ఏపీలో వైసీపీ క్లీన్ స్వీప్.. టైమ్స్ నౌ – ఈటీజీ సర్వేలో వెల్లడి!
ఆంధ్రప్రదేశ్ లో ఈసారి క్లీన్ స్వీప్ చేయాలనేది వైసీపీ అధినేత, సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్లాన్. అందుకే ఆయన వై నాట్ 175 టార్గెట్ పెట్టుకుని పని చేస్తున్నారు. గత ఎన్నికల్లో 151 సీట్లు వచ్చినప్పుడు ఈసారి 175 ఎందుకు రాకూడదనేది జగన్ ఆలోచన. గత ప్రభుత్వాలతో పోల్చితే మనం ఎంతో చేశామని, అలాంటప్పుడు కచ్చితంగా ప్రజలు తమను ఆదరిస్తారని జగన్ చెప్తున్నారు. బహుశా వాటి ప్రభావం పనిచేస్తోందో ఏమో .. వచ్చే ఎన్నికల్లో జగన్ మరోసారి క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని టైమ్స్ నౌ – ఈటీజీ సర్వే వెల్లడించింది. గత ఎన్నికలకు మించి సీట్లు సాధిస్తారని వెల్లడించింది.
ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ 4 స్థానాలను కోల్పోయింది. ఒక ఎమ్మెల్యే స్థానంతో పాటు 3 పట్టభద్రుల స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. సొంత పార్టీ ఎమ్మెల్యేలే ప్రత్యర్థి పార్టీకి ఓటు వేయడంతో వైసీపీ ఖంగుతింది. తమ పార్టీ నేతలు గీత దాటరని జగన్ ఇన్నాళ్లూ నమ్ముతూ వచ్చారు. అయితే తొలిసారి పార్టీలో అసంతృప్తి స్వరాలు బయటికొచ్చాయి. అది కూడా నలుగురు ఎమ్మెల్యేలు ఒకేసారి అలా పార్టీని కాదని ఓటేయడం పార్టీలో సంచలనం కలిగించింది. మరోవైపు పట్టభద్రుల ఎన్నికల్లో మూడు స్థానాల్లో ఓటమి చెందడం కూడా ఆశ్చర్యం కలిగించింది. పట్టభద్రులంటే డైరెక్ట్ ఓటర్లే. వాళ్లిచ్చిన తీర్పును వైసీపీ అస్సలు జీర్ణించుకోలేకపోయింది.
ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత జగన్ ఆత్మావలోకనం చేసుకున్నారు. పార్టీ పరిస్థితిపై కాస్త ఆందోళన చెందారు. ఆ తర్వాత జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమ సమీక్షలో ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకునేలా మాట్లాడారు. గతంలో ఆదేశాత్మక ధోరణతో సాగే జగన్ ప్రసంగం.. ఆ రోజు మాత్రం స్మూత్ గా సాగింది. దీంతో జగన్ భయపడ్డారని, ఎమ్మెల్యేలకు వార్నింగ్ లు ఇవ్వకుండా వాళ్లతో మంచిగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారని అందరూ భావించారు. ప్రతి ఇంటికీ ఏదో ఒక రూపంలో లబ్ది చేకూర్చామని, ఇదే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని జగన్ సూచించారు. ఆ తర్వాత ఫలితాన్ని దేవుడికే వదిలేద్దామని చెప్పారు.
జగన్ అలా మాట్లాడడం చూసి వచ్చే ఎన్నికల్లో ఫలితం రివర్స్ అవుతుందేమోనని చాలా మంది కంగారు పడ్డారు. అయితే అలాంటి అనుమానాలను పటాపంచలు చేస్తూ టైమ్స్ నౌ – ఈటీజీ సర్వే ఇచ్చింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో 23 నుంచి 25 ఎంపీ స్థానాలను వైసీపీ దక్కించుకుంటుందని తేల్చింది. అంటే రాష్ట్రంలోని మొత్తం 25 సీట్లను దక్కించుకుంటుందన్నమాట. ఇది వైసీపీకి గొప్ప ఉత్సాహాన్నిచ్చే వార్త. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత నిరుత్సాహంలో ఉన్న వైసీపీ శ్రేణులకు ఈ సర్వే కొత్త ఉత్సాహన్నిచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ సర్వేలో ప్రామాణికత ఎంత అనే దానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టైమ్స్ నౌ చానల్ తో జగన్ ప్రభుత్వం కలసి పని చేస్తోంది. రాష్ట్రానికి బ్రాండింగ్ కల్పించేందుకు ఆ చానల్ తో ఒప్పందం చేసుకుందని తెలుస్తోంది. అలాంటి చానల్ ఇచ్చే సర్వే ఫలితాలు ఇలాగే ఉంటాయని, ఇవి నిజమనుకుని ఉప్పొంగితే అసలుకే మోసం వస్తుందని పలువురు సూచిస్తున్నారు.













