Pawan Kalyan: యాత్ర పూర్తి..యాక్షన్ మోడ్ లో పవన్
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేపట్టిన ధర్మ పరిరక్షణ యాత్ర ( Dharma parirakshana yatra) శనివారం విజయవంతంగా ముగిసింది. మూడు రోజుల పాటు కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో సాగిన ఈ యాత్రలో ఆయన తన తనయుడు అకీరా నందన్ తో కలిసి పాల్గొన్నారు. మొదట కేరళ వెళ్లిన పవన్ అక్కడ నుంచి తన యాత్రను ప్రారంభించి, అనంతరం తమిళనాడుకు వెళ్లారు. అక్కడ ఆయన నిర్దేశించుకున్న ఆలయాలను సందర్శించి, తన ఆధ్యాత్మిక యాత్రను పూర్తి చేసుకున్నారు.
మూడురోజులపాటు పవన్ కళ్యాణ్ సాగించిన ఈ యాత్ర ముగిసిన వెంటనే, ఆయన నేరుగా గన్నవరం ఎయిర్ పోర్టుకు (Gannavaram Airport) చేరుకున్నారు. అక్కడి నుంచి మంగళగిరిలోని ( Mangalagiri) జనసేన పార్టీ ( Janasena Party) కార్యాలయానికి వెళ్లారు. యాత్రకు బయల్దేరే ముందు పవన్ హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొంతకాలం విశ్రాంతి తీసుకొని, ఆ తర్వాత యాత్రకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో, ఆయన డిప్యూటీ సీఎం విధులకు కొంతకాలంగా దూరంగా ఉన్నారు.
తంజావూరులో యాత్రను ముగించిన పవన్ కళ్యాణ్ నేరుగా హైదరాబాద్ వెళ్ళే అవకాశం ఉన్నప్పటికీ, ఆయన అందుకు భిన్నంగా గన్నవరం చేరుకున్నారు. దీనిని చూస్తే, పవన్ కళ్యాణ్ మరింతకాలం విధులకు దూరంగా ఉండకుండా, వెంటనే తన రాజకీయ బాధ్యతలను స్వీకరించాలని నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది. యాత్ర అనంతరం ఆయన గన్నవరం చేరుకుని పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారా తన రాజకీయ కర్తవ్యాలను కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా, శనివారం రాత్రి నిర్వహించనున్న ఎన్టీఆర్ ట్రస్ట్ మ్యూజికల్ నైట్ కార్యక్రమంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు తో కలిసి పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ సంగీత దర్శకుడు తమన్ నేతృత్వం వహించనుండగా, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ హోదాలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి దీనిని నిర్వహిస్తున్నారు. రాజకీయాలతో పాటు పవన్ కళ్యాణ్ సామాజిక కార్యక్రమాలలో కూడా చురుగ్గా పాల్గొంటూ వస్తున్నారు.
పవన్ కళ్యాణ్ చేపట్టిన ఈ ధర్మ పరిరక్షణ యాత్ర ఆధ్యాత్మికతకు మాత్రమే పరిమితం కాకుండా, రాజకీయంగా కూడా ఓ సందేశాన్ని అందించిందని విశ్లేషకులు భావిస్తున్నారు. తన ఆరోగ్య సమస్యల కారణంగా కొన్ని రోజులుగా రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉన్నప్పటికీ, తిరిగి ప్రజల్లోకి వచ్చేందుకు ఆయన ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ యాత్ర ద్వారా పవన్ తన అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు ఆధ్యాత్మికంగా మానసికంగా బలాన్నిచ్చినట్లుగా చెబుతున్నారు. యాత్ర ముగిసిన వెంటనే ఆయన పార్టీ కార్యకలాపాలను ప్రారంభించడం, రాజకీయాల్లో తన పాత్రను మరింత బలపరచుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది.













