యార్లగడ్డను లైట్ తీసుకున్న వైసీపీ..! టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధమైన గన్నవరం నేత..!?
గన్నవరం నియోజకవర్గం ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. వల్లభనేని వంశీ ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిద్యం వహిస్తుండడమే ఇందుకు కారణం. ఆయన ఏదో ఒక రూపంలో వార్తల్లో ఉంటారు కాబట్టి గన్నవరం ఎప్పుడూ హాట్ టాపిక్ గా నిలుస్తుంది. ఇప్పుడు గన్నవరం రాజకీయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. గన్నవరం గత ఎన్నికల్లో టీడీపీ దక్కించుకుంది. టీడీపీ తరపున పోటీ చేసిన వల్లభనేని వంశీ గెలుపొందారు. యార్లగడ్డ వెంకట్రావ్ ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే టీడీపీ నుంచి గెలిచిన వంశీ వైసీపీలో చేరడంతో ఇక్కడ యార్లగడ్డకు ప్రాధాన్యత లేకుండా పోయింది.
గన్నవరంలో ఓడిపోయినా రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడంతో యార్లగడ్డ వెంకట్రావు అందులోనే కొనసాగుతూ వచ్చారు. ముందు నుంచి తాను పార్టీకి అండగా ఉన్నానని.. కచ్చితంగా జగన్ తనకు న్యాయం చేస్తారని ఆశించారు. తనకు ఏదో ఒక పదవి కట్టబెడతారని భావించారు. అయితే యార్లగడ్డ ఆశలు అడియాశలే అయ్యాయి. రెండేళ్లుగా జగన్ అపాయిట్మెంట్ కోసం యార్లగడ్డ ప్రయత్నిస్తున్నా దొరకట్లేదని సమాచారం. ఇన్నాళ్లూ పార్టీలోనే ఉంటూ వచ్చిన యార్లగడ్డ.. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. తనను నమ్ముకున్న కార్యకర్తలతో సమావేశమై వాళ్ల అభిప్రాయం తీసుకున్నారు.
యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలోకి వెళ్తారనే ప్రచారం జోరుగా సాగుతోది. దీనిపై స్పందించిన వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి.. యార్లగడ్డ పార్టీలో ఉండాలో లేదో ఆయన ఇష్టం అన్నారు. పార్టీని వీడాలో లేదో నిర్ణయించుకునే అధికారం ఆయనకు ఉంటుందన్నారు. దీన్ని బట్టి ఆయన ఉన్నా పోయినా పెద్దగా నష్టం లేదనేలా సజ్జల మాట్లాడారు. ఇదే అంశాన్ని యార్లగడ్డ వెంకట్రావు తన అనుచరులతో చర్చించారు. రెండేళ్లుగా తాను జగన్ పిలుపుకోసం వెయిట్ చేస్తున్నానని.. అయినా పిలుపు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చినా తనను నమ్ముకున్న వాళ్లకు న్యాయం చేయలేకపోయానని.. ఇందుకు బాధగా ఉందని చెప్పారు. అనుచరుల నిర్ణయం మేరకు నడుచుకుంటానని స్పష్టం చేశారు.
అయితే టీడీపీలోకి వెళ్లేందుకు యార్లగడ్డ వెంకట్రావు నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. వైసీపీ అధిష్టానం తనను పట్టించుకోకపోవడాన్ని యార్లగడ్డ జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే టీడీపీలో చేరి వచ్చే ఎన్నికల్లో పోటి చేసి తన సత్తా చాటాలనుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను కచ్చితంగా బరిలోకి దిగబోతున్నట్టు యార్లగడ్డ తన అనుచరులకు వెల్లడించారు. దీన్ని బట్టి త్వరలోనే ఆయన టీడీపీ కండువా కప్పుకోవడం ఖాయమని తెలుస్తోంది. ఇదే జరిగితే మరోసారి వంశీ, వెంకట్రావు మధ్య పోటీ తప్పదు. అయితే ఈసారి పార్టీలు మారనున్నాయి.













