని అసంతృప్తి..!!
మాజీ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) తెలుగుదేశం (TDP) పార్టీలో చేరిపోయారు. వైసీపీ (YCP) అధికారంలో ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రిగా పని చేశారు ఆళ్ల నాని (Alla Nani). వైసీపీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీకి దూరంగా ఉంటున్న ఆళ్ల నాని.. కొంతకాలం తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజకీయాల్లో కొనసాగే ఉద్దేశం తనకు లేదని.. అందుకే రాజీనామా చేశానని చెప్పుకొచ్చారు. అయితే ఈ వయసులోనే ఆయన రాజకీయ సన్యాసం తీసుకుంటారంటే ఎవరూ నమ్మలేదు. పైగా ఆయన జనసేనలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని భావించారు. తర్వాత టీడీపీలో చేరేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలొచ్చాయి.
వాస్తవానికి ఆళ్ల నానిని చేర్చుకునేందుకు టీడీపీ అధిష్టానం (TDP High Command) ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దాదాపు మూడు నెలల కిందటే ఆళ్ల నాని టీడీపీలో చేరాల్సింది. ఈ మేరకు ఏర్పాట్లు కూడా రెడీ అయ్యాయి. రేపు చేరతారనుకునేలోపు ఏలూరు (Eluru Assembly) నియోజకవర్గ నేతలంతా ఆళ్ల నాని చేరికను వ్యతిరేకిస్తూ నిరసన గళం విప్పారు. దీంతో అధిష్టానం వెనక్కు తగ్గింది. ఆళ్ల నాని చేరికను వాయిదా వేసింది. అంతేకాక ఆళ్ల నానిని కచ్చితంగా చేర్చుకోవాల్సిందేనని.. ఈ మేరకు కేడర్ అంతటినీ ఒప్పించాలని ఆదేశిస్తూ ఆ బాధ్యతనను ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి (Eluru MLA Badei Bujji) పైన పెట్టింది. దీంతో అయిష్టంగానే బడేటి బుజ్జి ఆ బాధ్యతను తలకెత్తుకుని కేడర్ కు నచ్చజెప్పారు. దీంతో నిన్న ఆళ్ల నాని పార్టీ కండువా కప్పుకున్నారు.
వాస్తవానికి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మిగిలిన నేతల్లాగా ఆళ్ల నాని నోరు జారలేదు. టీడీపీ నేతలెవరినీ టార్గెట్ చేయలేదు. అయితే ఏలూరు నియోజకవర్గంలో మాత్రం వైసీపీ బలోపేతం కోసం టీడీపీ కేడర్ ను గట్టిగా తొక్కేశారు. కొంతమంది కార్యకర్తలు, సెకండరీ కేడర్ నేతలపై పోలీసులతో కేసులు పెట్టించి వైసీపీలో చేరేలా ఒత్తిడి చేశారు. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల సమయంలో ఆళ్ల నాని రెచ్చిపోయారు. దీంతో ఆళ్ల నానిని టీడీపీ కేడర్ ఇప్పటికీ వ్యతిరేకిస్తోంది. నియోజకవర్గంలో ఆళ్ల నాని తమను ఎన్నో ఇబ్బందులు పెట్టారని చెప్పుకొచ్చింది. అయితే హైకమాండ్ వినే పరిస్థితిలో లేదు కాబట్టి అయిష్టంగానే కేడర్ అంగీకరించింది.
అయితే ఇప్పుడు కూడా ఆళ్ల నాని చేరికపై అసంతృప్తి వ్యక్తం చేశారు ఎమ్మెల్యే బడేటి బుజ్జి. ఇది చల్లారిస్తే చల్లారిపోయే అసంతృప్తి కాదన్నారు. పార్టీ మాట జవదాటకూడదనే ఉద్దేశంతోనే ఆయన చేరికను తామంతా ఒప్పుకున్నామన్నారు. అయితే ప్రజల విశ్వాసం కోల్పోయినప్పుడు ఏ పార్టీలో ఉన్నా ఒక్కటేనన్నారు. ప్రజల మన్ననలు పొందినప్పుడే మనకు విలువ ఉంటుందన్నారు. టీడీపీ మహాసముద్రం లాంటిదని, ఎవరైనా చేరొచ్చు, ఎవరైనా పోవచ్చు అని బడేటి బుజ్జి అన్నారు. దీన్నిబట్టి అయిష్టంగానే ఏలూరు టీడీపీ నేతలు ఆళ్ల నానిని స్వాగతించినట్లు చెప్తున్నారు. అయితే ఇప్పుడున్న నేతలకు ఇబ్బంది కలగకుండా ఆళ్ల నాని కుటుంబానికి న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు సమాచారం.













